AP CM YS Jagan: ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం - వైసీపీ కార్యకర్తలతో భేటీ, నియోజకవర్గం నుంచి 50 మందికి ఛాన్స్
ఆగస్టు 4 నుంచి ప్రతి నియోజకవర్గానికి చెందిన 50 మంది కీలక కార్యకర్తలతో భేటీ అవుతానంటూ నిర్ణయాన్ని వెల్లడించి పార్టీ కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపారు సీఎం జగన్.
![AP CM YS Jagan: ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం - వైసీపీ కార్యకర్తలతో భేటీ, నియోజకవర్గం నుంచి 50 మందికి ఛాన్స్ AP CM YS Jagan Mohan Reddy to meet YSRCP activists from 4 August 2022 AP CM YS Jagan: ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం - వైసీపీ కార్యకర్తలతో భేటీ, నియోజకవర్గం నుంచి 50 మందికి ఛాన్స్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/23/6fe666b44b5a0196ebb3d6c7128a50151658546246_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 4 నుంచి ప్రతి నియోజకవర్గానికి చెందిన 50 మంది కీలక కార్యకర్తలతో భేటీ అవుతానని చెప్పారు. క్యాంపు కార్యాలయంలో వైయస్సార్‌సీపీ ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం భేటీ అయ్యారు. పార్టీ సమన్వయ కర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులు క్రియాశీలకంగా పనిచేయాలని, వారికి అప్పగించిన బాధ్యతలు పూర్తిస్థాయిలో నిర్వర్తించాలని సూచించారు. ఇటీవల జరిగిన పార్టీ సమీక్షలో గడప గడపకు మంత్రులు, ప్రజా ప్రతినిధులు వెళ్లడంపై ఆరా తీసిన సీఎం జగన్ తాజాగా సమన్వయకర్తలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్టీ కీలక కార్యకర్తలపై ఫోకస్ చేసినట్లు కనిపిస్తున్నారు.
పర్యటనలు చేయాలని ఆదేశం..
గడపగడపకూ కార్యక్రమాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని, అందరూకూడా చిత్తశుద్ధితో, అంకిత భావంతో పనిచేయాలని సీఎం జగన్ సూచించారు. సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షుల మీద అదనంగా బాధ్యతలు ఉన్నాయి. వారి నియోజకవర్గాలే కాకుండా, వారికి అప్పగించిన బాధ్యతలను కూడా చూసుకోవాల్సి ఉంటుందన్నారు. మీ అందరిమీద నమ్మకంతో పార్టీ సమన్వయకర్తలుగా, జిల్లా అధ్యక్షులుగా బాధ్యత అప్పగించానని, పార్టీపరంగా కార్యక్రమాలను పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత వీరికి ఉందని వారి కర్తవ్యాన్ని గుర్తుచేశారు.
6 సచివాలయాల్లో గడపగడపకూ కార్యక్రమం
పార్టీ సమన్వయ కర్తలూ తమకు కేటాయించిన ప్రాంతాలకు వెళ్లి పర్యటనలు చేయాలని, క్షేత్రస్థాయిలో పర్యటించి గడప గడపకు కార్యక్రమాన్ని సమీక్షించాలని పార్టీ నేతలకు సీఎం జగన్ సూచించారు. జిల్లా అధ్యక్షులు, పార్టీ సమన్వయ కర్తలతో కో–ఆర్డినేట్ చేసుకుంటూ పర్యవేక్షణ చేసుకుంటూ ముందుకు సాగాలని, వీరంతా ప్రభావంతంగా పనిచేయాలని ఆదేశించారు. కచ్చితంగా నెలలో 6 సచివాలయాల్లో గడపగడపకూ కార్యక్రమం జరిగేలా చూడాలని, ప్రభుత్వపరంగా క్యాలెండర్ ప్రకారం పథకాలు అందిస్తున్నాం, దీనికి తోడు గడపగడపకూ కార్యక్రమాన్ని సమర్థవంతంగా చేసుకుంటే గెలుపు అన్నది అసాధ్యంకానేకాదని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయావకాశాలను మరింత పటిష్టం చేయాలన్నారు.
ఒక్కో నియోజకవర్గానికి దాదాపు రూ.1.20 కోట్లు
ప్రతి సచివాలయంలో ప్రాధాన్య పనులకోసం రూ.20లక్షలు ఇవ్వబోతున్నామని, సక్రమంగా ఆ పనులు జరిగేలా చూసుకోవాల్సిన బాధ్యతకూడా మీమీద ఉందని ఏపీ సీఎం జగన్ పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులకు సూచించారు. ప్రతినెలకు ఒక్కో నియోజకవర్గానికి దాదాపు రూ.1.20 కోట్లు పనులు ఇస్తున్నామని చెప్పారు. నాణ్యతతో ఈ కార్యక్రమం కొనసాగేలా చూడాల్సిన బాధ్యత మీదేనన్నారు.
బూత్‌కమిటీల నుంచి అన్నిరకాల కమిటీల్లో కూడా కీలకంగా వ్యవహరిస్తున్న కార్యకర్తలకు ప్రాధాన్యత ఉండేలా చూసుకోవాలన్నారు. ఆగస్టు 4 నుంచి ప్రతి నియోజకవర్గానికి చెందిన 50 మంది కీలక కార్యకర్తలతో భేటీ అవుతానంటూ నిర్ణయాన్ని వెల్లడించి పార్టీ కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపారు సీఎం జగన్. దీనికి సంబంధించి ప్రణాళిక త్వరలో వెల్లడిస్తామన్నారు. జిల్లాకమిటీలు, మండల కమిటీలు, నగర కమిటీలు అన్నీకూడా అనుకున్న సమయానికి పూర్తి కావాలని, పార్టీ అనుబంధ విభాగాల కమిటీల నిర్మాణం కూడా పూర్తికావాలన్నారు. మహిళా సాధికారితకోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని, ఇవన్నీ సక్రమంగా జరగాలంటే ఈ బాధ్యత మీదేనంటూ పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులకు సీఎం జగన్ దిశా నిర్దేశం చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)