Bengaluru Water Crisis: కలుషిత నీళ్లు తాగుతున్న బెంగళూరు వాసులు, పెరుగుతున్న కలరా కేసులు
Bengaluru Water Crisis: బెంగళూరులో కలరా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.
Water Crisis in Bengaluru: బెంగళూరు వాసులకు నీటి కష్టాలు (Bengaluru Water Crisis) ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. ఒక్కొక్క నీటి బొట్టుని చాలా పొదుపుగా వాడుకుంటే తప్ప అవసరాలు తీరడం లేదు. అటు ప్రభుత్వం కూడా నీటిని వృథా చేయకుండా కఠిన ఆంక్షలు పెడుతోంది. ఈ సంక్షోభంలో చాలా మంది ఏ నీళ్లు పడితే వాటిని తాగేస్తున్నారు. పలు చోట్ల నీళ్లు కలుషితంగా ఉంటున్నాయి. ఇవే కలరా వ్యాధికి దారి తీస్తోంది. ఈ మధ్య కాలంలోనే కలరా కేసులు 40% మేర పెరిగినట్టు ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్‌లోని రికార్డులే చెబుతున్నాయి. గతంలో నెలకు ఒకటి లేదా రెండు కలరా కేసులు నమోదయ్యేవి. కానీ మార్చి నెలలో గత రెండు వారాల్లోనే సగటున 7 కేసులు నమోదవుతున్నాయి. బాధితుల్లో చాలా మంది బయటి ఫుడ్ తిన్న వాళ్లే.
అయితే...బెంగళూరులో చాలా చోట్ల బయట ఫుడ్ స్టాల్స్‌లో నీళ్లు కలుషితంగా ఉంటున్నాయన్న వాదన వినిపిస్తోంది. నీటి కొరత కారణంగా ఏవి పడితే అవి తీసుకొచ్చి వాటితోనే ఆహారం తయారు చేస్తున్నారు. ముఖ్యంగా పానీపూరి తిన్న వాళ్లే కలరా బారిన పడుతున్నారు. ఇక ఎండాకాలం కావడం వల్ల చాలా మంది బయట జ్యూస్‌లు తాగుతున్నారు. ఈ జ్యూస్‌లలోనూ కలుషిత నీరు కలుస్తోంది. ఫలితంగా..అవి తాగిన వాళ్లకీ కలరా సోకుతోంది. వాంతులు, విరేచనాలు, తీవ్రమైన తలనొప్పి, నీరసం లాంటి లక్షణాలతో కొందరు హాస్పిటల్స్‌లో చేరుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. కొంత మందికి ఇది డయేరియాకీ దారి తీస్తోంది. శరీరంలోని నీరంతా బయటకి వెళ్లిపోవడం వల్ల డీహైడ్రేట్ అవుతున్నారు.
కొన్ని సార్లు కలరా కిడ్నీలపై ప్రభావం చూపించే ప్రమాదముందని (Cholera Cases in Bengaluru) డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. పరిశుభ్రమైన నీటినే తాగాలని సూచిస్తున్నారు. అటు ప్రభుత్వం వీలైనంత వరకూ నీటిని పొదుపు చేసే మార్గాలను వెతుకుతోంది. ఆ మేరకు బెంగళూరు వాసులకు సలహాలు, సూచనలు చేస్తోంది. ఐటీ ఉద్యోగులు కొందరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఆఫీస్‌లలో నీటి వినియోగాన్ని తగ్గించుకునేందుకు కంపెనీలు కొన్ని ఈ ఆప్షన్ ఇస్తున్నాయి. ఎండాకాలం చెమటలు పడుతుంటాయి. ఆ వేడిని తట్టుకునేందుకు చాలా మంది పదేపదే ముఖం కడుక్కుంటారు. కానీ ఈసారి మాత్రం వెట్‌వైప్స్‌తోనే సరిపెట్టుకుంటున్నారు. నీటి వినియోగాన్ని తగ్గిస్తున్నారు. ఇళ్లలో వంట చేసుకునేందుకు తక్కువ పాత్రల్ని వాడుతున్నారు. డిస్పోజబుల్ ప్లేట్‌లు, గ్లాస్‌లనే వినియోగిస్తున్నారు. మిల్క్ ట్యాంకర్‌లలో నీళ్లు సరఫరా చేస్తూ కొంత వరకూ నీటి కొరతను తీర్చే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. Bangalore Water Supply and Sewerage Board (BWSSB) చేపడుతున్న చర్యలపై కేంద్రం ప్రశంసలు కురిపించింది. ఇటీవలే బెంగళూరు అధికారులతో కేంద్ర ప్రతినిధులు సమావేశమయ్యారు. ప్రస్తుతం బెంగళూరు నీటి కొరతను ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని కితాబిచ్చారు. మురుగు నీటిని రీసైక్లింగ్ చేసి వాడుకోవాలన్న ఆలోచననూ మెచ్చుకున్నారు. ఏప్రిల్ 10వ తేదీ నుంచి అధికారులు మరికొన్ని కొత్త నిబంధనల్ని అమల్లోకి తీసుకురానున్నారు. పరిమితికి మించి నీళ్లు వినియోగించిన వాళ్లకు సరఫరాపై ఆంక్షలు విధించే యోచనలో ఉన్నారు.