రజకులను ఎస్సీలో చేర్చాలనే ప్రతిపాదన ఏపీ నుంచి రాలేదు- రాజ్యసభలో చెప్పిన కేంద్రం
బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ రజకుల అంశాన్ని సభలో ప్రస్తావించారు. రజకులను ఎస్సీల జాబితాలో చేర్చే అంశంపై ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు ఏమైనా పంపిందా అంటూ జీవీఎల్ ప్రశ్నించారు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో ఏపీకి సంబంధించిన కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఏపీకి కేంద్రం ఇస్తున్న ఆహార ధాన్యాలపై వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం మంత్రి సాద్వీ నిరంజన్ జ్యోతి సమాధానం చెప్పారు. ఏపీకి ప్రతి నెల లక్షా యాభై నాలుగు వేల నూటా నలభై ఎనిమిది టన్నుల ఆహార ధాన్యాలు కేటాయిస్తున్నట్టు తెలిపారు.
జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ఆంధ్రప్రదేశ్‌లో 2.68 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నట్టు తెలిపారు కేంద్రమంత్రి. 2010-11 ఆర్థిక సంవత్సరం నుంచి 2012-13 ఆర్థిక సంవత్సరం వరకు తీసుకున్న ఆహార ధాన్యాల లెక్కలను అనుసరించి అధనంగా మరో 1,838.970 మెట్రిక్ టన్నుల గింజలు పంపిస్తున్నట్టు తెలిపారు.
రజకులను ఎస్సీలో చేర్చే ప్రతిపాదన లేదన్న కేంద్రం
బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ రజకుల అంశాన్ని సభలో ప్రస్తావించారు. రజకులను ఎస్సీల జాబితాలో చేర్చే అంశంపై ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు ఏమైనా పంపిందా అంటూ జీవీఎల్ ప్రశ్నించారు. దీనికి సమాధానం చెప్పిన కేంద్రమంత్రి నారాయణస్వామి... లేదని అన్నారు. అలాంటి ప్రతిపాదనలు ఏవీ ఏపీ ప్రభుత్వం నుంచి రాలేదన్నారు.
స్టీల్ ప్లాంట్ అంశంపై అశోక్ మహాదేవ్‌రావు ప్రశ్నించారు. దీనికి సమాధానం చెప్పిన కేంద్రమంత్రి ఫగన్ సింగ్ కులస్థే... విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక ఏడాది లాభం వస్తే రెండేళ్లు నష్టాల్లో ఉంటుందన్నారు. 2020-21లో 18,080 కోట్ల రూపాయలు, 2021-22లో 28,359 కోట్ల రూపాయలు, 2022-23లో 22,809 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని సభకు వివరించారు. ఇందులో పన్నులు మినహాయిస్తే 2020-21లో 789 కోట్ల నష్టాలు చూపించారు. 2022-23లో 2,858 కోట్ల నష్షం వచ్చినట్టు పేర్కొన్నారు. 2021-22లో మాత్రమే 913 కోట్ల లాభం వచ్చిందని సభ దృష్టికి తీసుకొచ్చారు.