Anantapur Teacher Suicide: టీచర్ ఆత్మహత్యాయత్నం కేసులో ట్విస్ట్, అసలు కారణాలు వెల్లడించిన పోలీసులు
ప్రభుత్వ ఉపాధ్యాయుడు మల్లేష్ ఆత్మహత్యాయత్నం కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇందుకు సీఎం జగన్ కారణం కాదని, అప్పుల బాధతో ఈ పనిచేశాడన్నారు ఉరవకొండ అర్బన్ సీఐ.
అనంతపురం జిల్లా : ప్రభుత్వ ఉపాధ్యాయుడు మల్లేష్ ఆత్మహత్యాయత్నం కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. సమయానికి జీతాలు రావడం లేదనో, సీపీఎస్ రద్దు చేయలేదన్న కారణంతో టీచర్ ఆత్మహత్యాయత్నం చేయలేదని ఉరవకొండ అర్బన్ సిఐ తిమ్మయ్య తెలిపారు. టీచర్ రాసిన అసలైన సూసైడ్ నోట్ తమకు ఇంకా లభ్యం కాలేదన్నారు. అప్పులు తీర్చడం వీలుకాదని భావించే టీచర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలిందని సీఐ వెల్లడించారు. సూసైడ్ నోట్ లో తన భర్త సంతకం లేదని మల్లేష్ భార్య తెలిపిందని చెప్పారు.
కుటుంబ అవసరాలు, చెల్లెలి కుటుంబం కోసం పెద్ద ఎత్తున అప్పులు చేశాడని దర్యాప్తులో భాగంగా పోలీసులు గుర్తించారు. ఎస్బీఐలో రూ.8 లక్షలు, ఐసీఐసీఐలో రూ.8 లక్షలు అప్పు చేశాడు . ఓ యాప్ లో రూ.2 లక్షలు, శ్రీరామ్ చిట్ ఫండ్స్ లో రూ.2 లక్షల లోన్ తీసుకున్నాడని తెలిపారు. అప్పులు తీర్చడానికి మరో బ్యాంకులో లోన్ తీసుకోవడం చేస్తూ ఎక్కువ మొత్తం రుణాలు తీసుకుని వాటిని తీర్చలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని చెప్పారు. అప్పులు పెరిగిపోతుండటం, వాటిని తీర్చే మార్గం లేక ఈ పని చేశాడని కుటుంబసభ్యులు చెబుతున్నారని పోలీసులు తెలిపారు. అప్పులు, లోన్ తీసుకున్న నగదును వ్యక్తిగత అవసరాలు, కుటుంబం కోసం ఖర్చు చేశాడని భావిస్తున్నారు. టీచర్ చికిత్స పొందుతున్నాడని, కొంచెం కోలుకున్నాక కేసు విచారణ వేగవంతం చేస్తామన్నారు.
అసలేం జరిగిందంటే..
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అభిమానించినదుకు తన మరణ శాసనాన్ని తానే రాసుకుంటున్నానని ప్రభుత్వ టీచర్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడని ఓ సూసైడ్ నోట్ వైరల్ అయింది. దాని ప్రకారం.. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం పాల్తూరు గ్రామం ఇందిరానగర్ లోని స్కూల్లో టీచర్ గా మల్లేశప్ప పని చేస్తున్నాడు. మల్లేష్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విరాభిమాని. 2019 ఎన్నికల్లో జగన్ ఇచ్చిన హామీలు నెరవేరుస్తాడని నమ్మి ఉద్యోగులంతా ఓట్లు వేశారని సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు వైఎస్ జగన్ మాటిచ్చాడంటే అవి కచ్చితంగా నెరవేరుస్తాడని తోటి ఉద్యోగులతో తరచూ గొడవ పడేవాడు.
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇవ్వడం సూసైడ్ నోట్లో ప్రధానంగా టీచర్ మల్లేష్ పేర్కొన్నాడు. ఉద్యోగులకు రావలసిన పీఆర్సీ, డీఏలు చెల్లించడం ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు. వీటన్నిటిని ప్రభుత్వం అధికారంలోకి రాగానే జగన్ నెరవేరుస్తాడని నమ్మి ప్రభుత్వ ఉద్యోగులు వేశారని లేఖలో పేర్కన్నాడు. అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాల పూర్తి కావస్తున్న కూడా ఇప్పటివరకు ఏ ఒక్క హామీని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చలేదని మల్లేశ్ మనోవేదనకు గురయ్యాడు. తన సూసైడ్ తో అయినా ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులను తెలియజేయాలని ముఖ్యమంత్రికి తన సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే మల్లేష్ రాసినట్లుగా వైరల్ అవుతున్న సూసైడ్ నోట్ అతడు రాసింది కాదని, ఒరిజినట్ సూసైడ్ నోట్ ఇంకా లభ్యం కాలేదని పోలీసులు చెబుతున్నారు. టీచర్ కోలుకున్నాక విచారణ కొనసాగిస్తామని, ఆత్మహత్యాయత్నానికి కారణాలు అప్పుడు తెలుస్తాయని, దుష్ప్రచారం చేయవద్దని సూచించారు.