Ladakh Conflict: లద్దాఖ్ లో యుద్ధ మేఘాలు.. భారీగా బలగాల మోహరింపు
సరిహద్దుల్లో చైనా మళ్లీ తోక జాడిస్తోంది. ఓవైపు సైనిక చర్చలు జరుగుతుంటే నెమ్మదిగా వైమానిక స్థావరాల నిర్మాణం చేపడుతోంది. వీటిని గమనించిన భారత్ అదనపు బలగాలను లద్దాఖ్ లో దింపింది.
సరిహద్దు ఉద్రిక్తతల పరిష్కారానికి భారత్-చైనా దౌత్య, సైనిక చర్చలు కొనసాగిస్తున్నాయి. అయినప్పటికీ రెండు దేశాలు లద్దాఖ్ లో తమ కార్యకలాపాలను ముమ్మరం చేస్తున్నాయి. కొత్తగా వైమానిక స్థావరాలు నిర్మించడం, ప్రస్తుతమున్నవాటిని విస్తరించడం వంటి చర్యలకు డ్రాగన్ దిగుతోంది. లద్దాఖ్‌తో పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌కు చేరువలోనూ ఇలాంటి పరిణామాలు జరగడం కలకలం సృష్టిస్తోంది. అవసరమైతే లద్దాఖ్‌లో సైనిక చర్య కోసం వీటిని ఉపయోగించాలన్నది చైనా వ్యూహంగా కనిపిస్తోంది. మరోవైపు లద్దాఖ్ ప్రాంతంలో అదనంగా 15వేల మంది సైనికులను భారత్ రంగంలోకి దించింది. కదనరంగంలో కీలక పాత్ర పోషించే దాడి దళాన్ని (స్ట్రైక్ కోర్) కూడా మోహరించింది.
భారత్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, రష్యా తదితర దేశాలతో సరిహద్దులు కలిగిన షిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో వైమానిక స్థావరాలను చైనా పెంచుతోంది. ఈ ప్రాంతానికి లద్దాఖ్‌తోనూ సరిహద్దులు ఉన్నాయి. ఏడాదిగా ఇక్కడ భారత్, చైనాల మధ్య సైనిక ప్రతిష్టంభన, ఘర్షణ వాతావరణం నెలకొంది.
చైనా దొంగ బుద్ధి..
భారత సరిహద్దులకు చేరువలోని అలీ గున్సా, బురాంగ్, టాష్కోర్గామ్ విమానాశ్రయాలను 'మొదటి అంచె' విభాగంలోకి చైనా చేర్చింది. వీటిని పౌర, సైనిక అవసరాలకు ఉపయోగిస్తుంది. టాష్కోర్గామ్ విమానాశ్రయం కారకోరం పాస్‌కు దగ్గరగా ఉంది. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని గిల్గిత్‌కు ఉత్తరాన 10వేల అడుగుల ఎత్తులో పామిర్ పీఠభూమిపై ఇది ఉంది. మన దేశానికి అత్యంత కీలకమైన సియాచిన్ హిమానీనదానికి చేరువలో ఉండటం గమనార్హం. లద్దాఖ్‌లో ఉద్రిక్తతల నడుమ గత ఏడాది ఈ విమానాశ్రయ నిర్మాణం ఆరంభమైంది. చైనా-పాకిస్థాన్ ఆర్థిక నడవా(సీపెక్)కు దగ్గరగా ఉన్న నేపథ్యంలో ఇది చైనాకు అత్యంత కీలకంగా మారింది. వచ్చే ఏడాది జూన్ నుంచి ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు.
లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌కు చేరువలో, 14వేల అడుగుల ఎత్తులో అత్యంత వ్యూహాత్మక ప్రాంతంలో అలీ గున్సా ఎయిర్ పోర్ట్ ఉంది. లద్దాఖ్‌లో పాంగాంగ్ సరస్సుకు 200 కిలోమీటర్ల దూరంలో ఈ స్థావరం ఉండటం గమనార్హం. కైలాస పర్వతానికి ఎదురుగా ఉన్న మానససరోవర్ సరస్సు కూడా దీని పరిధిలోకి వస్తుంది. 2017లో రెండు దేశాల మధ్య డోక్లామ్‌లో జరిగిన సైనిక ప్రతిష్టంభన సమయంలో దీన్ని వేగంగా విస్తరించారు. ఏడాదిగా లద్దాఖ్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో మరిన్ని విస్తరణ పనులు జరిగాయి.
బురాంగ్ లో..
ఇది ఉత్తరాఖండ్ సరిహద్దుల్లో భారత్-టిబెట్-నేపాల్ కూడలి వద్ద కైలాస పర్వతానికి చేరువలో ఉంది. ఈ కూడలిలోని 17వేల అడుగుల ఎత్తులో ఉన్న లిపులేఖ్ పాస్‌ను చేరుకోవడానికి 80 కిలోమీటర్ల పొడవైన వ్యూహాత్మక రోడ్డును భారత్ నిర్మించింది. దీనివల్ల కైలాస మానససరోవర్ యాత్రికుల ప్రయాణం సులువవుతుంది. భారత్, చైనా సరిహద్దుల్లోని బలగాలకు ఆయుధాలు, సరకుల సరఫరా మెరుగుపడుతుంది. ఈ నేపథ్యంలో 13వేల అడుగుల ఎత్తులోని బురాంగ్ పట్టణంలో విమానాశ్రయ నిర్మాణానికి చైనా పూనుకుంది.
కారకోరంపై దృష్టి
కారకోరం పాస్ చుట్టూ ఉన్న హోటన్, షాష్చె, కాషి, యుతియాన్ వాంగ్‌ఫుంగ్ వైమానిక స్థావరాల్లో సౌకర్యాలను చైనా పెంచింది. ఇందులో హోటన్ వైమానిక స్థావరం.. లద్దాఖ్‌కు అత్యంత చేరువలో ఉంది. గత ఏడాది భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుంచి ఈ వైమానిక స్థావరంలో మౌలిక వసతులను పెంచడంతోపాటు భారీగా యుద్ధవిమానాలను డ్రాగన్ మోహరించింది. వీటికితోడు భూటాన్‌కు ఉత్తరాన ఉన్న టాజోంగ్ విమానాశ్రయాన్ని ఆధునికీకరిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్‌కు ఎదురుగా గన్సు ప్రావిన్స్‌లో మింక్షియాన్, డింగ్‌క్షిలో రెండు కొత్త వైమానిక స్థావరాలను ఏర్పాటు చేస్తోంది.
భారత బలగాలు..
చైనా దూకుడును ఎదుర్కోవడానికి తూర్పు లద్దాఖ్‌లో 15వేలకుపైగా అదనపు బలగాలను భారత సైన్యం తరలించింది. జమ్మూ-కశ్మీర్‌లో ఉగ్రవాద వ్యతిరేక పోరులో నిమగ్నమైన దళాల నుంచి వీరిని అటు మళ్లించింది. గతంలో తూర్పు లద్దాఖ్‌లో ఒక డివిజన్ మేర మాత్రమే బలగం ఉండేది. ఇప్పుడు రెండు డివిజన్లు ఉన్నాయి. అదనంగా ట్యాంకు దళాలు, ఇతర విభాగాలు రంగంలోకి దిగాయి. దీనికితోడు 17వ పర్వత ప్రాంత దాడి దళం (మౌంటెయిన్ స్ట్రైక్ కోర్) కూడా ఇటీవల బలోపేతమైంది. భారత్, చైనా సరిహద్దుల్లో సైనిక చర్యలకు వీలుగా 10వేల మంది సైనికులతో దీన్ని పటిష్ఠం చేశారు. పర్వత ప్రాంతాల్లో పోరాడటంలో దీనికి సాటిలేదు. ఉత్తర్ ప్రదేశ్‌లోని మథుర కేంద్రంగా పనిచేసే 1వ దాడి దళంలోని కొన్ని విభాగాలను ఉత్తర సరిహద్దుల్లోకి భారత్ పంపింది. ఈ ప్రాంతంలో శిక్షణ పొందడంతోపాటు, అక్కడి పరిసరాలకు అలవాటు పడటం ఈ మోహరింపు ఉద్దేశం.
జిన్ పింగ్ భేటీ..
టిబెట్‌లో ఇటీవల మూడు రోజుల పాటు పర్యటించిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్.. టిబెట్ రాజధాని లాసాలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్‌ఏ) అగ్ర శ్రేణి సైనికాధికారులతో సమావేశమయ్యారు. టిబెట్-భారత్ సరిహద్దుల్లో పహారా ఉన్న సైనికులకు పూర్తిస్థాయి శిక్షణ ఇచ్చి, యుద్ధ సన్నద్ధుల్ని చేయాలంటూ ఆదేశించారని జిన్హువా వార్తా సంస్థ శనివారం వెల్లడించింది.