(Source: ECI/ABP News/ABP Majha)
Bikaner Guwahati Accident: ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో 9కి చేరిన మృతుల సంఖ్య
బంగాల్‌లో ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ప్రమాదంలో మొత్తం 9 మంది మృతి చెందారు.
బికనేర్-గువాహటి ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో మృతుల సంఖ్య 9కి చేరింది. 45 మందికి పైగా గాయాలయ్యాయి. గురువారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో బంగాల్ జలపాయ్‌గురి దొమోహనీ వద్ద గువాహటి-బికనేర్ ఎక్స్‌ప్రెస్ 15633 (యూపీ) రైలు పట్టాలు తప్పింది. మొత్తం 12 బోగీలు పట్టాలు తప్పాయి.
సహాయక చర్యలు..
ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మైనాగురి, జలపైగురిలో ఉన్న ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. చాలా మందికి తీవ్రంగా గాయాలు కావడం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని జలపైగురి జిల్లా మెజిస్ట్రేట్ తెలిపారు. బోగీల్లో ఇంకా ఎవరైనా చిక్కుకున్నారేమోనని రాత్రంతా గాలించినట్లు వెల్లడించారు.
సహాయక చర్యలు పూర్తయినట్లు రైల్వేశాఖ తెలిపింది. ఈ ప్రమాదంపై ఇప్పటికే ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు ప్రకటించింది.
ర్వైల్వే మంత్రి..
ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ర్వైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పరిశీలించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.
పరిహారం ప్రకటన..
ప్రమాదంలో మృతి చెందిన వారి కుటంబానికి రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడినవారికి రూ.లక్ష, స్వల్ప గాయాలైనవారికి రూ.25 వేలు పరిహారం ప్రకటించింది ర్వైల్వేశాఖ. ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది.
సంతాపం..
ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమ సంతాపం వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి