రోడ్లపై తాబేళ్లలా కదులుతున్న వాహనాలు, ట్రాఫిక్ రద్దీతో పెరిగిన పెట్రోల్ ఖర్చులు
Traffic in Cities: ప్రపంచవ్యాప్తంగా లండన్ నగరంలో అత్యంత దారుణమైన ట్రాఫిక్ రద్దీ ఉంటోందని ఓ నివేదిక వెల్లడించింది.
Worst Traffic Cities: వాహనాలన్నీ తాబేళ్లలా రోడ్డుపై నడుస్తుంటే ఎలా ఉంటుంది..? లండన్‌లో ఇదే జరుగుతోంది. 2023లో ప్రపంచవ్యాప్తంగా అత్యంత దారుణమైన ట్రాఫిక్ ఉన్న సిటీల్లో ఒకటిగా నిలిచింది యూకే రాజధాని లండన్. అక్కడి వెహికిల్స్ గంటకు 14 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నాయని ఓ రిపోర్ట్ వెల్లడించింది. అంటే అక్కడ రద్దీ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదో వరల్డ్ రికార్డ్ మరి. ఇక భారత్ సంగతికొస్తే ఇక్కడ బెంగళూరు, పుణెలో ట్రాఫిక్ రద్దీ ఆందోళనకరంగా ఉంటోందని వెల్లడించింది ఆ నివేదిక. Worst Traffic నగరాల జాబితాలో ఈ రెండు సిటీలున్నాయి. TomTom Traffic Index మొత్తం ప్రపంచంలోని ఆరు ఖండాల్లో 55 దేశాల్లో 387 నగరాల్లోని ట్రాఫిక్ పరిస్థితులను పరిశీలించింది. యావరేజ్ ట్రావెల్ టైమ్, ఈ రద్దీ వల్ల ఎంత ఫ్యుయెల్ ఖర్చవుతోంది..? వీటి వల్ల కర్బన ఉద్గారాలు ఏ స్థాయిలో విడుదలవుతున్నాయి..? ఇలా అన్ని కోణాల్లోనూ అధ్యయనం చేసింది. మొత్తం 6 కోట్ల వాహనాల్లోని నావిగేషన్ సిస్టమ్ నుంచి ఈ వివరాలు సేకరించింది. కిలోమీటర్ దూరం ప్రయాణం చేయడానికి ఎంత సమయం పడుతోందని అంచనా వేసింది. అలా ఆయా నగరాల్లోని ఉన్న రోడ్ నెట్‌వర్క్‌ని గమనించి ఓ నిర్ధరణకు వచ్చింది. ఈ జాబితాలో ఆరో స్థానంలో బెంగళూరు, ఏడో స్థానంలో పుణే ఉన్నాయి. 2023 మొత్తం మీద ఈ రెండు నగరాల్లోని వాహనదారులు నరకం చూశారని స్పష్టం చేసింది.
బెంగళూరులో 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి 28 నిముషాల 10 సెకన్ల సమయం పడుతోంది. అదే పుణేలో ఇదే దూరానికి 27 నిముషాల 50 సెకన్ల టైమ్ పడుతోందని నివేదిక వెల్లడించింది. ఇండియాకి ఐటీ రాజధానిగా పేరు తెచ్చుకున్న బెంగళూరు చాలా ఇరుకైన నగరంగానూ నిలిచింది. ఐర్లాండ్‌లోని డుబ్లిన్ సిటీ చాలా ఇరుగ్గా ఉంటుంది. ఆ తరవాత అంత ఇరుకైన నగరం బెంగళూరేనట. ఈ లిస్ట్‌లో ఢిల్లీ ముంబయి కూడా ఉన్నాయి. 44వ స్థానంలో ఢిల్లీ, 52వ స్థానంలో ముంబయి ఉన్నట్టు ఈ రిపోర్ట్ వెల్లడించింది. ఢిల్లీలో 10 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయడానికి 21 నిముషాల 40 సెకన్ల సమయం పడుతోంది. ముంబయిలో అయితే ఇది 21 నిముషాల 20 సెకన్లుగా ఉంది. మొత్తంగా 387 సిటీల్లోని ట్రాఫిక్‌ని చూస్తే...2023లో దాదాపు 228 నగరాల్లో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగింది. 82 నగరాల్లో మాత్రం ఇది యథావిధిగా ఉంది. ఈ రద్దీ కారణంగా 2021-23 మధ్య కాలంలో ఫ్యుయెల్ ఖర్చులు దాదాపు 15% మేర పెరిగినట్టు ఈ నివేదిక స్పష్టం చేసింది.