Corona Vaccine For Animals: జంతువులకూ కరోనా టీకాలు వస్తున్నాయ్, భారత్‌లోనే తొలిసారి..
జంతువులకూ కరోనా టీకాలు అందుబాటులోకి వస్తున్నాయి. అనోకోవాక్స్ టీకాను ఐసీఏఆర్, ఎన్‌ఆర్‌సీ సంయుక్తంగా తయారు చేశాయి.
జంతువులకూ కరోనా టీకాలు
మనుషులే కాదు చాలా చోట్ల జంతువులూ కరోనా బారిన పడ్డాయి. ఇది తీవ్రతరమవుతుందని కంగారు పడినా అనుకున్న స్థాయిలో జంతువుల్లో వ్యాప్తి చెందలేదు. అయినా ముందస్తు జాగ్రత్తగా జంతువలకూ టీకాలు తయారు చేయాలని శాస్త్రవేత్తలు భావించారు. ఎంతో శ్రమించి ఇప్పుడు వాటికీ టీకాను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇకపై జంతువులకూ కరోనా వ్యాక్సిన్‌లూ అందుబాటులోకి రానున్నాయి. హరియాణాకు చెందిన ఐసీఏఆర్, నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్వైన్స్-NRC సంయుక్తంగా ఈ టీకాను తయారు చేశారు. అనోకోవాక్స్‌గా పిలుచుకునే ఈ వ్యాక్సిన్ వివరాలను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అధికారికంగా ప్రకటించారు.
ప్రత్యేకంగా డయాగ్నోస్టిక్ కిట్‌లు కూడా..
ఒకవేళ జంతువులకు కరోనా సోకితే వాటిలో వైరస్ ప్రభావాన్ని తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది అనోకోవాక్స్ వ్యాక్సిన్. డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్లనూ ఇది నియంత్రిస్తుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్-ICAR ఈ మేరకు ప్రకటన కూడా చేసింది. ఈ టీకాలో ఇన్‌యాక్టివేటెడ్ సార్స్ కొవ్-2 యాంటీజెన్ ఉంటుంది. ఇది కరోనా వ్యాప్తిని అడ్డుకుని ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటుంది. శునకాలు, సింహాలు, కుందేళ్లకు ఈ టీకా పని చేస్తుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ఈటీకాతో పాటు జంతువుల కోసం ప్రత్యేకంగా డయాగ్నోస్టిక్ కిట్‌లనూ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ఎలిసా కిట్‌తో జంతువుల్లో యాంటీబాడీలను గుర్తించేందుకు వీలవుతుంది. మరీ ఎక్కువగా యాంటీబాడీలు విడుదలయ్యాయి అంటే వైరస్ సోకినట్టే లెక్క. అలాంటి సమయంలో ఆయా జంతువులకు టీకా ఇస్తారు. ఇది పూర్తిగా దేశీయంగా తయారైన కిట్. మార్కెట్‌లో ఇలాంటి కిట్‌లు రావటం ఇదే తొలిసారి అని ICAR ప్రకటించింది. ప్రపంచంలోనే మొదటి సారి రష్యాలో జంతువులకు టీకా ఇచ్చారు. కార్నివాక్ కొవ్ టీకా సత్ఫలితాలు ఇచ్చిందని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది కూడా.
జంతువులకూ కరోనా సోకుతుందా..?
2021లో హైదరాబాద్‌లోని జూలో 8 సింహాలు కరోనా బారిన పడ్డాయి. అవి శ్వాసకోశ సమస్యలూ ఎదుర్కొన్నాయి. తరవాత గుజరాత్‌లో ఆవులు, శునకాల్లోనూ కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. 2021లోనే చెన్నైలోని ఓ జూలో రెండు సింహాలు మృతిచెందాయి. వాటిలో కరోనా లక్షణాలు కనిపించటం అప్పట్లో కలకలం రేపింది. వీటన్నికంటే ముందు 2020లోనే ఫిబ్రవరిలో హాంగ్‌కాంగ్‌లో ఓ శునకానికి కరోనా వైరస్ సోకింది.
అప్పటి నుంచి ఇళ్లలో శునకాలు, పిల్లుల్ని పెంచుకునే వాళ్లలో భయం మొదలైంది. వాటికీ కరోనా సోకితే ఎలా అన్న కలవరం మొదలైంది. అయితే...భయపడిన స్థాయిలో ఈ వ్యాప్తి కనిపించలేదు. కొన్ని జంతువుల్లో వైరస్ సోకినప్పటికీ కచ్చితంగా అది కరోనా అని తేల్చలేమని అప్పట్లో పలువురు శాస్ర్తవేత్తలు అభిప్రాయపడ్డారు. ఈ భిన్న వాదనలు ఎలా ఉన్నా జంతువులకూ కరోనా టీకాలు అందుబాటులోకి రావటం మంచి పరిణామమే అంటున్నారు జంతు ప్రేమికులు.