AP HIGH COURT: ఏపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై నేడు హైకోర్టు తీర్పు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై నేడు హైకోర్టు తీర్పు వెలువరించనుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై నేడు (సెప్టెంబర్ 16) హైకోర్టు తీర్పు వెలువరించనుంది. స్థానిక ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) దాఖలు చేసిన అప్పీల్‌లో హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేసిన ధర్మాసనం.. నేడు తీర్పు వెలువరించనుంది.
ఎస్‌ఈసీ నీలం సాహ్ని ఈ ఏడాది ఏప్రిల్ 1న ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా ఏప్రిల్ 8న ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలను రద్దు చేస్తున్నట్లు హైకోర్టు సింగిల్ జడ్జి మే 21వ తేదీన కీలక తీర్పు వెలువరించారు. పరిషత్ ఎన్నికలకు సంబంధించి దాఖలైన వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి.. స్థానిక ఎన్నికలను రద్దు చేస్తూ మే 21వ తేదీన తీర్పు ఇచ్చారు. పోలింగ్ తేదీకి నాలుగు వారాల ముందు కోడ్ విధించాలని సూచించిన సుప్రీంకోర్టు ఆదేశాలకు నోటిఫికేషన్ విరుద్ధంగా ఉందని తెలిపారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచే ఎన్నికలను నిర్వహించాలని, దీని కోసం తాజాగా మరో నోటిఫికేషన్ ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు కట్టుబడి పోలింగ్ తేదీకి నాలుగు వారాల ముందు తిరిగి ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
తీర్పును సవాల్ చేసిన ఎస్ఈసీ..
ఈ తీర్పును సవాల్ చేస్తూ.. రాష్ట్ర ఎన్నికల సంఘం, ఎన్నికల్లో పోటీ చేసిన కొందరు అభ్యర్థులు హైకోర్టుకు అప్పీల్ చేశారు. ఎస్ఈసీ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల కోసం రూ.165 కోట్లు ఖర్చు చేశామని, బ్యాలెట్ బాక్సుల నిర్వహణ భారంగా మారుతోందని చెప్పారు. నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్ విధించాలనే నిబంధన లేదని కోర్టుకు తెలిపారు. దీనిపై ఆగస్టు 3వ తేదీన విచారణ ముగించిన హైకోర్టు.. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు వెల్లడించింది.
హైకోర్టుకు వచ్చి వివరణ ఇవ్వండి..
గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఉపాధి పనులకు బకాయిలు చెల్లించకపోవడాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్.. ఈ నెల 24న వ్యక్తిగతంగా హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. విజిలెన్స్ విచారణకు సంబంధించి న్యాయస్థానం లేవనెత్తిన ప్రశ్నలకు వివరణ ఇవ్వాలని పేర్కొంది. విజిలెన్స్ విచారణ వ్యవహారానికి సంబంధించి అదనపు అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ అధికారులు బకాయిల చెల్లింపు విషయంలో కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడింది. తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఈ మేరకు ఆదేశాలిచ్చారు.
Also Read: AP Cabinet meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. 40 అంశాలపై చర్చ..! అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్?
Also Read: TTD New Board : టీటీడీ పాలకమండలి సభ్యుల జాబితా ఖరారు ! రేపోమాపో 50 మంది ప్రత్యేక ఆహ్వానితుల లిస్ట్