Babu Gogineni: మహిళలకు ఉచిత ప్రయాణంపై విమర్శలా? బాబు గోగినేని దిమ్మతిరిగే సమాధానం
Babu Gogineni News In Telugu: ప్రైవేట్ కంపెనీలకు లక్షల కోట్లు రుణ మాఫీపై స్పందించని వారు.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తుంటే విమర్శించడాన్ని బాబు గోగినేని తీవ్రంగా ఖండించారు.
Free Bus Journey for Women: మహాలక్ష్మీ పథకంలో భాగంగా తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించనుండటంపై కొందరు విమర్శలు చేస్తున్నారు. ఈ అంశంపై ప్రముఖ హ్యూమనిస్ట్ బాబు గోగినేని స్పందించారు. ప్రభుత్వాలు కొన్ని ప్రైవేట్ కంపెనీలు చేసిన లక్షల కోట్ల అప్పులు రుణ మాఫీ చేస్తున్నప్పుడు నోరెత్తని మీరు.. మహిళలకు కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తుంటే విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. సోషల్ మీడియా వేదిక గా స్పందిస్తూ ఓ పోస్ట్ చేశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటలలో భాగంగా రాష్ట్రంలో బాలికలు, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం డిసెంబర్ 9 నుంచి అందుబాటులోకి తెస్తోంది తెలంగాణ సర్కార్.
బాబు గోగినేని పోస్ట్ యథాతథంగా "ఆడవారికి ఉచిత బస్సు ప్రయాణం"
‘ప్రభుత్వాలు కంపెనీలకు లక్షల కోట్లు రుణ మాఫీ చేస్తున్నప్పుడు కిక్కురుమనకుండా కూర్చుని, ఇప్పుడేమో "ఇలా అయితే రాష్ట్రం దివాలా తీస్తుంది కదా?" అని అడుగుతూ బాధ పడిపోతూ మెలికలు తిరిగిపోతున్నారు. నిజానికి ఈ మగ రాయుళ్లు రైలు ప్రయాణం చేసినప్పుడు, బస్ ప్రయాణం చేసినప్పుడు సబ్సిడీ కారణంగానే టికెట్ ధరలు అంత ఎక్కువగా లేవు అని తెలుసుకోలేదులా ఉంది. కొంత మేరకు వీళ్ళ ఇళ్ళల్లో కరెంట్ బిల్ కూడా సబ్సిడీ మీదనే వస్తుంది. నీళ్ళ సప్లై కూడా. వీళ్ళు గవర్మెంట్ బడిలో, కాలేజీల్లో, విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నప్పుడు వీళ్ళ ఫీజులు సబ్సిడీ కారణం గా తక్కువగా ఉన్నాయి అని తెలుసుకుని మన ఆర్థిక వ్యవస్థ గురించి పాపం ఎంత బాధ పడ్డారో!
మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అన్నది ఇతర రాష్ట్రాలలో ఉన్నదే! ఆ ఇతర రాష్ట్రాల అనుభవం ఎలా ఉంది?
ఆడవాళ్ళు ప్రయాణం చేసినప్పుడు కుటుంబంలో అందరినీ వదిలేసి అలా ఒక టూరిస్ట్- రౌండ్ వేసి వస్తారా? లేక కుటుంబం తో పాటు వెళ్తారా? ఆలోచించండి. కరువు కాలంలో కుటుంబం యొక్క ప్రయాణ ఖర్చులు అందరూ లెక్క వేసుకుంటున్నప్పుడు ఆ మేరకు ఆ ఖర్చు తగ్గితే అలా మిగిలిన డబ్బును కుటుంబం కోసం, హోటల్ మీదనో, పిల్లలకు బొమ్మల కోసమో, లేకపోతే దాహానికి ఒక బాటిల్ (ఎట్లాంటిదైనా) కొనుక్కోవడానికి ఉపయోగిస్తారు. అంటే, టికెట్ మీద కాకుండా ఇంకో రకమైన అవసరానికోసం ఖర్చు పెడతారు. అది తీర్థయాత్రలకు వెళ్ళినా, విహార యాత్రలకు వెళ్ళినా, చుట్టాల దగ్గరికి వెళ్ళినా. అంటే, బస్సు టికెట్ మీద వచ్చే ఆదాయం ప్రభుత్వానికి తగ్గినప్పటికీ, ఇతర ఖర్చుల కారణంగా ఆ మేరకు సేల్స్ టాక్స్, జీఎస్టీ రూపంలో కొంత సర్దుబాటు అవుతుంది.
అన్నిటికన్నా ముఖ్యంగా, ఆడవారు తమ సమాజంలో సమాన భాగస్వాములుగా ఉండాలన్న ఉద్దేశానికి దగ్గర అవ్వడానికి ఒక అవకాశం కలుగుతుంది. బీద కుటుంబాలలో అత్యధికంగా అన్ని విషయాలలో లోవెస్ట్ ప్రయారిటీ ఆడపిల్లకే, ఆడవారికే అన్నది మర్చిపోకూడదు! బాధితులకు కొంత వెసులుబాటు కలగడం మంచిదే. "యానిమల్" సినిమా రివ్యూలు వ్రాయడం అయిపోయినది కదా అని, అధిక ఉత్సాహంతో ఈ పాలసీ మీద రివ్యూ వ్రాసే ముందు ఈ స్కీమ్ గురించి కొంత తెలుసుకుని, దాని సోషల్ పర్యవసానాలు గురించి ఆలోచించి వ్యాఖ్యానిస్తే బాగుంటుందేమో.
పోగడాల్సిన అవసరం లేదు కానీ అవగాహన తో విమర్శ చేస్తే బాగుంటుంది కదా. అడగకుండా ఇచ్చినా, అడిగితే ఇచ్చినా, ప్రవేశపెట్టినాక ఎంతమంది ఆడవారు ప్రయాణాలు చేస్తున్నారో గమనించండి. మీ అమ్మగారికి, అక్కకి, చెల్లికి, భార్యకి, స్నేహితురాళ్ల కోసమే ఈ పాలసీ." అని బాబు గోగినేని తన పోస్టులో రాసుకొచ్చారు.
ఇప్పటికే బెంగుళూరు లో ఈ స్కీం అమలులో ఉండగా... తాజాగా తెలంగాణ లో అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల హామీ మేరకు రేపటి నుండి రాష్ట్రం లోని ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం శనివారం (డిసెంబర్ 9) నుంచి అమలు చేయనుంది కాంగ్రెస్ సర్కార్.