YSR : వైఎస్ సంస్మరణకు వాళ్లెవరూ రావట్లేదు ! వచ్చేది వీళ్లే ?
రాజకీయాలకు అతీతంగా వైఎస్ఆర్ సంస్మరణ నిర్వహిస్తున్నామని విజయలక్ష్మి చెబుతున్నారు. కానీ ఇతర పార్టీల్లో ఉన్న వైఎస్ సన్నిహితులెవరూ హాజరయ్యే అవకాశం లేదు. వైఎస్ కుమారుడు జగన్ కూడా హాజరు కావడం లేదు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయలక్ష్మి ఏర్పాటు చేసిన సంస్మరణసభకు ఏ ఏ పార్టీల నుంచి ఎంత మంది వస్తారన్నదానిపై రాజకీయ పార్టీల్లో విస్తృత చర్చ జరుగుతోంది. ప్రముఖ కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఈ సంస్మరణ సభను వైఎస్ విజయలక్ష్మి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వైఎస్‌తో సన్నిహితంగా ఉన్న ప్రతి ఒక్కరినీ ఆహ్వనించారు. దాదాపుగా 350 మందికి ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపడమే కాదు ఎక్కువ మందిని స్వయంగా ఆహ్వానించారు. అయితే ఇప్పుడు ఆమె ఆహ్వానించిన వారిలో అత్యధికులు డుమ్మాకొట్టే అవకాశాలు ఉన్నాయి. కేవలం రాజకీయాల్లో క్రియాశీలకంగా లేని వారు మాత్రమే హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
హైదరాబాద్ సంస్మరణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు దూరం..!
" షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టుకున్నారు. ఆమె పార్టీ బలోపేతం కోసం వైఎస్ సంస్మరణ పెట్టుకుంటే తప్పు లేదు " అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. నేకుదా అది పార్టీ కార్యక్రమం అని ఆయన చెప్పారు. ఇంకా చెప్పాలంటే పరోక్షంగా ఆ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలెవరూ హాజరు కావొద్దని చెప్పినట్లుగా అనుకోవాలి. అంతర్గతంగా కూడా ఆ పార్టీ తమ సీనియర్ నేతలకు అదే కరకమైన సందేశాన్ని పంపింది. జగన్‌కు ఇష్టం లేనందున ఆ పార్టీ నేతలెవరూ హైదరాబాద్ సంస్మరణకు వెళ్లే అవకాశం లేదు. అయితే బొత్స సత్యనారాయణ లాంటి ఒకరిద్దరు హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక ఇతర పార్టీల్లో ఉన్న వైఎస్ సన్నిహితులు కూడా హాజరయ్యే అవకాశాల్లేవని భావిస్తున్నారు.
తెలంగాణ రాజకీయ నేతలూ దూరం .. దూరం..!
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకున్నట్లుగానే తెలంగాణలో కూడా వైఎస్ఆర్ సంస్మరణ కార్యక్రమం షర్మిల పార్టీ బలోపేతం కోసమేనని ఓ నిర్ణయానికి అక్కడి రాజకీయ నేతలు కూడా వచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత వైఎస్ సన్నిహితులుగా పేరు పడిన వారిలో అతి తక్కువ మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మిగతా వారు టీఆర్ఎస్‌లో చేరారు. అయితే ఏ పార్టీలో ఉన్నప్పటికీ వైఎస్ సంస్మరణకు మాత్రం అందరూ డుమ్మా కొట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. టీఆర్ఎస్‌లో ఉన్న నేతలెవరూ హాజరు కావడంలేదు. దీనికి ఢిల్లీ టూర్ వారికి ఓ కారణంగా లభించింది. ఇక కాంగ్రెస్‌లో ఉన్న నేతలు అసలు హాజరయ్యే చాన్స్ లేదు. అసలు షర్మిల పార్టీ పెట్టిందే కాంగ్రెస్‌ను దెబ్బతీయడానికన్న అభిప్రాయంలో వారు ఉన్నారు. టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇప్పటికే షర్మిల పార్టీపై విమర్శలు చేశారు. ఇక ఇతర పార్టీల్లో ఉన్న వారు కూడా ముందూ వెనుకా ఆలోచించే పరిస్థితి ఉంది.
షర్మిల హజరు.. జగన్ గైర్హాజర్..!
వైఎస్ సతీమణి హోదాలో విజయలక్ష్మి ఏర్పాటు చేసిన సంస్మరమ సభకు రాజకీయ ఉద్దేశాలు లేవని చెబుతున్నాయి. అయితే ఆ సభకు ఆమె కుమారుడు జగన్మోహన్ రెడ్డి హాజరు కావడం లేదు. ఇడుపులపాయలో నివాళులు అర్పించి ఆయన అటు నుంచి అటు తాడేపల్లికి వెళ్తారు. హైదరాబా్ద షెడ్యూల్ ఖరారు కాలేదు. అయితే షర్మిల మాత్రం తల్లితో కలిసి హైదరాబాద్ వస్తారు. ఓ రకంగా సంస్మరణ కార్యక్రమల ఏర్పాట్లను షర్మిల స్వయంగా సమన్వయం చేస్తున్నారని వైఎస్ఆర్ టీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ కారణంగా తండ్రి సంస్మరణసభకు షర్మిలతో పాటు ఆమె తల్లి మాత్రమే హాజరవుతారు. జగన్ లేని లోటు అక్కడ కనిపించనుంది.
రాజకీయంగా క్రియాశీలకంగా లేని నేతలు, ఇతర రంగాల ప్రముఖుల హాజరు..!
వైఎస్ఆర్ సంస్మరణకు రాజకీయంగా క్రియాశీలకంగా లేని నేతలు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాంటి వారిలో ఉండవల్లి అరుణ్ కుమార్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ కేవీపీ రామచంద్రరావు లాంటి వారు ఉన్నారు. వైఎస్ పై అభిమానం ఉన్నప్పటికీ రాజకీయ కార్యక్రమంగా భావిస్తున్నందున తాను హాజరు కాలేనని అసదుద్దీన్ ఓవైసీ లాంటి ఇతర పార్టీల నేతలు కూడా తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు సినీ రంగానికి చెందిన కొంత మంది ప్రముఖులకు కూడా ఆహ్వానాలు వెళ్లాయి. వారి హాజరుపై సందిగ్ధత కొనసాగుతుంది. వారు వెళ్తారా లేదా అన్నది చివరి క్షణం వరకూ స్పష్టత వచ్చే అవకాశం లేదు. మొత్తంగా వైఎస్ సంస్మరణకు ఆయన కుమారుడు జగన్‌తో పాటు అత్యంత సన్నిహితులుగా పేరుపడి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న వారెవరూ హాజరయ్యే అవకాశాలు కనిపించడం లేదు.