Balloon Row: ఒకదాని తర్వాత మరొకటి, ఎగిరే వస్తువును కూల్చేసిన అమెరికా
Balloon Row: అమెరికా మరో ఎగిరే వస్తువును కూల్చేసింది. వారంలో ఇలాంటి వస్తువులు కనిపించిన ఘటన ఇది నాలుగోది.
Balloon Row: అమెరికా మరో ఎగిరే వస్తువును కూల్చేసింది. యూఎస్ పరిధిలో గగనతల నిబంధనలను ఉల్లంఘించడంతో నాలుగో వస్తువును షూట్ చేసి పేల్చేసింది. 8 కోణాలతో ఉన్న ఆ వస్తువు.. అమెరికా, కెనడా సరిహద్దుల్లో హ్యురోన్ సరస్సుపై ఎగురుతూ కనిపించింది. అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశానుసారం యూఎస్ ఆర్మీకి చెందిన ఎఫ్ - 16 ఫైటర్ జెట్ దానిని కూల్చేసింది. ఈ మధ్యకాలంలో ఇలాంటి వస్తువులు అమెరికా గగనతలంలో కనిపించడం, వాటిని పేల్చేయడం ఇది నాలుగోసారి. తాజాగా ఆకాశంలో కనిపించిన వస్తువును సైనిక ముప్పుగా పరిగణించలేదని, అయితే అది పౌర విమానయానానికి ముప్పును కలిగిస్తుందన్న ఉద్దేశంతోనే కూల్చేసినట్లు అమెరికా సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
వారంలో 4వ ఘటన
గత వారం రోజుల్లో అమెరికా, కెనడా గగనతలంలో యూఎఫ్ఓలు కనిపించిన కేసులు నాలుగు నమోదు అయ్యాయి. ఈ నాలుగింటిలో 3 ఎగిరే వస్తువులు అమెరికా ఆకాశంలో కనిపించగా, ఒక యూఎఫ్ఓ కెనడియన్ గగనతలంలో కనిపించింది. ఈ నాలుగు ఎగిరే వస్తువులన్నింటిని అమెరికా సైనిక విభాగం యుద్ధ విమానాల ద్వారా కూల్చివేశారు.
కెనడాలో కనిపించిన 4వ వస్తువు
తాజాగా పేల్చేసిన వస్తువు కెనడా గగనతలం పరిధిలో కనిపించింది. యూఎస్ ఫైటర్ జెట్ ఈ ఎగిరే వస్తువును కూల్చేసింది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా ఎగిరే వస్తువు కనిపించినట్లు నిర్ధారించారు. పీఎం ట్రూడో అనుమతి మేరకు కెనడియన్ గగనతలంలో గుర్తుతెలియని ఎగిరే వస్తువును కూల్చేసినట్లు తెలిపారు.
బెలూన్ తో ప్రారంభం..
గతవారం మొదటి సారి ఓ బెలూన్ ఆకాశంలో కనిపించింది. దానిని కూల్చేసిన అమెరికా.. దాని వెనక చైనా గూఢచర్య ఉందని, అది చైనా స్పై బెలూన్ అంటూ ఆరోపణలు చేసింది. అయితే ఈ ఆరోపణలను చైనా కొట్టేసింది. అది వాతావరణాన్ని పరిశీలించే బెలూన్ మాత్రమేనని.. అది దారి తప్పి అమెరికా ఆకాశంలోకి వచ్చిందని పేర్కొంది. చైనా స్పందనను అమెరికా సైతం ఖండించింది.
అమెరికా- చైనా మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. దక్షిణ చైనా సముద్రం విషయంలో ఈ రెండు దేశాల మధ్య ఎప్పటినుంచో మాటల యుద్ధం నడుస్తోంది. ఇటీవలే చైనా మరింత దూకుడుగా వ్యవహరించింది. ఈ సముద్రంపై ప్రయాణిస్తున్న అమెరికా నిఘా విమానాన్ని డ్రాగన్ ఫైటర్ జెట్ దాదాపు ఢీకొట్టబోయింది. ఈ విషయాన్ని అమెరికా సైన్యం వెల్లడించింది. అమెరికా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన నిఘా విమానం ఆర్‌సీ-135 విమానానికి అత్యంత సమీపంలోకి చైనా యుద్ధ విమానం దూసుకొచ్చినట్లు యూఎస్ మిలిటరీ వెల్లడించింది. ఈ ఘటన గురించి యూఎస్ ఇండో-పసిఫిక్ కమాండ్ ఓ ప్రకటన విడుదల చేసింది. డిసెంబరు 21న దక్షిణ చైనా సముద్రంపై అమెరికా నిఘా విమానం ప్రయాణించింది. ఆ సమయంలో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీకి చెందిన జే-11 యుద్ధ విమానం.. అమెరికా విమానానికి ఎదురుగా 6 మీటర్ల (20 అడుగులు) దూరం వరకు దూసుకొచ్చిందని అమెరికా వెల్లడించింది.యూఎస్ పైలట్ చాకచక్యంగా వ్యవహరించి ఢీకొనే ప్రమాదాన్ని తప్పించినట్లు తెలిపింది. దక్షిణ చైనా సముద్రంపై అంతర్జాతీయ గగనతలంలో చట్టపరంగానే తాము సాధారణ కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని అమెరికా ఈ సందర్భంగా పేర్కొంది.