Breaking News Live: సీఎం జగన్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
ఏపీ, తెలంగాణలో నేడు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి, హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రాల అధికారులు వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు. అదే సమయంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుతాయని తెలిపారు. అమరావతిలోని వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా తక్కువ ఎత్తులో నేడు ఆగ్నేయ దిశ నుంచి ఉపరితల గాలులు వీస్తున్నాయి. దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకూ ఎలాంటి వర్షం ఉండబోదని వెల్లడించారు. అలాగే వాతావరణం పొడిగా ఉంటుందని అంచనా వేశారు.
ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. కనిష్ణ ఉష్ణోగ్రతలు నెమ్మదిగా పెరిగే అవకాశం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
ఫిబ్రవరి 8 నుంచి అసలైన ఎండాకాలం మొదలవుతుందని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. ‘‘ఇంత కాలంగా మధ్యాహ్నం సమయం ఉష్ణోగ్రతలు 32 డిగ్రీలను తాకుతోంది. ఈ నుంచి ముఖ్యంగా రాయలసీమ జిల్లాలతో పాటుగా గుంటూరు, కృష్ణా, గోదావరి, పశ్చిమ ప్రకాశం జిల్లాల్లో ఎండ వేడి పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు 35 నుంచి 36 డీగ్రీల మధ్యలో కొన్ని చోట్ల నమోదవ్వనుంది. రాత్రి మాత్రం చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎందుకు ఇలా ఎండలు అంటే దీనికి ఒక లెక్క ఉంది. రోజులో సూర్యుడి కాలం పెరుగుతోంది కాబట్టి ఎండలు క్రమంగా పెరుగుతుంది. ఇప్పుడు పొడి గాలులు నిండుగా ఉంది కాబట్టి వేడి ఉంటుంది. ఇంకా అసలైన ఎండాకాలం ముందు ఉంది.. ముఖ్యంగా ఏప్రిల్-మే నెలలో. కానీ మనం ఇంకా ఫిబ్రవరిలోనే ఉన్నాం కాబట్టి చలి తీవ్రత కొనసాగుతుంది.’’ అని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.
తెలంగాణలో ఇలా..
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. రాష్ట్రమంతా ఎలాంటి వర్ష సూచన లేదు. వాతావరణం అంతా పొడిగానే ఉంటుంది. ఇలాంటి పరిస్థితే మరో మూడు నాలుగు రోజులు ఉండనుందని అంచనా వేశారు.
హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. ఉదయం సమయంలో పొగ మంచు ఏర్పడే అవకాశం ఉంది. నిర్మలంగా ఉంటుంది. ఉదయం సమయంలో కొన్ని చోట్ల పొగమంచు ఏర్పడే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 31 డిగ్రీలు, 19 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిశ నుంచి ఉపరితల గాలులు గంటకు 4 కిలో మీటర్ల నుంచి 8 కిలో మీటర్ల వరకూ వీచే అవకాశం ఉంటుంది. ముందు రోజు గరిష్ఠ ఉష్ణోగ్రత 30 డిగ్రీలుగా, కనిష్ఠ ఉష్ణోగ్రత 19.5 డిగ్రీలుగా నమోదైంది.
ఐదు పంచాయతీలను తెలంగాణలో కలపాలని భద్రాచలం బంద్..
పోలవరం ముంపు ప్రాంతాలను ఆంద్రప్రదేశ్‌లో విలీనం చేయడం వల్ల భద్రాచలం పట్టణ అభివృద్దికి గొడలిపెట్టుగా మారిందని, పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ఐదు గ్రామపంచాయతీలను తిరిగి తెలంగాణలో ఏర్పాటు చేయాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఐదు పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు.
సీఎంతో సినీ ప్రముఖులు భేటీ షురూ
ముఖ్యమంత్రి జగన్‌తో ఆయన క్యాంపు కార్యాలయంలో సినీ ప్రముఖులు సమావేశం అయ్యారు. సీఎంను కలిసిన వారిలో చిరంజీవి, రాజమౌళి, మహేశ్ బాబు, ప్రభాస్ కొరటాల శివ, పోసాని క్రిష్ణ మురళి, ఆర్ నారాయణ మూర్తి, అలీ, నిర్మాత నిరంజన్ రెడ్డి తదితరులు ఉన్నారు. భేటీ అనంతరం వీరు ఉమ్మడి మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
గన్నవరం చేరుకున్న సినీ ప్రముఖులు.. ప్రత్యేక వాహనాల్లో సీఎం వద్దకు..
సీఎంను కలిసేందుకు సినీ ప్రముఖులు ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరిలో చిరంజీవి, రాజమౌళి, కొరటాల శివ, మహేశ్ బాబు, నిర్మాత నిరంజన్ రెడ్డి తదితరులు ఉన్నారు. మరోవైపు, పోసాని, ఆర్.నారాయణ మూర్తి, అలీ ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు. వీరంతా కలిసి ముఖ్యమంత్రి జగన్‌కు ఆయన క్యాంపు కార్యాలయంలో కలవనున్నారు. అయితే, జూనియర్ ఎన్టీఆర్, నాగార్జునకు కూడా ఆహ్వానాలు అందినా వారు హాజరు కావడం లేదు.
సీఎంతో భేటీ వేళ చిరంజీవి కీలక వ్యాఖ్యలు
సీఎం జగన్‌తో సినీ ప్రముఖుల భేటీ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎంఓ నుంచి తనకు మాత్రం ఆహ్వానం అందిందని ఇంకా ఎవరికి ఆహ్వానాలు అందాయనే విషయం తనకు తెలియదని అన్నారు. ‘‘సీఎంతో సమావేశానికి నాకు మాత్రం ఆహ్వానం అందింది. మిగతా వారు ఎవరు వస్తున్నారో నాకు తెలియదు. మీ మీడియా ద్వారానే వారు వస్తున్నారన్న విషయం నాకు తెలిసింది.’’ అని చిరంజీవి అన్నారు. అయితే, గురువారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి మహేశ్ బాబు, కొరటాల శివ, రాజమౌళి, ప్రభాస్ రాగా.. మీడియాతో మాట్లాడేందుకు వారు నిరాకరించారు. మరికొద్ది సేపట్లో వారు ప్రత్యేక విమానంలో విజయవాడకు వెళ్లనున్నారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వెంకయ్య నాయుడు
తిరుమల శ్రీవారిని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దర్శించుకున్నారు.. ఇవాళ ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ గుండా ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.. వెంకయ్య నాయుడుతో పాటుగా ఆయన సతీమణి ఉషా,కుటుంబ సభ్యులు స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చినా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిరుమలకు ఎన్ని సార్లు వచ్చినా నిత్య నూతన ఉత్సాహం, స్పూర్తి కలుగుతుందని, తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తరువాత వచ్చే ఆనందం ప్రతి ఒక్కరు పొందాలని ఆయన కోరారు.. హిందూ ధర్మ పరిరక్షణ, భారతీయ సాంప్రదాయాలను కొనసాగిస్తూ ప్రపంచానికి అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన గుర్తు చేశారు. సంవత్సరంలో ఒకసారి మాత్రమే ప్రముఖులు స్వామి వారిని దర్శించుకోవాలని ఆయన కోరారు. అలా చేయడం వల్ల అందరికి స్వామి వారి దర్శన భాగ్యం లభించే అవకాశం ఉంటుందని,ఈ విధానం తాను పాటిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తన మనుమరాలు సుష్మ వివాహానికి హాజరవ్వడానికి తిరుమల వచ్చామని, కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు పుష్పగిరి మఠంలో సాదాసీదీగా తన మనుమరాలు వివాహం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.