Arwind Kejriwal: తరవాతి ప్రధాని అమిత్ షాయే, మోదీ ఇక రిటైర్ అయిపోతారు - కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
Arwind Kejriwal: బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే అమిత్‌షా ప్రధాని అవుతారని, యోగి ఆదిత్యనాథ్‌ని పక్కన పెట్టేస్తారని కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Arwind Kejriwal Election Campaign: జైల్ నుంచి బెయిల్‌పై బయటకు వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ లోక్‌సభ ఎన్నికల తొలిరోజు ప్రచారంలోనే సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాజకీయ ప్రస్థానం ముగిసిపోనుందని వెల్లడించారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే జరిగేది ఇదే అని తేల్చి చెప్పారు. అంతే కాదు. అమిత్ షా ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు. ఈ ఏడాదితో నరేంద్ర మోదీకి 75 ఏళ్లు నిండుతాయని, ఇకపై ఆయన పొలిటిలక్ రిటైర్‌మెంట్ తీసుకుంటారని అన్నారు. ఆయన స్థానంలో అమిత్‌షా ప్రధాని పదవిని చేపడతారని తెలిపారు. బీజేపీ కేంద్రంలో మరోసారి అధికారంలోకి వస్తే ప్రతిపక్ష నేతలందరినీ జైల్లో పెడుతుందని ఆరోపించారు. యోగి ఆదిత్యనాథ్‌ని రెండు నెలల్లోనే పక్కన పెట్టేస్తారని స్పష్టం చేశారు.
"బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే ప్రతిపక్ష నేతల్ని జైలుకి పంపిస్తుంది. సొంత నేతల రాజకీయ భవిష్యత్‌నీ నాశనం చేస్తుంది. హేమంత్ సోరెన్‌తో పాటు మరి కొందరు ప్రతిపక్ష మంత్రులు జైల్‌లో ఉన్నారు. మళ్లీ బీజేపీ గెలిస్తే మమతా బెనర్జీ, ఎమ్‌కే స్టాలిన్, తేజస్వీ యాదవ్, పినరయి విజయన్, ఉద్దవ్ థాక్రే జైలు పాలవుతారు. యోగి ఆదిత్యనాథ్ పొలిటికల్ కెరీర్ కూడా ముగిసిపోతుంది. రెండు నెలల్లో ఆయనను పక్కన పెట్టేస్తారు"
- అరవింద్ కేజ్రీవాల్
#WATCH | Delhi CM Arvind Kejriwal says "...These people ask the INDIA alliance who will be their Prime Minister. I ask BJP who will be your Prime Minister? PM Modi is turning 75, on 17th September. He made a rule that leaders in the party would retire after 75 years...LK Advani,… pic.twitter.com/P1qYOl7hIt
— ANI (@ANI) May 11, 2024
అద్వానీ, మురళీ మనోహర్ జోషి, శివరాజ్ చౌహాన్, వసుంధరా రాజే, రమణ్ సింగ్ లాంటి నేతల రాజకీయ భవితవ్యాన్ని బీజేపీ నాశనం చేసిందని, ఈ జాబితాలో తరవాత ఉన్నది యోగి ఆదిత్యనాథ్ అని స్పష్టం చేశారు కేజ్రీవాల్. మన దేశానికి పోరాట చరిత్ర ఉందని, ఏ నియంత వచ్చి అణిచివేయాలని చూసినా ప్రజలే తిరగబడ్డారని అన్నారు. ఇవాళ ఓ నియంత (ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ) ప్రజాస్వామ్యాన్ని అంతం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన అరవింద్ కేజ్రీవాల్ చాలా రోజులుగా బెయిల్ కోసం పోరాటం చేశారు. ఆయన బెయిల్ పిటిషన్‌ని సవాల్ చేస్తూ ఈడీ సుప్రీంకోర్టులో అఫిడటివ్ దాఖలు చేసింది. ఆయనకు ప్రచారం చేసే ప్రాథమిక హక్కు లేదని తేల్చి చెప్పింది. అయితే...కేజ్రీవాల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. జూన్ 5వ తేదీ వరకూ బెయిల్ కోరినప్పటికీ కోర్టు జూన్ 1వ తేదీ వరకే అనుమతినిచ్చింది. జూన్ 2వ తేదీన మళ్లీ లొంగిపోవాలని ఆదేశించింది. ఫలితంగా కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారానికి లైన్ క్లియర్ అయింది.