Indians US visa: దయచేసి ఓపిక పట్టండి, వీసాల సమస్య పరిష్కరిస్తాం - అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ప్రకటన
Indians US visa: భారతీయులకు వీసాలు జారీ చేసే ప్రక్రియను వేగవంతం చేస్తామని అమెరికా హామీ ఇచ్చింది.
Indians US visa:
జైశంకర్‌తో భేటీ..
అమెరికా వెళ్లాలని కలలు కనే వారికి వీసా చిక్కులు ఎప్పుడూ ఇబ్బందులు పెడుతూనే ఉంటాయి. వెయిటింగ్ టైమ్ పెరుగుతున్న కొద్ది టెన్షన్ పెరిగిపోతుంటుంది. ఈ మధ్య కాలంలో ఈ సమస్య మరీ ఎక్కువైంది. కొవిడ్ సంక్షోభ సమయంలో చాలా వరకూ యూనివర్సిటీలు మూత పడ్డాయి. భారతీయ విద్యార్థులకు అడ్మిషన్లు ఆలస్యమయ్యాయి. కొంత కాలంగా అన్ని యూనివర్సిటీలు మళ్లీ తెరుచుకుంటున్నాయి. ఫలితంగా...వీసాల అప్లికేషన్లు కుప్పల కొద్ది వచ్చి పడుతున్నాయి. కేవలం స్టూడెంట్ వీసాలనే కాదు. మిగతా వీసాల జారీ కూడా ఆలస్యంగానే సాగుతోంది. ఈ సమస్యకు పరిష్కారం త్వరలోనే కనుగొంటామని అమెరికా హామీ ఇస్తోంది. వాషింగ్టన్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్, యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్..ఆంటోని బ్లింకెన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా...బ్లింకెన్ వీసాల గురించి చర్చించారు. భారతీయులకు వీసాలు జారీ చేసే ప్రక్రియను వేగవంతం చేసేందుకు తప్పకుండా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. ఇండియా నుంచి అమెరికా వెళ్లే వాళ్లకు నాన్ ఇమిగ్రెంట్ వీసా వెయిటింగ్ పీరియడ్ రెండేళ్లకు పైగానే ఉంటోంది. స్టూడెంట్ లేదా ఎక్స్‌చేంజ్ విజిటర్ వీసాల కోసం ఢిల్లీలో 444 క్యాలెండర్ డేస్, విజిటర్ వీసాల కోసం 758 క్యాలెండర్ డేస్, నాన్ ఇమిగ్రెంట్ వీసాల కోసం 354 క్యాలెండర్ డేస్ ఎదురు చూడాల్సి వస్తోంది.
కొవిడ్ కారణంగానే..
ఈ సమస్య పరిష్కరించటంలో బ్లింకన్ అండ్ టీమ్ చొరవ చూపుతారన్న నమ్మకం ఉందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ విశ్వాసం వ్యక్తం చేశారు. కొవిడ్ కారణంగానే ఇలా ఆలస్యమవుతోందని ఇప్పటికే అమెరికా వివరణ ఇచ్చింది. "కొవిడ్ కారణంగా అప్లికేషన్లు చాలా వరకు నిలిచిపోయాయి. ఈ అడ్డంకిని దాటుకుని ఇప్పుడిప్పుడే మళ్లీ ఈ ప్రాసెస్‌ను వేగవంతం చేస్తున్నాం. ఇండియా విషయానికొస్తే...ఈ బ్యాక్‌లాగ్‌ను వీలైనంత త్వరగా కవర్ చేసేందుకు చూస్తున్నాం. రానున్న కొన్ని నెలల్లో ఈ సమస్య పరిష్కారమవుతుంది" అని బ్లింకెన్ వెల్లడించారు. కొవిడ్ సమయంలో అమెరికా వీసాల జారీ ప్రక్రియను చాలా వరకు నిలిపివేసింది. నిర్ణీత సంఖ్యలోనే అందించింది. అయితే...ఇకపై ఈ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా సులభతరం చేసేందుకు చూస్తున్నామని బ్లింకెన్ చెప్పారు. "దయచేసి ఓపిక పట్టండి. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తాం" అని అంటున్నారు. భారత్, అమెరికా మధ్య ఉన్న సంబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కొన్నేళ్లుగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధం బలపడిందని అన్నారు. క్వాడ్ , G20తో పాటు యూఎన్ సంబంధిత అంతర్జాతీయ సంస్థల్లో రెండు దేశాలు కలిసి అడుగు వేస్తున్నాయని స్పష్టం చేశారు బ్లింకెన్.
బ్రిటన్ కూడా..
అమెరికాతో పాటు బ్రిటన్ కూడా వీసాలు జారీ చేసే ప్రక్రియను స్పీడప్ చేసింది. బ్రిటన్‌లో చదవాలనుకునే భారతీయ విద్యార్థులకు యూకే ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారి వీసా కష్టాలు గట్టెక్కనున్నాయి. కేవలం ఒక్కరోజులోనే వీసా మంజూరు చేస్తామని బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది. వీసాల జారీ ప్రక్రియను మరింత వేగవంతం, సులభతరం చేస్తునట్లు.. వీసాలు తొందరగా జారీ చేసేందుకు ప్రియారిటీ, సూపర్ ప్రియారిటీ విధానాలను తీసుకొచ్చినట్లు భారత్‌లోని బ్రిటిష్ హైకమిషనర్ అలెక్స్ ఎలిస్ ప్రకటించారు. ప్రియారిటీ వీసాను అప్లై చేసుకున్న ఐదు రోజుల్లో, సూపర్ ప్రియారిటీ వీసాను దరఖాస్తు చేసుకున్న ఒక్కరోజులోనే పొందవచ్చని వెల్లడించారు. దీని కోసం వీసా ఫీజుతోపాటు అదనఫు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ, చివరి పనిదినం రోజున లేదా సెలవురోజు కంటే ఒక రోజు ముందు సూపర్ ప్రయారిటీ వీసాకు దరఖాస్తు చేసుకుంటే గనుక.. ఆ మరుసటి పనిదినం రోజే వీసాల జారీ ఉంటుంది.
Also Read: Kuno National Park: నమీబియా చీతాలకు శునకాల కాపలా, స్పెషల్ ట్రైనింగ్ పూర్తయ్యాకే డ్యూటీలోకి