Promotions: మరణించిన వారికి ప్రమోషన్లు.. విషయం తెలిసి నాలుక్కరుచుకున్న అధికారులు
మరణించిన ముగ్గురికి ప్రమోషన్లు ఇవ్వడం చూసి అనంతపురం విద్యాశాఖ ఏవిధంగా పనిచేస్తుందో అందరికీ తెలిసిందంటూ అంతా ముక్కున వేలేసుకున్నారు.
బతికి ఉన్నంత కాలం ప్రమోషన్లు ఇవ్వలేదు. తీరా ప్రమోషన్ వచ్చాక తీసుకోవడానికి వారు బ్రతికిలేరు. ఇదేంటి అనుకుంటున్నారా.. మీరు చదివింది నిజమే. చనిపోయిన వారికి ప్రయోషన్లు వచ్చాయి. ఇంత అడ్డుగోలుగా ఆదేశాలు ఇచ్చింది ఎవరనుకొంటున్నారు అనంతపురం జిల్లా విద్యాశాఖ కార్యాలయం. వివరాల్లోకి వెలితే ఈనెల 21 వ తేదీన ప్రమోషన్లు ఇచ్చినట్లు జిల్లా విద్యాశాఖాదికారి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ ప్రమోషన్ జాబితా చూసి అందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. మరణించిన ముగ్గురికి ప్రమోషన్లు ఇవ్వడం చూసి విద్యాశాఖ ఏవిధంగా పనిచేస్తుందో అందరికీ తెలిసిందంటూ అంతా ముక్కున వేలేసుకున్నారు.
లేపాక్షి మండలంలోని విభూతిపల్లిలో మోహన్ బాబు అనే ఎస్జీటీ టీచర్ విధులు నిర్వహించారు. ఆయన ఈ ఏడాది మే 14వ తేదీన మరణించారు. కానీ ఈ వివరాలు విద్యాశాఖ దృష్టికి రాలేదు. అదే మండలంలోని కొత్తపల్లిలో మరో ఎస్జీటి టీచర్ వరదన్న ఆగష్టు 30వ తేదీన మరణించారు. అయితే వీరిద్దరికీ ప్రైమరీ స్కూల్ హెచ్ఎంలుగా ప్రమోషన్లు ఇస్తూ.. ఒకరికి కంబదూరు మండలంలోని ఎస్సీ కాలనీకి పోస్టింగ్ ఇస్తే, మరొకరికి బుక్కపట్నం మండలంలోని పాముదుర్తి కి పోస్టింగ్ ఇచ్చి జిల్లా విద్యాశాఖ అందరినీ ఆశ్చర్యపరిచింది.
పరిగి మండలంలోని ఆనందపాలంలో మరో టీచర్ నాగరాజుది కూడా ఇదే పరిస్థితి. ఈయన బయాలజీ సబ్జెక్టులో స్కూల్ అసిస్టెంగ్ గా పనిచేస్తూ కొద్ది కాలం క్రితం చనిపోయారు. కానీ ఈయనకు కూడా ప్రమోషన్ ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. వీరు ముగ్గురు ఈ నెల 13,14 వతేదీలలో జరిగిన ప్రమోషన్ల కౌన్సెలింగ్ కు గైర్హాజరరు అయ్యారంటూ అనంతపురం విద్యాశాఖ నోటీసులు కూడా జారీ చేసింది. ఇన్ ఆబ్సెంట్ కింద పరిగణిస్తూ అధికారులు ప్రమోషన్ల ఉత్తర్వులు జారీ చేశారు.
ఇంత అడ్డుగోలుగా ప్రమోషన్ల వ్యవహారం జరుగుతుంటే పట్టించుకొనే నాథుడే లేడని జిల్లాలోని కొందరు టీచర్లు వాపోతున్నారు. ప్రమోషన్లు ఇచ్చే ముందు విద్యాశాఖలోని ఐటీ విభాగం ఆయా మండలాల ఎంఈఓలు, డివిజన్ విద్యాశాఖాధికారుల నుంచి నివేదికలు తెప్పించుకొని ప్రమోషన్ల వ్యవహారం చూడాల్సి ఉంటుంది. కానీ ఇవేమీ పట్టించుకోలేదు. అంతేకాదు సస్పెండ్ అయ్యిన వారికి కూడా ప్రమోషన్లు ఇచ్చి ఘనకార్యం చేశామని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే అనంతపురం విద్యాశాఖ మళ్లీ ప్రమోషన్ల వ్యవహారంతో రచ్చకెక్కింది. ఇంత అడ్డుగోలుగా ప్రమోషన్ల ప్రక్రియ ఎలా చేపట్టారు అంటూ ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటికే ప్రమోషన్లు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకూడదంటూ మౌఖిక ఆదేశాలిచ్చినట్లు గా తెలుస్తోంది. మరోవైపు ప్రమోషన్లు ఇచ్చేముందు పాటించాల్సిన నియమ నిభందనలు అమలు చేయలేదన్న విషయం అర్థమవుతోంది. ఈ వ్యవహారంపై వివరణ కోరగా అనంతపురం డీఈవో శ్యామ్యూల్ స్పందించలేదని సమాచారం.