మా ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోంది , బీజేపీపై కేజ్రీవాల్ సంచనల ఆరోపణలు
Delhi Operation Lotus: తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందంటూ కేజ్రీవాల్ ఆరోపించారు.
Operation Lotus in Delhi: బీజేపీ ఢిల్లీ ప్రభుత్వాన్ని పడగొట్టనుందా..? అక్కడ లోటస్ ఆపరేషన్ మొదలు పెట్టిందా..? ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ఢిల్లీలో తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందంటూ ఆరోపించారు. తమ పార్టీకి చెందిన 7గురు ఎమ్మెల్యేలతో ఆ పార్టీ సంప్రదింపులు జరిపిందని తేల్చి చెప్పారు. తనను అరెస్ట్ చేసి మెల్లగా ఎమ్మెల్యేలందరినీ లాక్కుని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూస్తోందంటూ మండి పడ్డారు. ఈ విషయం కొందరు బీజేపీ నేతలే తనకు స్వయంగా చెప్పారంటూ బాంబు పేల్చారు. X వేదికగా పెట్టిన ఓ పోస్ట్ ప్రస్తుతం సంచలనమైంది.
"మరి కొద్ది రోజుల్లో మేం అరవింద్ కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేస్తామని బీజేపీ చెబుతోంది. అంతే కాదు. మా పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలను కొనేందుకు కుట్ర చేస్తోంది. రూ.25 కోట్లు ఇచ్చి వాళ్లను లాక్కోవాలని చూస్తోంది. ఆ తరవాత మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్లాన్ చేస్తోంది. ఒక్కో ఎమ్మెల్యేకి రూ.25 కోట్లు ఇవ్వడమే కాకుండా వచ్చే ఎన్నికల్లో వాళ్లందరికీ బీజేపీ తరపున పోటీ చేసేందుకు కూడా ఆ పార్టీ ఆశ చూపుతోంది"
- అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి
पिछले दिनों इन्होंने हमारे दिल्ली के 7 MLAs को संपर्क कर कहा है - “कुछ दिन बाद केजरीवाल को गिरफ़्तार कर लेंगे। उसके बाद MLAs को तोड़ेंगे। 21 MLAs से बात हो गयी है। औरों से भी बात कर रहे हैं। उसके बाद दिल्ली में आम आदमी पार्टी की सरकार गिरा देंगे। आप भी आ जाओ। 25 करोड़ रुपये देंगे…
— Arvind Kejriwal (@ArvindKejriwal) January 27, 2024
21 మంది ఎమ్మెల్యేలతో మాట్లాడినట్టు బీజేపీ చెబుతున్నా...తమకున్న సమాచారం ప్రకారం ఏడుగురు ఎమ్మెల్యేలను కొనేందుకు చూస్తోందంటూ కేజ్రీవాల్ అసహనం వ్యక్తం చేశారు. కానీ వాళ్లంతా అందుకు అంగీకరించలేదని స్పష్టం చేశారు. కేవలం తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు మాత్రమే తనను అరెస్ట్ చేయాలని చూస్తున్నారని,అందుకోసం లిక్కర్ స్కామ్‌ని సాకుగా చూపిస్తున్నారని మండి పడ్డారు. గత 9 ఏళ్లుగా తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తూనే ఉందని, కానీ అవేవీ సక్సెస్ కాలేదని అన్నారు. ఎమ్మెల్యేలంతా కలిసికట్టుగా నిలబడడం వల్ల అలాంటిదేమీ జరగలేదని స్పష్టం చేశారు.
అయితే...ఈ ఆరోపణల్ని బీజేపీ నేతలు కొట్టి పారేస్తున్నారు. అబద్ధాలు చెప్పడం కేజ్రీవాల్‌కి అలవాటైపోయిందని విమర్శించారు. ఈడీ అడిగే ప్రశ్నలకు ఆయన దగ్గర సమాధానం లేదని, అందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
"ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నట్టు ఇప్పటికే కేజ్రీవాల్ 7 సార్లు ఆరోపించారు. మేం ప్రతిసారీ బీజేపీ నేతలు ఎవరికి ఫోన్ చేశారో చెప్పాలని అడిగాం. ఏ ఫోన్ నంబర్ నుంచి కాల్స్ వచ్చాయో చెప్పాలని కోరాం. కానీ దానికి కేజ్రీవాల్ సమాధానం చెప్పలేదు. కేవలం ఏదో అనేసి ఆ తరవాత దాక్కుంటారు. ఆయన సన్నిహితులు జైల్లో ఉన్నారు. ఈడీ సమన్లు వచ్చినా వాటిని పట్టించుకోవడం లేదు. ఆ అధికారులు అడిగే ప్రశ్నలకు కేజ్రీవాల్ వద్ద సమాధానాల్లేవు"
- కపిల్ మిశ్రా, బీజేపీ నేత
Also Read: వారంలోగా పెండింగ్‌లో ఉన్న ప్రతి పైసా రావాలి - మోదీ సర్కార్‌కి మమతా అల్టిమేటం