Justin Trudeau: ఆ సమాచారాన్ని ముందే భారత్‌కు చెప్పాం - జస్టిన్ ట్రూడో
Justin Trudeau: నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వం ప్రమేయం ఉందన్న విశ్వసనీయమైన సమాచారాన్ని భారత్‌తో పంచుకున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో శుక్రవారం తెలిపినట్లు గ్లోబల్ న్యూస్ నివేదించింది.
Justin Trudeau: ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వం ప్రమేయం ఉందన్న విశ్వసనీయమైన సమాచారాన్ని భారత్‌తో పంచుకున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో శుక్రవారం తెలిపినట్లు గ్లోబల్ న్యూస్ నివేదించింది. కథనం ప్రకారం .. ట్రూడో మాట్లాడుతూ.. సోమవారం తాను మాట్లాడిన విశ్వసనీయ ఆరోపణలను చాలా వారాల క్రితమే భారత్‌తో కెనడా పంచుకుందన్నారు. ఇండియాతో నిర్మాణాత్మకంగా పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని, వారు కూడా తమతో అలాగే ఉంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు. అయితే సోమవారం ట్రూడో వెల్లడించడానికి ముందే కెనడా నుంచి ఇంటెల్ వచ్చిందనే విషయాన్ని భారత్ ఖండించింది.
హౌస్ ఆఫ్ కామన్స్‌లో గతవారం కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో మాట్లాడుతూ.. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ పాత్ర ఉందని ఆరోపణలు చేశారు. ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ను చంపిన కేసులో భారత ఏజెంట్లకు సంబంధం ఉందని దీనికి సంబంధించి తమ వద్ద విశ్వసనీయ సమాచారం ఉందని తెలిపారు. హత్యోదంతంపై భద్రతాత సంస్థలు సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. కెనడా పౌరుడి హత్యలో విదేశీ ప్రభుత్వ ప్రమేయం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, అది ఉల్లంఘనే అని ప్రకటించారు. ఈ కేసు విషయంలో భారత ప్రభుత్వం సహకరించాల్సిందిగా కెనడా ప్రధాని కోరారు. ఇటీవల ఢిల్లీ వేదికగా జరిగిన జీ20 సదస్సు సమయంలోనూ ఈ విషయాన్ని భారత ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లినట్లు కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో తెలిపారు.
ట్రూడో చేసిన సంచలన ఆరోపణలపై భారత్ స్పందించింది. జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలను భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తీవ్రంగా ఖండించారు. కెనడా ప్రధాని వ్యాఖ్యలు పూర్తిగా అసంబద్ధమైనవని, ప్రేరేపితమైనవని అన్నారు. సర్రేలో ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ హత్యలో భారత్ పాత్ర ఉందనడాన్ని తోసిపుచ్చారు. భారత దేశానికి చట్టబద్ధమైన పాలన పట్ల బలమైన నిబద్ధత ఉందని మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం.
ఇదే ఏడాది జూన్ లో సర్రేలోని గురుద్వారా ఎంట్రన్స్ వద్ద ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు గురైన విషయం తెలిసిందే. జలంధర్ లో హిందూ పూజారిని చంపిన కేసులో ఖలిస్థానీ టైగర్ ఫోర్స్ కు చెందిన నిజ్జర్ ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రకటించింది. హర్దీప్ సింగ్ నిజ్జర్ పై రూ. 10 లక్షల రివార్డు కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే కెనడా, భారత్ వివాదం తీవ్రస్థాయికి చేరుకుంది. ఇరు దేశాలు సీనియర్ దౌత్యవేత్తలను బహిష్కరించాయి. తొలుత భారత దౌత్యవేత్తను కెనడా బహష్కరించింది. దీంతో భారత్ సైతం కెనడా దౌత్యవేత్తను ఐదు రోజుల్లో భారత్‌ను విడిచివెళ్లాలని సూచించింది.
ఇటీవల భారతదేశంలో జరిగిన G20 సందర్భంగా ట్రూడో, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మధ్య ఈ సమస్య చర్చకు వచ్చినట్లు సమాచారం. ఆ సమయంలో కెనడాలోని తీవ్రవాద సంస్థలు వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నాయని, భారతీయ దౌత్యవేత్తలపై హింసను ప్రేరేపిస్తున్నాయని, భారతీయ సమాజాన్ని, వారి ప్రార్థనా స్థలాలను బెదిరిస్తున్నాయని ప్రధాని మోదీ తెలియజేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. కెనడా ఎప్పుడూ భావ ప్రకటనా స్వేచ్ఛను, మనస్సాక్షిని, శాంతియుత నిరసనను సమర్థిస్తుందని ట్రూడో చెప్పారు.