Bill Against Paper Leaks: పరీక్ష పేపర్ల లీకులు అరికట్టడానికి కేంద్రం కొత్త చట్టం - రూ.1 కోటి వరకు జరిమానా, పూర్తి వివరాలు
Bill Against Exam Paper Leaks :పరీక్షా పేపర్ల లీక్ అనేది ఈ రోజుల్లో చాలా పెద్ద సమస్య అవుతోంది. టెక్నాలజీ పెరగడంతో క్షణాల్లో పేపర్ సర్క్యూలేట్ అవుతోంది. లీకుల్అని రికట్టడానికి కొత్త చట్టం వస్తోంది.
Bill Against Paper Leaks to be Introduced in Parliament : పబ్లిక్ పరీక్షలు, ఉద్యోగ పరీక్షలు, ప్రవేశ పరీక్షలు ఇలా అన్ని పరీక్షల్లోనూ లీకులు అనేవి యువతకు పెను సమస్యగా మారింది. విద్యార్హతల పరీక్షలు, ఉద్యోగ పరీక్షల్లో పేపర్ లీకేజీ వ్యవహారాలు దేశంలో నిత్యం ఎక్కడో ఒకచోట వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఈనేపథ్యంలో యూపీఎస్సీ, ఎస్ఎస్‌సీ, రైల్వేస్, నీట్, జేఈఈ, సీయూఈటీ వంటి జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షలలో పేపర్ లీక్‌లను అరికట్టడానికి ప్రత్యేక చట్టం తేవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ‘పబ్లిక్ ఎగ్జామినేషన్ (అక్రమ మార్గాల నివారణ) బిల్లు-2024’ను సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టింది.
తప్పుడు పనులు చేసే వారికి కఠినమైన శిక్షల ద్వారా గట్టి సందేశం పంపాలని కేంద్రం నిర్ణయంచారు. ఈ బిల్లు పార్లమెంటు ఆమోదంతో చట్టరూపాన్ని దాలిస్తే పేపర్ లీకులు చేసే వారికి చుక్కలు కనిపిస్తాయి. చట్టం చేయడమే కాదు కఠినంగా అమలు చేసేలా చట్టంలో ప్రతిపాదనలు ఉన్నాయి.
పేపర్ లీక్ చేస్తే కనీసం మూడేళ్ల జైలు శిక్ష
పేపర్ లీక్ కేసుల్లో దోషులుగా తేలే వారికి కనీసం మూడు నుంచి ఐదేళ్ల జైలు శిక్ష పడుతుంది. అయితే పేపర్ లీక్ వ్యవహారాల్లో వ్యవస్థీకృత నేరాలకు పాల్పడిన వారికి ఐదు నుంచి పదేళ్ల జైలుశిక్ష విధించాలని బిల్లులో పెట్టారు. విద్యార్థులు, ఉద్యోగార్థుల భవిష్యత్‌తో ఆడుకోవడమే కాబట్టి.. ఇలాంటి నేరాలు చేసే వారికి భవిష్యత్ లేకుండా చేసేలా శిక్షలు ఉంటాయి.
నిర్వహణ బాధ్యతలు చేపట్టిన వారే లీక్ చేస్తే ఇక అంతే !
పరీక్షల నిర్వహణ బాధ్యతలను చేపట్టే సర్వీస్ ప్రొవైడర్ సంస్థలు పేపర్ లీక్ చేసినట్లు తేలితే వాటికి రూ.కోటి వరకు జరిమానా విధిస్తారు. పరీక్ష నిర్వహణకు అయిన ఖర్చునంతా సంస్థ నుంచి రికవర్ చేయాలనే ప్రతిపాదనను కూడా ఈ బిల్లులో పొందుపరిచారు. ఇలాంటి సంస్థపై పరీక్షలు నిర్వహించకుండా నాలుగేళ్ల పాటు బ్యాన్‌ను కూడా విధిస్తారు.
ఆషామాషీగా కాదు.. ఉన్నతాధికారుల విచారణ
పేపర్ లీక్ కేసుల విచారణను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లేదా అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ స్థాయి కంటే తక్కువ లేని అధికారి నిర్వహించాల్సి ఉంటుంది. దర్యాప్తును ఏదైనా కేంద్ర ఏజెన్సీకి అప్పగించే అధికారం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఈ బిల్లులో పేపర్ లీక్‌తో ముడిపడిన 20 రకాల నేరాలు, అక్రమాలకు పాల్పడే వారికి విధించాల్సిన శిక్షల గురించి ప్రస్తావించారు. మాస్ కాపీయింగ్, జవాబు పత్రాలను తారుమారు చేయడం, ఓఎంఆర్ షీట్లను ట్యాంపరింగ్ చేయడం వంటివన్నీ ఈ నేరాల జాబితాలో ఉన్నాయి.
ఈ బిల్లును అన్ని పార్టీలు ఆమోదించే అవకాశం ఉంది. త్వరగానే చట్టంగా మారుతుందని పేపర్ లీకుల నుంచి రక్షణ లభిస్తుందని యువత ఆశిస్తోంది.