CM Delhi Tour : తెలంగాణ తీరు అసలు బాగాలేదు - కృష్ణా జలాలపై కేంద్రానికి జగన్ ఫిర్యాదు !
కృష్ణా జలాల విషయంలో తెలంగాణ తీరు బాగో లేదని జగన్ కేంద్రానికి ఫిర్యాదు చేశారు.
CM Delhi Tour : ఢిల్లీ పర్యటన లో ఉన్న ఎపీ ముఖ్యమంత్రి జగన్ ప్రధానితో సమావేశం అయిన తరువాత పలువురు కేంద్ర మంత్రులను కూడా కలుస్తున్నారు.ఇందులో భాగంగానే కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌తో సమావేశం అయ్యారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు మంజూరుతో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రితో జగన్ చర్చించారు. రాయలసీమ లిఫ్ట్‌ఇరిగేషన్ స్కీంకు సంబంధించి పర్యావరణ అనుమతులు మంజూరు పై మాట్లాడారు. కరవుతో అల్లాడే ప్రాంతానికి తాగునీరు సాగునీరు అందించడానికి ఈ పథకం అత్యంత కీలకమైనది వివరించిన సీఎం, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్లకు సంబందించి పలు అంశాలను కేంద్ర మంత్రికి వివరించారు.కృష్ణానది పై ఉన్న ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులలో తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, కృష్ణా రివర్ మేనేజిమెంట్ బోర్డు యొక్క అన్ని ఆపరేషనల్ ప్రోటోకాల్స్‌ను, ఒప్పందాలను, ఆదేశాలను ఉల్లంఘిస్తోందని జగన్ ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తనకు ఉన్న కృష్ణా నది పై వాటా హక్కులను కోల్పోవాల్సి వస్తోందని తెలిపారు. 2022–22, 2022–23 సంవత్సరాలలో తెలంగాణా రాష్ట్రం– సీజన్ ప్రారంభమైన తొలిరోజు నుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని వినియోగించడం ప్రారంభించిందని సీఎం కేంద్రమంత్రికి ఫిర్యాదు చేశారు.
శ్రీశైలం జలాశయంలో కనీస నీటి స్ధాయి 834 అడుగులు కంటే తక్కువగా ఉన్నప్పటికీ... తెలంగాణా ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తికి నీటి విడుదల చేయడంతో పాటు ..కృష్ణా రివర్ మేనేజిమెంట్ బోర్డు (కేఆర్‌ఎంబీ) ముందు కనీసం ఎలాంటి ఇండెంట్ కూడా లేకుండానే.... ఏకపక్షంగా నాగార్జున సాగర్, కృష్టా డెల్టాకు అవసరం లేనప్పటికీ నీటి విడుదల చేసిందని సీఎం వివరించారు. నీటి పారుదల అవసరాలకు విద్యుత్ ఉత్పత్తి అన్నది కేవలం యాధృచ్చికంగా మాత్రమే ఉంటుందనే విషయాన్ని స్పష్టం చేసిన సీఎం,విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతీ ఏటా 796 అడుగుల వరకు నీటిని దిగువకు విడుదల చేయడం వల్ల... శ్రీశైలం రిజర్వాయరులో కనీస నీటి మట్టం నిర్వహణకు సహకరించడం లేదన్నారు. దీని వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఇబ్బందిని గతంలోనే కేంద్రం దృష్టికి తీసుకువచ్చానని జగన్ తెలిపారు. శ్రీశైలంలో జలాశయంలో నీటిమట్టం 881 అడుగులకు చేరుకుంటే తప్ప... పోతిరెడ్డిపాడు నుంచి పూర్తిస్థాయిలో నీటి విడుదల సాధ్యంకాదని అన్నారు.పోతిరెడ్డి పాడు నుంచి కరువు పీడిత రాయలసీమ సాగు, తాగునీటి అవసరాలతో పాటు, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు, చెన్నై మహానగరానికి తాగు నీరు అందించడం సాధ్యం కాదని వివరించారు.తెలంగాణ ప్రభుత్వం అనధికారకంగా, ఎటువంటి పర్యావరణ అనుమతులు లేకుండానే పెద్ద ఎత్తున నిర్మిస్తున్న పాలుమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం(3టీఎంసీలు), దిండి పథకాలను 800 అడుగులు వద్ద నిర్మిస్తున్న విషయం ఇది వరకే కేంద్రం దృష్టికి తీసుకు వచ్చామని గుర్తు చేశారు,జగన్... ప్రాజెక్టుల వలన రిజర్వాయరు నీటి మట్టం 854 అడుగుల కంటే పైన నిర్వహించడం సాధ్యం కాదని, మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి కేటాయించిన నీటిని వాడుకోవడానికి కూడా సాధ్యపడదని ముఖ్యమంత్రి వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం(ఆర్‌ఎల్‌ఎస్)ను అమలు చేయడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదని, దీనిద్వారా రోజుకు 3 టీఎంసీల నీటిని టీజీపీ, ఎస్‌ఆర్‌బీసీ, జీఎన్‌ఎస్‌ఎస్‌లకు సరఫరా చేయగలుగుతామని వివరించారు.తెలంగాణా ప్రభుత్వం నిబంధనలు మరియు ప్రోటోకాల్స్‌ను పూర్తిగా విస్మరించి నీటిని విడుదల చేయడంతో అనుసరిస్తున్న అనుచిత వైఖరిని దృష్టిలో పెట్టుకుని.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను మరింత ప్రమాదంలో పడకుండా జాగ్రత్తపడగలమని, అంతకుమించి ఒక్క ఎకరా అదనపు ఆయుకట్టు కల్పించడంతో పాటు, ఒక్క చుక్క అదనపు నీటి నిల్వను కూడా పెంచడం లేదన్న విషయాన్ని కేంద్రమంత్రికి వివరించారు.ఈ ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ అనుమతులు మంజూరు కోసం కేంద్ర అటవీ పర్యావరణశాఖకు దరఖాస్తు చేశామని అనుమతులు ఇప్పించాలని కోరారు.
దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరియు అటవీపర్యావరణ శాఖ అధికారులకు మధ్య సమగ్ర చర్చలు జరిగాయని, అవసరమైన మొత్తం సమాచారం కూడా ఇప్పటికే అందించామని, ఈ ప్రాజెక్టు కోసం భూసేకరణ, అటవీ ప్రాంతం, వన్యప్రాణుల అభయారణ్యాల ప్రమేయం లేదని, మరియు ప్రాజెక్టు ఎకో సెన్సిటివ్ జోన్(ఈఎస్‌జెడ్) నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో పాటు ఇది కూడా కేవలం ప్రధాన కాలువకు పూర్తి స్ధాయిలో నీటిని అందించడం కోసమేనని కేంద్రమంత్రికి జగన్ వివరించారు. వీలైనంత త్వరలో రాయలసీమ లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు త్వరగా వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.