Sukhwinder Singh HP CM: హిమాచల్ సీఎంగా సుఖ్వీందర్ సింగ్ సుకు - ప్రకటించిన అధిష్ఠానం
Himachal CM: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా సుఖ్వీందర్ సింగ్ సుకు పేరుని కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది.
Himachal CM Sukhwinder Singh Sukhu:
ప్రతిభా సింగ్‌ను కాదని..
హిమాచల్ సీఎం పీఠంపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. సుఖ్వీందర్ సింగ్ సుకుని ముఖ్యమంత్రిగా ప్రకటించింది అధిష్ఠానం. దాదాపు రెండ్రోజుల పాటు ఈ విషయంలో ఎన్నో చర్చలు జరిగాయి. షిమ్లా వేదికగా కాంగ్రెస్ లీడర్లంతా సమావేశమయ్యారు. ప్రతిభా సింగ్‌ను సీఎం చేయాలని కొందరు ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. ఆఫీస్ ఎదుట కాస్త హడావుడి చేశారు. కానీ...అధిష్ఠానం మాత్రం ఆమె పేరుని పక్కన పెట్టేసింది. సుఖ్వీందర్ సింగ్ సుకు, రాజేందర్ రాణే, ముకేశ్ అగ్నిహోత్రి ఈ రేసులో మిగిలారు. అయితే..వీరిలో సుఖ్వీందర్ సుకుకి ఎమ్మెల్యేల మద్దతు ఎక్కువగా ఉండటం సహా...అధిష్ఠానం కూడా ఆయన వైపే మొగ్గు చూపింది. ఫలితంగా...రెండ్రోజుల సస్పెన్స్ తరవాత ఉత్కంఠకు తెర దించింది. ఇక ముకేశ్ అగ్నిహోత్రి, రాజేందర్ రాణాలకు డిప్యుటీ సీఎం పదవులు ఇవ్వాలని నిర్ణయించుకుంది. అయితే..ఈ నిర్ణయంపై ప్రతిభా సింగ్ మద్దతుదారులు అసంతృప్తిగా ఉన్నారు. షిమ్లాలోని పార్టీ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున గుమి గూడారు. ప్రతిభా సింగ్‌కు మద్దతుగా నినాదాలు చేశారు.
#WATCH | Supporters of Himachal Pradesh Congress president Pratibha Virbhadra Singh raise slogans in Shimla pic.twitter.com/zfeh5vODwp
— ANI (@ANI) December 10, 2022
ప్రతిభా సింగ్ విషయంలో కాంగ్రెస్ పెద్దలు వెనకడుగు వేయడానికి ఓ ప్రధాన కారణముంది. మండి నియోజకవర్గానికి ప్రతినిధిగా ఉన్న ఆమెకు సీఎం పదవి అప్పగిస్తే ఆ సీట్ ఖాళీ అవుతుంది. ఇప్పటికిప్పుడు మళ్లీ ఉప ఎన్నికలు పెట్టక తప్పదు. కానీ...ఈ ప్రాంతంలోని 10 సీట్లలో కాంగ్రెస్ 9 స్థానాలు కోల్పోయింది. ఇలాంటి సమయంలో మళ్లీ అక్కడ ఎన్నికలు పెట్టి ఓడిపోవడం ఎందుకు అన్న ఆలోచనలో ఉంది కాంగ్రెస్. అదీ కాకుండా...ప్రతిభా సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్‌కు కేబినెట్లో ఉన్నత పదవి ఇవ్వాలని భావిస్తోంది. అందుకే...ప్రతిభా సింగ్‌ను పక్కన పెట్టేసింది. హిమాచల్‌లో కాంగ్రెస్‌కు సచిన్ పైలట్ స్టార్ క్యాంపెయినర్‌గా వ్యవహరించారు. ఎన్నికల వ్యూహాలు రచించడంలోనూ పైలట్ కీలక పాత్ర పోషించారు. ప్రియాంక గాంధీ కూడా ఆయనకు అండగా నిలిచారు. తనదైన వ్యూహాలతో పార్టీని విజయ తీరాలకు చేర్చారు. ప్రియాంక, సచిన్ పైలట్ కలిసి చాలా చోట్ల ఎన్నికల ర్యాలీలు నిర్వహించారు. ఫలితాల తరవాత...సచిన్ పైలట్‌కు వెయిటేజ్ పెరిగిపోయిందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.