Korean queen Heo Hwang: అయోధ్యలో కొరియా రాణి విగ్రహం - అయోధ్యకు, కొరియా రాణికి ఇంత అనుబంధం ఉందా?
Suriratna : అయోధ్యలో కొరియా రాణి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆమె కొరియా ప్రజలకు ఆరాధ్యదైవమే కానీ..భారతీయురాలన్ నసంగతి చాలా కొద్ది మందికే తెలుసు.

Bronze statue of Korean queen in Ayodhya: అయోధ్యలో కొరియా రాణి హేఓ హ్వాంగ్-ఓక్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. చాలా మంది కొరియా రాణి విగ్రహం అయోధ్యలో ఎందుకు పెట్టారని ఆశ్చర్యపోయారు. ప్రత్యేకమైన అనుబంధం ఉండబట్టే విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ అనుబంధం ఆ రాణి భారతీయతోనే వచ్చింది. ఇది రెండు వేల ఏళ్ల నాటి అనుబంధం.
అయోధ్యకు , దక్షిణ కొరియాకు మధ్య ఉన్న రెండు వేల ఏళ్ల నాటి చారిత్రక, సాంస్కృతిక బంధం ఉంది. అందుకే అయోధ్యలో రాణి హేఓ హ్వాంగ్-ఓక్ భారీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ విగ్రహావిష్కరణ కేవలం ఒక స్మారక చిహ్నం మాత్రమే కాదు, భారత్-కొరియా దేశాల మధ్య ఉన్న లోతైన వారసత్వ సంబంధానికి ఒక సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.
చారిత్రక ఆధారాల ప్రకారం, క్రీస్తుశకం 48వ సంవత్సరంలో అయోధ్య రాజ్యానికి చెందిన రాజకుమారి సూరిరత్న తన 16వ ఏట సముద్ర మార్గం ద్వారా సుదీర్ఘ యాత్ర చేసి దక్షిణ కొరియాకు చేరుకున్నారు. తన తల్లిదండ్రులకు వచ్చిన ఒక దైవిక సందేశం మేరకు ఆమె ఈ సాహసయాత్ర చేశారని కొరియన్ గ్రంథం 'సామ్ గుక్ యూసా'లో ఉంటుంది. అక్కడ గెయుమ్‌గ్వాన్ గయా రాజ్య స్థాపకుడైన రాజు కిమ్ సురో ను వివాహం చేసుకుని, ఆ దేశపు తొలి రాణిగా బాధ్యతలు చేపట్టారు. వివాహానంతరం ఆమె పేరు హేఓ హ్వాంగ్-ఓక్ గా మార్చారు.
Bronze Statue unveiled in the holy town of #Ayodhya, birthplace of the daughter of India, Princess #Suriratna (Queen Heo-Hwang-ok) who married the Korean King #Suro, founder of the Geumgwan Gaya kingdom in 48CE. Her living descendants exist till this date. The Gimhae Heo and… https://t.co/bqyGEQ0YxH pic.twitter.com/7HyKuVbrbb
— Vishal V. Sharma 🇮🇳 (@VishalVSharma7) December 25, 2025
దక్షిణ కొరియాలో నేటికీ ఈ రాణికి విశేషమైన గౌరవం ఉంది. ఆ దేశ జనాభాలో సుమారు 10 శాతం జనాభా మను తాము రాణి సూరిరత్న , రాజు కిమ్ సురోల వారసులుగా చెప్పుకుంటారు. వీరిలో ముఖ్యంగా కిమ్ , హేఓ , లీ అనే ఇంటిపేర్లు కలిగిన వారు తమ మూలాలు అయోధ్యలో ఉన్నాయని బలంగా నమ్ముతారు. ప్రతి ఏటా వందలాది మంది కొరియన్లు అయోధ్యను సందర్శించి, తమ పూర్వీకురాలికి నివాళులు అర్పించడం ఒక ఆచారంగా మారింది.
ఈ చారిత్రక సంబంధాన్ని గౌరవిస్తూ, అయోధ్యలోని సరయూ నది తీరాన ఒక భారీ స్మారక ఉద్యానవనాన్ని అభివృద్ధి చేశారు. తాజాగా ఆవిష్కరించిన 12 అడుగుల ఎత్తు, 1300 కిలోల బరువు కలిగిన ఈ కాంస్య విగ్రహాన్ని కొరియన్ శిల్పులే అత్యంత నైపుణ్యంతో రూపొందించారు. ఈ విగ్రహం ఆవిష్కరణతో రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మరింత బలపడతాయని, భవిష్యత్తులో అయోధ్య ఒక అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా, కొరియన్లకు ఒక పుణ్యక్షేత్రంగా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు.





















