AP Politics: ‘నా భర్తను హత్య చేశారు - ఇప్పుడు జగ్గుకు, నాకు రాప్తాడు ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని ఉంది’
AP Politics: రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల నుంచి తమకు, టీడీపీ నేత జగ్గుకూ ప్రాణహాని ఉందని జగ్గు దగ్గరి బంధువు టీడీపీ కార్యకర్త పద్మావతి ఆరోపించారు.
AP Politics: శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల నుంచి తమకు ప్రాణహాని ఉందని టీడీపీ కార్యకర్త పద్మావతి ఆరోపించారు. అలాగే జగ్గును చంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఇటీవల బత్తలపల్లి మండలం గంటాపురంలో టీడీపీ కార్యకర్త జగ్గును పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేసి స్టేషన్ కు తీసుకెళ్లారు. అంతకుముందు వైసీపీ నాయకులు కొంతమంది జగ్గును హత్య చేయాలని దాడి చేసినట్లు ఆమె వివరించారు. వైసీపీ నేతల అరాచకాలపై ఎస్పీని కవడానికి వస్తే పోలీసులు అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తను కూడా గతంలో హత్య చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు తమ మరిదిని కూడా చంపేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పుకొచ్చారు. తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. జగ్గుపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు.
"2004లో నా భర్తను కూడా ఇదే ప్రకారం.. ఇంటిపై స్లాబ్ పగులగొట్టి, దాని మీద వేసి, కిరోసిన్ పోసి నా భర్తను చంపారు. జగ్గు అనే అబ్బాయిని రాత్రి ఒంటి గంటకు కిడ్నాప్ చేసి తీసుకెళ్లి హాని తలపెట్టే ప్రయత్నం చేశారు. కానీ చేతగాత ఎత్తకబోయి ఎక్కడ్నో చెట్లలో వదిలేశారు. సుమో కూడా అంటివ్వాలని చూశారు. కానీ చేతగాక వదిలేశారు. ఇలాంటి దుర్మార్గులను ఏం చేయాలి. కలవడానికి పోతే సార్ ను కలవనీయట్లేరు. మా మరిది జగ్గుకు ప్రాణహాని ఉంది. ఇదంతా రాప్తాడు ఎమ్మెల్యే చందు, ప్రకాష్ రెడ్డియే చేస్తున్నారని" టీడీపీ కార్యకర్త పద్మావతి ఆరోపించారు.
అసలేం జరిగిందంటే..?
ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి చందు రెండు రోజుల క్రితం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. హత్యా రాజకీయాలంటూ మొదలుపెడితే టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ నుంచే మొదలు పెడతామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో బత్తలపల్లి మండలానికి చెందిన టీడీపీ నేత గంటాపురం జగ్గు ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ఆర్ధరాత్రికే ఆయన అరెస్టు, వైఎస్ఆర్ సీపీ నాయకులు దాడి చేయడం జరిగాయి. సత్యసాయి జిల్లాలో టీడీపీ నేత గంటాపురం జగ్గును శనివారం (నవంబరు 26) అర్ధరాత్రి అరెస్టు చేయడం, వైఎస్ఆర్ సీపీ నాయకులు దాడి చేసిన ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. చెన్నేకొత్తపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట మాజీ మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ ఆందోళనకు దిగారు. టీడీపీ కార్యకర్తలు భారీగా స్టేషన్ ఎదుట బైఠాయించి జగ్గును విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఈ పరిణామాలకు తోపుదుర్తి ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి బ్రదర్స్ కారణమని విమర్శించారు. వారు మాట్లాడిన మాటలు దిగజారుడుగా ఉన్నాయని పరిటాల సునీత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడారు.
సోదరుడి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే స్పందించారు. చంద్రబాబు ఫ్యాక్షన్ నైజాన్ని దృష్టిలో పెట్టుకుని తన తమ్ముడు మాట్లాడాడు అన్నారు. తన తమ్ముడు మాట్లాడిన భాష తప్పు అని, భావం సరైనదే అన్నారు. చంద్రబాబు, లోకేశ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో గోబెల్స్ ప్రచారం చేస్తుందన్నారు. వైసీపీలో కొంత మంది ఎమ్మెల్యేల వ్యక్తిత్వ హనానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. గెలవలేక బట్టకాల్చి మీద వేస్తున్నారన్నారు. అనంతపురం జిల్లాలో మళ్లీ ఫ్యాక్షన్ రెచ్చగొట్టే చర్యలు కనిపిస్తున్నాయన్నారు.