India-Canada Row: మరోసారి కెనడా ప్రధాని కవ్వింపు చర్యలు.. భారత్ అంశం యూఏఈతో చర్చ
India-Canada Row: మరోసారి కెనడా ప్రధాని కవ్వింపు చర్యలు. యూఏఈ అధ్యకుడితో భారత్ అంశం చర్చించినట్లు ట్విట్టర్ లో వెల్లడి.
భారత్, కెనడా దేశాల మధ్య దౌత్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. యనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు జాయెద్‌తో తాను భారత్ అంశం, చట్టాన్ని గౌరవించడం, సమర్థించడం ప్రాముఖ్యత గురించి మాట్లాడానంటూ స్వయంగా ట్రూడోనే సోషల్ మీడియా ఖాతా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఆయన చర్య ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెంచే విధంగా ఉన్నాయి. ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ జస్టిట్ ట్రూడో భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలను దిల్లీ ఖండిస్తోంది. కాగా కెనడా మాత్రం తన వాదన నుంచి వెనక్కి తగ్గడం లేదు. ఓ పక్క భారత్‌తో సంబంధాలు తమకు ముఖ్యం అని చెప్తూనే మరోవైపు రెచ్చగొట్టే పనులు చేస్తోంది.
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ట్విట్టర్ (ఎక్స్) లో ఈ విధంగా పోస్ట్ చేశారు.. ' యూఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్ తో ఫోన్‌లో మాట్లాడాను. ఇజ్రాయెల్‌లో ప్రస్తుత పరిస్థితుల గురించి చర్చించాం. ఈ విషయంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాం. ప్రజల ప్రాణాలు రక్షించాల్సిన ప్రాముఖ్యత గురించి మాట్లాడుకున్నాం. ఇక భారత్ అంశం, చట్టాలను సమర్థించడం, పరస్పరం గౌరవించుకోవడం లాంటి అంశాల ప్రాముఖ్యత గురించి కూడా మేము చర్చించుకున్నాం' అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇలా కొద్ది రోజుల క్రితం ట్రూడో యూకే ప్రధాని రిషి సునాక్‌తో కూడా భారత్‌తో వివాదం గురించి చర్చించారు. ఇప్పుడు మరో దేశాధినేతతో చర్చించినట్లు చెప్పారు.
ఖలిస్థానీ సానుభూతి పరుడైన హర్‌దీప్ సింగ్ నిజ్జర్ ఈ ఏడాది జూన్‌లో హత్యకు గురయ్యాడు. కెనడాలోని బ్రాంప్టన్ పట్టణంలోని గురుద్వారా సాహిబ్ పార్కింగ్‌లో నిజ్జర్‌పై కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో అతడు మరణించాడు. అయితే ఇందులో భారత హస్తం ఉందన్నది కెనడా వాదన. ఇటీవల దిల్లీలో జరిగిన జీ 20 సమావేశాల సమయంలో కూడా కెనడా ప్రధాని ట్రూడో, ప్రధాని మోదీతో జరిగిన చర్చల్లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. కెనడాలో కెనడా పౌరుడి హత్య వెనుక విదేశీ హస్తం ఉంటే అది తమ సార్వభౌమత్వానికి విఘాతం కలిగించడమే అని అన్నారు. ఆ కేసుకు సంబంధించిన విచారణకు సహకరించాలని ట్రూడో కోరారు.
కెనడా చేస్తున్న ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండిస్తోంది. కాగా భారత్ కూడా కెనడాపై ఆరోపణలు చేస్తోంది. భారత వ్యతిరేక శక్తులకు కెనడా ఆశ్రయమిస్తోందని, ఇది ఇరు దేశాలకు మంచిది కాదని తెలిపింది. ఖలిస్థానీ తీవ్రవాదులు తమ కార్యకలాపాలను కెనడా నుంచి సాగిస్తున్నారని ఆరోపిస్తోంది. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా కెనడా వాదనలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆధారాలుంటే భారత్ తప్పకుండా దర్యాప్తుకు సహకరిస్తుందని తెలిపారు. కెనడాలో రాయబార కార్యాలయాలపైన బాంబు దాడులు జరుగుతున్నాయని, విధ్వంసం చేస్తున్నారని, వేర్పాటు వాదాన్ని, హింసను ప్రేరేపిస్తున్నారని జైశంకర్ స్పష్టంచేశారు. అయితే అగ్రరాజ్యం అమెరికా కూడా కెనడా చేస్తున్న దర్యాప్తుకు భారత్ సహకరించాలంటూ పలుమార్లు వెల్లడించింది. ఇరు దేశాలు తమకు మిత్రదేశాలే అని చెప్తునే భారత్‌కు సూచనలు ఇస్తోంది.