(Source: ECI/ABP News/ABP Majha)
CM Jagan Review: కరోనా కేసుల కలకలం - కొత్త వేరియంట్ పై అధికారులతో సీఎం జగన్ సమీక్ష, కీలక ఆదేశాలు
Andhra News: కరోనా కొత్త వేరియంట్ పై సీఎం జగన్ శుక్రవారం అధికారులతో సమీక్షించారు. కొత్త వేరియంట్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు చర్యలపై దృష్టి సారించాలని ఆదేశించారు.
CM Jagan Review on Corona New Variant: దేశవ్యాప్తంగా కరోనా న్యూ వేరియంట్ జేఎన్ 1 వ్యాపిస్తోన్న నేపథ్యంలో ముందస్తు చర్యలపై దృష్టి సారించాలని సీఎం జగన్ (CM Jagan) అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని (Tadepalli) క్యాంపు కార్యాలయంలో అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. జేఎన్ 1 వేరియంట్ (JN1 Variant) పై ఎలాంటి ఆందోళన అవసరం లేదని, ఆస్పత్రిలో చేరే పరిస్థితులు లేకుండానే రికవరీ అవుతున్నారని వెల్లడించారు. ఈ వేరియంట్ వేగంగా వ్యాపిస్తుందని, లక్షణాలు ఉన్న వారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరీక్షలు చేస్తున్నామని సీఎంకు తెలిపారు. 'పాజిటివ్ వచ్చిన శాంపిళ్లను విజయవాడ జీనోమ్ ల్యాబ్ లో పరిశీలిస్తున్నాం. కొత్త వేరియంట్లను గుర్తించేందుకు ఈ పరీక్షలు దోహదం చేస్తున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ అందుబాటులో ఉంచుతున్నాం. ఆస్పత్రుల్లో పర్సనల్ కేర్ కిట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అవసరమైన మందులు సైతం ఉన్నాయి. ముందస్తు చర్యల్లో భాగంగా ఆక్సిజన్ ఇన్ ఫ్రాను సిద్ధం చేస్తున్నాం. పీఎస్ఏ ప్లాంట్లు సత్వర వినియోగానికి అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఆక్సిజన్ కాన్సట్రేటర్లు, డి - టైప్ సిలిండర్లు, 56,741 ఆక్సిజన్ బెడ్లు సిద్ధంగా ఉన్నాయి.' అని సీఎం జగన్ కు అధికారులు వివరించారు.
సీఎం జగన్ కీలక ఆదేశాలు
కరోనా న్యూ వేరియంట్ పై అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. 'ఈ వేరియంట్ వల్ల ఆందోళన అనవసరమని వైద్యులు చెబుతున్నారు. అయినా, ముందస్తు చర్యలపై దృష్టి పెట్టాలి. గ్రామ, వార్డు సచివాలయాలు, విలేజ్ క్లినిక్ వ్యవస్థలను అలర్ట్ చేయాలి. కొత్త వేరియంట్ లక్షణాలు, తీసుకోవాల్సిన చర్యలపై విలేజ్ క్లినిక్స్ సిబ్బందికి అవగాహన కల్పించాలి. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బోధన చేసేలా తగిన చర్యలు తీసుకోవాలి.' అని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
ఏపీలో కొత్త కరోనా కేసులు
ఏపీలోనూ తాజాగా 3 కరోనా కేసులు వెలుగుచూశాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో తొలి కొవిడ్ కేసు నమోదైంది. 85 ఏళ్ల వృద్ధురాలికి కొవిడ్ సోకినట్లు సమాచారం. అప్రమత్తమైన వైద్యాధికారులు శాంపిల్ ను జీనోమ్ సీక్వెన్స్ ల్యాబ్ కు పంపించారు. ఏలూరులోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీ వైద్యునికి సైతం కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. వేరియంట్ నిర్ధారణ కోసం శ్వాబ్ ను హైదరాబాద్ జినోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ కు పంపారు. అయితే, ఆందోళన చెందాల్సిన పని లేదని పాజిటివ్ వచ్చిన వ్యక్తికి ఎలాంటి లక్షణాలు లేవని డీఎం అండ్ హెచ్ఓ తెలిపారు. పాజిటివ్ వ్యక్తి వేరే ఇతర రాష్ట్రాలకు ఎక్కడా ప్రయాణం చేయలేదని స్పష్టం చేశారు. అటు, తెలంగాణలోనూ కొత్తగా 6 కేసులు నమోదు కాగా, హైదరాబాద్ లో 4, మెదక్ లో 1, రంగారెడ్డిలో ఒక కరోనా కేసులు వెలుగుచూశాయి. ఇప్పటివరకూ 20 కేసులు నమోదయ్యాయి. ఒక్క హైదరాబాద్ లోనే 16 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 19 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఒకరు రికవరీ అయ్యారు. ఇప్పటివరకూ 925 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల అధికారులు అప్రమత్తమయ్యారు.
Also Read: East Godavari Politics : తూ.గో వైసీపీలో ముసలం - ఇతర పార్టీల వైపు చూస్తున్న వైసీపీ నేతలు !