(Source: ECI/ABP News/ABP Majha)
పోలీసులకు లొంగిపోయిన అమృత్‌పాల్ సింగ్ బంధువు, డ్రైవర్- ఖలిస్థాన్ నేత కోసం ముమ్మర గాలింపు
చిక్కినట్టే చిక్కి తప్పించుకున్న ఖలీస్థానీ వేర్పాటువాద నేత, ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థ చీఫ్ అమృత్ పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసుల విస్తృతంగా గాలిస్తున్నారు.
Amritpal Singh News : చిక్కినట్టే చిక్కి తప్పించుకున్న ఖలీస్థానీ వేర్పాటువాద నేత, ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థ చీఫ్ అమృత్ పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసుల విస్తృతంగా గాలిస్తున్నారు. ఇప్పటికే అతను పరారీలో ఉన్నాడని అధికారికంగా ప్రకటించిన పోలీసులు.. అనుమానిత ప్రదేశాల్లో జల్లెడ పడుతున్నారు. అతన్ని పట్టుకునేందుకు పంజాబ్ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ మూడో రోజుకు చేరింది. శనివారం జలంధర్‌లోని షాకోట్ తహసిల్‌కు తన కాన్వాయితో వెళుతున్నట్టు సమాచారం అందుకున్న రాష్ట్ర పోలీసులు కేంద్ర బలగాల సహకారంతో అతన్ని అరెస్టు చేసేందుకు పథకం రూపొందించారు. దాదాపు 25 కి.మీ. వెంబడించినా వాహనాలు మారుతూ తప్పించుకున్నాడని, త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసు అధికారులు తెలిపారు. అమృత్‌పాల్ సింగ్ దొరికినట్టే దొరికి తప్పించుకోవడంతో పంజాబ్ వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు.. అమృత్‌పాల్ సింగ్ బంధువు హరిజిత్ సింగ్, డ్రైవర్ హర్‌ప్రీత్ పంజాబ్‌లోని మెహత్‌పూర్‌లో పోలీసులకు లొంగిపోయారు.
అమృత్‌పాల్ సింగ్ ఆచూకీ కోసం పంజాబ్ పోలీసులు అనేక ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. గాలింపు చర్యల్లో భాగంగా అమృత్‌పాల్ స్వగ్రామం జల్లుపుర్‌లోని నివాసంలోనూ పోలీసులు సోదాలు నిర్వహించారు. పంజాబ్ సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేశారు. అనుమానాస్పదంగా కనిపిస్తున్న ప్రతి వాహనాన్నీ తనిఖీ చేస్తున్నారు. రాష్ట్రంలోని సరిహద్దులను మూసివేసి రహదారులపై భారీగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. వదంతులు వ్యాప్తి చెందకుండా మొబైల్ ఇంటర్నెట్, ఎస్‌ఎంఎస్ సేవలను సోమవారం మధ్యాహ్నం వరకు నిలిపివేస్తూ పంజాబ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆసుపత్రులు, బ్యాంకుల సేవల్ని దృష్టిలో పెట్టుకుని బ్రాడ్‌బ్యాండ్ సేవలను కొనసాగిస్తున్నారు.
శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రధాన నగరాల్లో పోలీసులు కవాతు నిర్వహించారు. అమృత్‌పాల్ కాన్వాయ్‌కి చెందినదిగా భావిస్తున్న ఓ కారును జలంధర్ జిల్లాలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ వాహనంలో ఒక వాకీటాకీ, తుపాకీ, డజన్ల కొద్దీ తూటాలు లభ్యమయ్యాయి. దీంతో అక్రమ ఆయుధాల కోణంలో అమృత్‌పాల్, అతని అనుచరులు కొందరిపై పోలీసులు జాతీయ భద్రతా చట్టం కింద రెండు కేసులు నమోదు చేశారు. ఇప్పటివరకు మొత్తం 112 మంది అమృతపాల్ సింగ్ అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో అతని ఆర్థిక వ్యవహారాలను నిర్వహించే దల్జీత్ సింగ్ కల్సి కూడా ఉన్నాడు. అరెస్ట్ చేసిన అమృత్‌పాల్ అనుచరుల్లో కీలకమైన నలుగురిని ప్రత్యేక విమానంలో అసోంలోని డిబ్రూగఢ్ జైలుకు తరలించారు. ఆ నలుగురికీ జైల్లో పూర్తి రక్షణ కల్పిస్తామని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఢిల్లీలో మీడియాకు తెలిపారు.
అమృత్‌పాల్‌సింగ్ కోసం వేట కొనసాగుతున్న సమయంలోనే బ్రిటన్‌లో ఖలిస్థాన్ మద్దతుదారులు వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తంచేశారు. నిరసనకారులు లండన్‌లోని భారత హైకమిషన్ భవనంపైకి ఎక్కి జాతీయ జెండాను కిందకు దించుతున్నట్టు సోషల్ మీడియాలో వీడియోలు కనిపించాయి. ఈ వ్యవహారంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం సాయంత్రం బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ క్రిస్టినా స్కాట్‌ను పిలిపించి వివరణ కోరింది.
అమృత్‌పాల్ పోలీసుల నిర్బంధంలోనే ఉన్నాడంటూ దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై మంగళవారంలోగా స్పందన తెలియ జేయాలని పంజాబ్, హరియాణా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం పంజాబ్‌లో భయానక వాతావరణం సృష్టించడం ఆపాలని అకల్ తఖ్త్ జత్యేదార్ సంస్థ సూచించింది. ఇప్పటికే పంజాబ్ చాలా బాధలు అనుభవించిందని, ఇక చాలని పేర్కొంది.
కాగా.. ఫిబ్రవరి 24న అజ్నాలా పోలీస్ స్టేషన్ పై దాడి తర్వాత అమృత్‌పాల్‌సింగ్‌ను అరెస్ట్ చేయాలని పంజాబ్ ప్రభుత్వం భావించింది. అయితే జీ20 సమావేశాలు అయ్యే వరకు ఓపిక పట్టి తర్వాతి రోజే భారీ ఆపరేషన్ ప్రారంభించింది. తన సన్నిహితుడు లవ్ ప్రీత్ సింగ్ అరెస్ట్ తర్వాత అతడిని విడిపించేందుకు అమృత్ పాల్ సింగ్ తన మద్దతుదారులతో కలిసి పోలీస్ స్టేషన్‌పై దాడులు చేశాడు. ఈ ఘటనలో ఎస్పీతో పాటు పలువురు పోలీసులపై దాడి చేశారు.