Amritpal Singh: కెనడా పారిపోయేందుకు అమృత్ పాల్ ప్రయత్నం- నిఘా వర్గాల అనుమానం
Amritpal Singh: పరారీలో ఉన్న వివాదాస్పద మతబోధకుడు, ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్ పాల్ సింగ్ గురించి తవ్వేకొద్దీ విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Amritpal Singh: ఖనిస్థానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్ దేశాన్ని విడిచి పారిపోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. అమృత్‌పాల్ సింగ్ నేపాల్ మీదుగా కెనడా పారిపోయే అవకాశాలు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే వారిస్ పంజాబ్ దే నేత కోసం భద్రతా దళాలు పంజాబ్ ను గాలిస్తున్నాయి. చాలా కాలం దుబాయ్ లో ఉన్న అమృత్‌పాల్ కు అక్కడే పాకిస్థానీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐతో పరిచయాలు ఏర్పడ్డట్లు అధికారులు గుర్తించారు. అతడిని పాక్ ఐఎస్ఐ పావుగా వాడుకుంటోందని, పంజాబ్‌లో కల్లోలం సృష్టించడానికి అమృత్‌పాల్ ను వాడుకున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.
ఐఎస్ఐ ఏజెంట్లతో పరిచయాలు
అమృత్‌పాల్ 2012లో ట్రక్ డ్రైవర్ గా పని చేసేందుకు దుబాయ్ కు వెళ్లాడు. అక్కడే ఖలిస్థానీ నాయకుడు లఖ్బీర్ సింగ్ రోడే సోదరుడు జశ్వంత్ తో, ఉగ్రవాది పరమ్‌జీత్ సింగ్ పమ్మాతో పరిచయం ఏర్పడింది. వారు అమృత్ పాల్ కు బ్రెయిన్ వాష్ చేశారు. ఆ తర్వాత అమృత్‌పాల్‌ను జార్జియా పంపించారు. అక్కడే అతడికి ఐఎస్ఐ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారని ఇంటెలిజెన్స్ అధికారులు అనుమానిస్తున్నారు.
పంజాబ్ లో ఆందోళనలు రేపడానికే అమృత్ పాల్ దేశంలోకి అడుగుపెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత వారిస్ పంజాబ్ దేలో చేరి చాలా వేగంగా ఎదిగాడు. దీంతో పాటు సిక్ ఫర్ జస్టిస్ సంస్థతో కూడా అమృత్ పాల్‌కు సంబంధాలు ఉన్నాయి. పాక్ నుంచి తరచూ డ్రోన్ల ద్వారా పంజాబ్ లో ఉన్న అమృత్ పాల్ కు అవసరమైన ఆయుధాలు సమకూరినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. అమృత్ పాల్ కు యూకేలో ఉంటున్న అవతార్ సింగ్ ఖండా ప్రధాన హ్యాండిలర్ గా వ్యవహరించినట్లు గుర్తించారు. అవతార్ సింగ్, పమ్మాకు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. 2022 ఫిబ్రవరి వరకు అనామకుడిగా ఉన్న అమృత్ పాల్ మెరుపువేగంలో ఎదుగుదల వెనక అవతార్ ప్లాన్లు ఉన్నాయి. గతంలో అమృత్ పాల్ కనీసం తలపాగా కూడా ధరించేవాడు కాదు. కానీ దీప్ సిద్దూ మరణం తర్వాత వారిస్ పంజాబ్ దేకు అన్నీ తానైపోయాడు.
ప్రైవేటు సైన్యం ఏర్పాటు
అమృత్‌పాల్ సొంతంగా ఓ ప్రైవేటు సైన్యం ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సైన్యానికి ఆనంద్ పూర్ ఖల్సా ఫోర్సు(ఏకేఎఫ్) గా పేరు పెట్టాడు. ఆ పేరుతో ఉన్న జాకెట్లను ఆ సైన్యం ధరించేది. అమృత్ పాల్ ఇంటిపై అధికారులు దాడులు చేసినట్లు ఏకేఎఫ్ అని రాసి ఉన్న పలు జాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. దీనికితోడు నిన్న అమృత్ పాల్ వాహనం నుంచి తూటాలు, తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ దళం సహకారంతోనే అజ్ నాలా స్టేషన్ పై దాడి జరిగినట్లు అనుమానిస్తున్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలోనే కిరణ్ దీప్ కౌర్ తో పెళ్లి
అమృత్ పాల్ భార్య, 29 ఏళ్ల కిరణ్ దీప్ కౌర్ యూకేకు చెందిన ఎన్నారై. వారి స్వస్థలం జలంధర్. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలోనే అమృత్ పాల్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి అమృత్ పాల్ పూర్వీకుల గ్రామమైన జల్లూపూర్ ఖేడాలో జరిగింది. పెళ్లి తర్వాత భార్యను తనతోనే ఉండిపోవాలని అమృత్ పాల్ కోరాడు. ఇది విదేశాల నుంచి పంజాబీల రివర్స్ మైగ్రేషన్ ను ప్రోత్సహించేందుకు ఉపయోగపడుతుందని.. అతడు ఆమెకు నచ్చజెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కిరణ్ దీప్ కౌర్ ఇప్పటికే కెనడా వీసా కోసం దరఖాస్తు చేసినట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. దీంతో అమృత్ పాల్ కూడా నేపాల్ మీదుగా కెనడాకు పారిపోయేందుకు ప్రయత్నించవచ్చని అనుమానిస్తున్నారు. ఈ విషయాన్ని జలంధర్ స్వపన్ శర్మ ధ్రువీకరించారు.
ఈ క్రమంలోనే కేంద్రం హోంశాఖ దేశ సరిహద్దుల వద్ద తనిఖీలు, భద్రతను పటిష్టం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అమృత్ పాల్ నేపాల్ వద్ద అంతర్జాతీయ సరిహద్దులు దాటే అవకాశం ఉండడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.