Red Sanders: చిత్తూరు పోలీసులు చాకచక్యం... చెన్నైలో భారీ ఎర్రచందనం డంప్ స్వాధీనం.. 11 టన్నుల దుంగలు పట్టివేత
ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్టలేకుండా పోతుంది. అంతర్ రాష్ట్ర స్మగ్లర్లు గట్టుచప్పుడు కాకుండా దుంగలు తరలిస్తుంటే చెన్నైలో చిత్తూరు పోలీసులు రూ.5 కోట్ల విలువైన దుంగలు స్వాధీనం చేసుకున్నారు.
తమిళనాడు రాజధాని చెన్నైలో భారీ ఎర్రచందనం డంప్‌ను చిత్తూరు పోలీసులు గుర్తించారు. ఈ తనిఖీల్లో మూడు వాహనాలతో పాటు రూ.5 కోట్ల విలువ గల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు అంతర్‌రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేశారు.
11 టన్నుల ఎర్రచందనం దుంగలు
చెన్నై నగరంలోని ఆవిడి ప్రాంతంలో భారీ ఎర్రచందనం డంప్‌ను చిత్తూరు పోలీసులు చాకచక్యంగా గుర్తించారు. పీలేరు రూరల్ సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవరకొండ గ్రామం వద్ద పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీలో పట్టుబడ్డ స్మగ్లర్ ను అదుపులోని తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. ఈ సమాచారం మేరకు చెన్నైలో ఎర్రచందనం డంప్ ను గుర్తించామని చిత్తూరు ఎస్పీ సెంథిల్ కుమార్ తెలిపారు. ఆవిడి ప్రాంతంలోని కన్నన్ ఫాంహౌస్ గోడౌన్‌లో దాచి ఉంచిన 11 టన్నుల బరువుగల 388 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు.
ఎర్రచందనం దుంగలతో పాటు రెండు కార్లు ఒక కంటైనర్ ను కూడా పోలీసులు సీజ్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. స్మగ్లింగ్ కు పాల్పడిన నిందితులు తమిళనాడు రాష్ట్రం తిరువళ్ళూరు జిల్లాకు చెందిన మనోజ్ కుమార్, అశోక్ కుమార్, ఎన్.శంకర్, చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఐతేపల్లికి చెందిన ఆనంద్ నాయుడులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు చెప్పారు. జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టామని, ప్రత్యేక బృందాలతో చెక్ పోస్టు వద్ద ప్రతి నిత్యం వాహన తనిఖీలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై కఠినమైన తీసుకుంటామని ఎస్పీ సెంధిల్ కుమార్ తెలిపారు.
అరుదైన వృక్షం... సరిహద్దులు దాటిపోతుంది
ఎర్రచందనం ఓ అరుదైన వృక్షం... బంగారంకన్నా ఎక్కువ ధర పలుకుతుంది. ఎర్రచందనం మన రాష్ట్రంలోని శేషాచలం కొండల్లో పెరుగుతుంది. ఈ విలువైన ఎర్రచందనాన్ని స్మగర్లు భారీగా తరలించుకుపోతున్నారు. చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా నిత్యకృత్యమైపోయింది. ఈ స్మగ్లింగ్ ను అడ్డుకునేందుకు పోలీసులు ఎన్ని పటిష్ట చర్యలు తీసుకుంటున్నా స్మగర్లు వారి కళ్లుకప్పి ఎర్ర చందనాన్ని తరలించుకుపోతున్నారు. టాస్క్‌ఫోర్స్, అటవీశాఖ, పోలీసులు నిత్యం వెయ్యికళ్లతో తనిఖీలు చేస్తున్నా స్మగ్లర్లు సరిహద్దులు దాటేస్తున్నారు. మరోవైపు స్మగ్లర్ల బరితెగింపు కూడా పతాకస్థాయికి చేరింది. ఏకంగా అధికారులపై దాడులకు తెగబడుతున్నారు.
ఈ ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకోవడం అధికారులకు సవాల్‌గా మారుతోంది. అటవీ అధికారులు తనిఖీల్లో నేరుగా వారిపై దాడులకు వెనుకాడడం లేదు. అరుదైన ఎర్రచందనం రాష్ట్ర, దేశ సరిహద్దులు దాటకుండా స్మగ్లర్ల పీచమణచాలనే అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి.