రాహుల్ యాత్రలో అల్లర్లపై భగ్గుమన్న అసోం ప్రభుత్వం, దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు
Bharat Jodo Nyay Yatra: అసోంలో భారత్ జోడో న్యాయ యాత్ర విషయంలో ప్రభుత్వానికి, రాహుల్‌కి మధ్య వివాదం ముదురుతోంది.
![రాహుల్ యాత్రలో అల్లర్లపై భగ్గుమన్న అసోం ప్రభుత్వం, దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు Bharat Jodo Nyay Yatra Himanta Sarma Arrest Threat To Rahul Gandhi రాహుల్ యాత్రలో అల్లర్లపై భగ్గుమన్న అసోం ప్రభుత్వం, దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/25/66bd1cd58e8845f63d7d24c270c70b7d1706162479689517_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Bharat Jodo Nyay Yatra in Assam: భారత్ జోడో న్యాయ్ యాత్ర (Bharat Jodo Nyay Yatra) విషయంలో అసోం ప్రభుత్వానికి, కాంగ్రెస్‌కి మధ్య ఘర్షణ కొనసాగుతూనే ఉంది. యాత్ర జరుగుతున్న సమయంలో అసోం పోలీసులతో కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు గొడవకి దిగారు. రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. దీనిపై సీరియస్ అయిన అసోం పోలీసులు రెండు రోజుల క్రితం రాహుల్ గాంధీపై (Bharat Jodo Nyay Yatra in Assam) కేసు నమోదు చేశారు. ఆ తరవాత ఈ కేసుని CIDకి బదిలీ చేశారు. అసోం పోలీస్ చీఫ్ జీపీ సింగ్ ఈ విషయాన్ని అధికారికంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. అంతే కాదు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేకంగా సిట్‌ని నియమిస్తున్నట్టు చెప్పారు. IPCలోని 9 సెక్షన్స్ కింద రాహుల్ సహా పార్టీ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు పోలీసులు. జనవరి 23వ తేదీన అసోం సరిహద్దుల్లో ఈ ఘర్షణ జరిగింది. గువాహటి ప్రాంతంలో ఒక్కసారిగా అలజడి రేగింది. వెంటనే స్పందించిన అసోం ప్రభుత్వం...గువాహటి రోడ్‌లను బ్లాక్ చేసింది. న్యాయ్ యాత్ర ముందుకు సాగకుండా అడ్డుకుంది. ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశముందని చెప్పి ఎక్కడికక్కడే యాత్రను ఆపేసింది. ఫలితంగా రాహుల్ గాంధీని ఆయన పర్సనల్ సెక్యూరిటీ వెంటనే బస్‌లోకి ఎక్కించింది. అనుమతి లేకపోయినప్పటికీ యాత్రను కొనసాగించాలని కాంగ్రెస్ కార్యకర్తలు కొందరు పట్టుపట్టారు. ఈ సమయంలోనే పోలీసులు పెద్ద ఎత్తున సరిహద్దుల్ని మొహరించారు. ఎలాంటి అల్లర్లు చెలరేగకుండా జాగ్రత్త పడ్డారు. దాదాపు 5 వేల మంది కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులతో ఘర్షణకి దిగారు. ముఖ్యమంత్రి హిమంత శర్మ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ కార్యకర్తలు నక్సలైట్స్‌లా ప్రవర్తించారని, వాళ్ల వల్ల ట్రాఫిక్ జామ్ అయిందని మండి పడ్డారు. సాధారణ ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చిందని అసహనం వ్యక్తం చేశారు.
రాహుల్ వర్సెస్ హిమంత..
అయితే...కేసుని CIDకి బదిలీ చేయడం మరింత ఉద్రిక్తతల్ని పెంచింది. హిమంత బిశ్వశర్మ, రాహుల్ మధ్య వాగ్వాదం (Rahul Vs Himanta) మొదలైంది. ఒకప్పటి కాంగ్రెస్‌లోనే ఉన్నారన్న సంగతి మరిచిపోయి హిమంత శర్మ తమ యాత్రను అడ్డగిస్తున్నారని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకి లేఖ రాశారు. అసోంలో యాత్ర మొదలైనప్పటి నుంచి రాహుల్ విషయంలో భద్రతా వైఫల్యం తలెత్తిందని అందులో ప్రస్తావించారు. రాహుల్ గాంధీ వ్యక్తిగత దాడులకూ దిగారు. దేశంలో అత్యంత అవినీతిమయమైన ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మేనని విమర్శించారు. హోం మంత్రి అమిత్‌షా చెప్పుచేతల్లో ఆయన నడుచుకుంటున్నారని ఆరోపించారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడనని, యాత్ర కొనసాగిస్తామని తేల్చి చెప్పారు రాహుల్ గాంధీ. అటు సీఎం హిమంత కూడా అదే స్థాయిలో విరుచుకు పడ్డారు. అసోంలో అల్లర్లు సృష్టించేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని విమర్శించారు.
"లోక్‌సభ ఎన్నికలు పూర్తైన వెంటనే రాహుల్‌ని అరెస్ట్ చేస్తాం. ఎన్నికల ముందే అరెస్ట్ చేస్తే రాజకీయం అవుతుంది. ఇప్పటికే కేసు నమోదైంది. సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఎన్నికల ముందు రాజకీయాలు చేయడం ఇష్టం లేదు కాబట్టే సంయమనం పాటిస్తున్నాం"
- హిమంత బిశ్వశర్మ, అసోం ముఖ్యమంత్రి
Also Read: జాతీయ పతాకాలనే కాదు, అయోధ్య జెండాలనూ ఇష్టమొచ్చినట్టు పారేయద్దు - అధికారుల గైడ్‌లైన్స్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)