Joe Biden to visit India: భారత పర్యటనకు రానున్న అమెరికా అధ్యక్షుడు
Joe Biden to visit India: భారత పర్యటనకు రానున్న అమెరికా అధ్యక్షుడు. సెప్టెంబరులో దిల్లీలో జరగనున్న జీ 20 సదస్సు కోసం ఆయన భారత్‌లో పర్యటించనున్నారు.
Joe Biden to visit India: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ త్వరలో భారత పర్యటనకు రానున్నారు. సెప్టెంబరులో దిల్లీలో జరగనున్న జీ 20 సదస్సు కోసం ఆయన భారత్‌లో పర్యటించనున్నారు. బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత భారత్‌కు రావడం ఇదే మొదటి సారి. జీ 20 దేశాల మధ్య జరిగే శిఖరాగ్ర సదస్సు సెప్టెంబరు 7 నుంచి 10 తేదీల్లో దిల్లీలో జరగనుంది. బైడెన్ తోపాటు పలు దేశాల దేశాధినేతలు భారత్‌కు రానున్నారు. దీంతో దేశ రాజధాని సందడిగా మారనుంది.
బైడెన్ భారత్‌లో నాలుగు రోజులు పర్యటించనున్నట్లు అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ జాతీయ భద్రతా సలహా దారు జేక్ సల్లివన్ మంగళవారం ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. బైడెన్ భారత పర్యటనలో భాగంగా భారత్‌తో ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొంటారని సల్లివన్ తెలిపారు. అయితే అందుకు సంబంధించిన అంశాలపై ఇరు వర్గాల అధికారుల్లో చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇందుకోసం అమెరికాలోని భారత రాయబారి తరణ్‌జిత్ సింగ్ సంధు దిల్లీలో ఉన్నారని వెల్లడించారు. జూన్‌లో మోదీ అమెరికా పర్యటనకు వచ్చినప్పుడు చర్చించిన అంశాలపై ఈ ఈ ద్వైపాక్షిక సమావేశాల్లో పురోగతి ఉంటుందేమో వేచి చూడాలి. అయితే భారత్ పలు ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొనాల్సి ఉన్నందున, సమయం తక్కువగా ఉన్నందున ద్వైపాక్షిక చర్చలు లిమిటెడ్గా ఉండొచ్చని ప్రకటనలో తెలిపారు.
జీ 20 సదస్సులో భాగంగా బైడెన్ క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్, వాతావరణ మార్పులు, ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం, ప్రపంచ బ్యాంకు సహా బహుపాక్షిక బ్యాంకుల అభివృద్ధి సామర్థ్యాలను పెంపొందించడం,ప్రపంచ సవాళ్లను పరిష్కరించడం ద్వారా పేదరికంపై పోరాటం చేసే అంశంపై గురించి చర్చిస్తారని ప్రకటనలో తెలిపారు. 2026లో అమెరికా జీ 20 సదస్సును హోస్ట్ చేసే విషయాన్ని మరోసారి ప్రకటించనున్నట్లు చెప్పారు. వైట్ హౌస్ పత్రికా ప్రకటన ప్రకారం ఆయన జీ 20 నాయకత్వంపై ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించనున్నారు.
2022లో ఇండోనేషియా జీ 20 సదస్సును నిర్వహించారు. ఇండోనేషియా నుంచి భారత్ ఈ ఏడాది సదస్సును హోస్ట్ చేసేందుకు ప్రెసిడెన్సీని స్వీకరించింది. సెప్టెంబరు 9, 10 తేదీల్లో దిల్లీలో ప్రపంచాధినేతల సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశం భారత్‌లో ప్రపంచ నాయకులతో జరిగే అతి పెద్ద సమావేశాలలో ఒకటి.
ఈ సమ్మిట్ దృష్ట్యా సెప్టెంబరు 8,9, 10 తేదీల్లో దేశ రాజధాని దిల్లీలో పాఠశాలలకు, కార్యాలయాలకు సెలవు ప్రకటిస్తున్నట్లు దిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. జీ 20 గ్రూప్ అనేది ప్రపంచంలో ప్రధానంగా అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల కూటమి. ఈ సదస్సు ద్వారా రప్రపంచ జీడీపీలో 85 శాతం, ప్రపంచ వాణిజ్యంలో 75శాతం, ప్రపంచ జనాభాలో మూడింట రెండొంతుల మందికి నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు.
మరోవైపు ఇండోనేషియాలోని జకర్తాలో జరగనున్న అమెరికా- ఆసియన్ సమ్మిట్‌కు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ హాజరుకానున్నారు. ఆమె ఆ సదస్సులో వాతావరణ సంక్షోభం, భద్రత, సముద్ర భద్రత, భాగస్వామ్య శ్రేయస్సు, స్థిరమైన ఆర్థిక వృద్ధి, అంతర్జాతీయ నిబంధనల అమలు తదితర అంశాలపై చర్చిస్తారని వైట్ హౌస్ ప్రకటనలో వెల్లడించింది.