Central Vista Project: నూతన రక్షణ భవనాలను ప్రారంభించనున్న మోదీ.. ఇవే ప్రత్యేకతలు
రక్షణ శాఖ నూతన భవనాలను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించనున్నారు. అధునాతన సాంకేతికత సహా సౌకర్యాలతో ఈ భవనాలను నిర్మించారు.
సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రక్షణశాఖ నూతన భవనాలను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించనున్నారు. రక్షణశాఖలో పనిచేసే 7000 మందికి పైగా ఉద్యోగులు ఈ భవనాల్లోకి మారనున్నారు. వీరు ప్రస్తుతం దిల్లీలోని 27 వివిధ కార్యాలయాల్లో పనిచేస్తున్నారు.
నూతన భవనాలు..
సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా కస్తూర్బా గాంధీ మార్గ్, ఆఫ్రికా అవెన్యూ ప్రాంతాల్లో రూ.775 కోట్ల వ్యయంతో ఆధునిక హంగులతో నిర్మించిన రెండు నూతన భవనాల్లోకి వీరు మారనున్నారు.
ప్రత్యేకతలు..
- సౌత్‌బ్లాక్ వద్ద ఉన్న దల్‌హౌసీ రోడ్‌లో గల ప్రస్తుత రక్షణ కార్యాలయాన్ని ప్రధాని నివాసం సహా నూతన కార్యలయం కోసం అభివృద్ధి చేయనున్నారు.
- ఆఫ్రికా అవెన్యూ బిల్డింగ్ మొత్తం నాలుగు బ్లాకులుగా నిర్మించారు. 5.08 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉంది. కస్తూర్బా గాంధీ మార్గ్‌లో ఉన్న భవనం మూడు బ్లాకులతో 4.52 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు.
- ఈ రెండు కాంప్లెక్స్‌లలో మొత్తం 1500 కార్లు పార్క్ చేసే సామర్థ్యం ఉంది. ఈ రెండు భవనాల్లో అత్యాధునిక సౌకర్యాలు సహా వైఫై కనక్టివిటీ, క్యాంటిన్లు, బ్యాంకు సేవలు వంటి సదుపాయాలు ఉన్నాయి.
- సెంట్రల్ విస్తా ప్రాజెక్టులో భాగంగా గృహ నిర్మాణ శాఖ, నగర అభివృద్ధి శాఖలు సంయుక్తంగా ఈ నూతన భవనాలను నిర్మించాయి. హరిత వాతావరణంలో ఈ భవనాలు ఉన్నాయి.
- భవనాలు నిర్మణ సమయంలో అక్కడ ఉన్న చెట్లను నరికివేయకుండా వాటిని అలానే ఉంచినట్లు అధికారులు తెలిపారు.
సెంట్రల్ విస్టా..
ప్రజాస్వామ్య దేవాలయంగా పరిగణించే పార్లమెంట్ నూతన భవనంలో అణువణువనా భారతీయత ప్రతిబింబించనుంది. లోక్‌సభ పైకప్పు పురివిప్పి ఆడుతున్న నెమలి ఆకృతిలో, రాజ్యసభ పైకప్పు విరబూసిన కమలం రూపంలో ఉండనున్నాయి. జాతీయ వృక్షమైన మర్రిచెట్టు పార్లమెంట్‌లో అంతర్భాగంగా నిలువనుంది.
సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా ఉపరాష్ట్రపతి నివాసాన్ని మార్చనున్నారు. ప్రభుత్వ కార్యాలయాల కోసం శాస్త్రి భవన్, నిర్మాణ్ భవన్, ఉద్యోగ్ భవన్, కృషి భవన్, వాయు భవన్ ఇలా 10 నూతన భవనాలు ఏర్పాటు కానున్నాయి.
అయితే ఈ సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు విమర్శలు కురిపిస్తున్నాయి. కరోనా సంక్షోభం వేళ ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం ఖర్చు చేయడాన్ని తప్పుబడుతున్నాయి. దీనికి అయ్యే డబ్బును కరోనాపై యుద్ధానికి ఖర్చు చేయాలని కాంగ్రెస్ నేతలు పలుమార్లు విమర్శించారు.