Monsoon Session Parliament: కేంద్రం మాస్టర్ ప్లాన్‌కు జెన్-జీ బ్రేక్ - పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లోనే డీలిమిటేషన్ బిల్లు ?
Delimitation Bill: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తీసుకు రావాలనుకున్న రాజ్యాంగ సవరణ బిల్లులపై జెన్-జీ ఆందోళనల ప్రభావం పడింది. ఈ బిల్లుల కోసం ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని అనుకుంటున్నారు.

Modi Govt Constitutional Amendment Bills: దేశ రాజకీయాన్ని శాశ్వతంగా మార్చివేసే దిశగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను ఒక చారిత్రక వేదికగా మలుచుకోవాలని భావించిన కేంద్ర ప్రభుత్వ వ్యూహాత్మక ప్రణాళిక అనూహ్యంగా గందరగోళంలో పడింది. వన్ నేషన్ - వన్ ఎలక్షన్ , నియోజకవర్గాల పునర్విభజన , అలాగే చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల తక్షణ అమలుకు అవసరమైన కీలక రాజ్యాంగ సవరణ బిల్లులను ఈ సమావేశాల్లోనే ఆమోదింపజేసుకోవాలని కేంద్రం భావించింది. దీని కోసం అవసరమైన రాజ్యాంగ సవరణ మెజారిటీని, మిత్రపక్షాల మద్దతును పక్కాగా సమకూర్చుకుని రంగం సిద్ధం చేసుకున్నప్పటికీ, సభ లోపలా వెలుపలా ఎదురైన తీవ్ర నిరసనలు మోదీ ప్రభుత్వ ముందస్తు లెక్కలను తలకిందులు చేశాయి.
జెన్ జీ నిరసనలు.. విపక్షాల ఆందోళనలు
ఢిల్లీ వీధుల్లో అనూహ్యంగా ఉవ్వెత్తున లేచిన జెన్-జీ యువత, విద్యార్థి సంఘాల ఆందోళనలు పార్లమెంట్ వాతావరణాన్ని పూర్తిగా వేడెక్కించాయి. నిరుద్యోగం, పోటీ పరీక్షల లోపాలు, రాజ్యాంగ మార్పులపై యువతలో వ్యక్తమవుతున్న అసంతృప్తిని ఆసరాగా చేసుకుని విపక్ష ఇండియా కూటమి పార్లమెంట్‌లో తీవ్ర స్థాయిలో నిరసనలకు దిగింది. ఉభయ సభల ప్రారంభం నుంచే వెల్‌లోకి దూసుకెళ్లడం, సభా కార్యక్రమాలను స్తంభింపజేయడంతో పాటు, రోడ్లపై జరుగుతున్న జెన్-జీ ఆందోళనలకు మద్దతుగా ప్రతిపక్షాలు గళమెత్తడంతో కేంద్ర ప్రభుత్వం అనుకోని రక్షణత్మక వైఖరిలో వెళ్లాల్సి వచ్చింది.
పూర్తి మద్దతుతో రెడీ అయిన కేంద్రం
వాస్తవానికి, 2029 జాతీయ ఎన్నికల నాటికి న్ నేషన్ - వన్ ఎలక్షన్' అమలు చేయడంతో పాటు, డీలిమిటేషన్ ప్రక్రియ ఆధారంగా మహిళా రిజర్వేషన్లను తక్షణమే పట్టాలెక్కించడం ద్వారా దేశవ్యాప్తంగా ఒక పెద్ద రాజకీయ మైలేజీ పొందాలని బీజేపీ భావించింది. అయితే, ఈ బిల్లుల వెనుక దక్షిణ భారత రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోతుందనే ఆందోళనలతో పాటు, సమాఖ్య వ్యవస్థకు విఘాతం కలుగుతుందనే ప్రధాన విమర్శలు వెల్లువెత్తాయి. దీనికి తోడు యువత రోడ్లపైకి వచ్చి వినూత్న రీతిలో సోషల్ మీడియా వేదికగా నిరసనలు చేపట్టడంతో ప్రతిపక్షాల బలం ఊహించని విధంగా రెట్టింపు అయింది. సభలో గందరగోళం మధ్య బలవంతంగా బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకుంటే, అది ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధం అనే ముద్ర పడే ప్రమాదం ఉందని కేంద్రం వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. రాజ్యాంగ సవరణ బిల్లులకు మూడింట రెండొంతుల మెజారిటీతో పాటు సభ ప్రశాంతంగా జరగడం కీలకం. అందుకే ప్రత్యేక సమావేశాలను ఆగస్టు పదిహేను తరవాత నిరవహించాలన్న ఆలోచన చేస్తు్తోంది.
ప్రత్యేక సమావేశాల్లో ఆమోదం
ప్రత్యేకంగా రాజ్యాంగసవరణ ల కోసం పార్లమెంట్ ను సమావేశ పరిస్తే అదే టాపిక్ పై చర్చించవచ్చు.
వర్షాకాల సమావేశాలను పూర్తి స్థాయిలో తమ పొలిటికల్ అజెండాకు తిరుగులేని వేదికగా మార్చుకోవాలనుకున్న కేంద్రం, జెన్-జీ నిరసనలు మరియు విపక్షాల ఐక్యపోరాటం ముందు తాత్కాలికంగా బ్రేకులు వేయక తప్పలేదు. ఈ చారిత్రక బిల్లులపై వెనక్కి తగ్గడం ప్రతిపక్షాలకు రాజకీయ ఉత్సాహాన్ని ఇవ్వగా, కేంద్రం తన తదుపరి వ్యూహాన్ని ఏ విధంగా అమలు చేస్తుందనేది రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారనుంది.
ట్రెండింగ్ వార్తలు






















