Amazon Layoffs: అమెజాన్‌లో భారీగా లేఆఫ్‌లు? భారత్ ఉద్యోగులపైనా ఎఫెక్ట్!
Amazon Layoffs: అమెజాన్‌లో భారీగా లేఆఫ్‌లు ఉంటాయన్న వార్తలు వినిపిస్తున్నాయి.
Amazon Layoffs:
10 వేల మంది తొలగింపు..?
ఇప్పుడు ఏ కంపెనీ గురించి విన్నా "లేఆఫ్‌ల" మాటే వినిపిస్తోంది. కొవిడ్ సంక్షోభం నుంచి కోలుకున్నా...కొన్ని కంపెనీలు కాస్ట్ కటింగ్‌లో భాగంగా ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించుకుంటున్నాయి. ఎప్పుడు ఎవరు "ఫైర్" అవుతారో అర్థం కాని పరిస్థితి. బడా కంపెనీలన్నీ ఇదే బాట పడుతున్నాయి. ఇప్పటికే ట్విటర్ ఈ ప్రక్రియను మొదలు పెట్టింది. అయితే...అన్నింటి కంటే ఎక్కువగా Amazon కంపెనీలోనే లేఆఫ్‌లుంటాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని నివేదికలూ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. భారత్‌లో వందలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తం 10 వేల మందిని తొలగించాలని అమెజాన్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. భారత్‌లో ఎంత మందిని తొలగిస్తారని కచ్చితంగా సంఖ్య తెలియకపోయినా...భారీగానే ఉంటాయని అంటున్నారు. మెటా కంపెనీ కన్నా ఎక్కువ మంది ఉద్యోగులకు ఉద్వాసన ఇచ్చేందుకు ప్లాన్ రెడీ చేసుకుంటోందట అమెజాన్. భారత్‌లో అమెజాన్‌కు లక్షా 10 వేల మంది ఉద్యోగులున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ మందగమనంగా సాగుతున్నందున బిజినెస్ పెద్దగా జరగడం లేదు. అందుకే...కాస్ట్ కటింగ్‌లో భాగంగా ఈ లేఆఫ్‌లు చేపట్టాలని అనుకుంటోంది అమెజాన్ కంపెనీ. "లేఆఫ్‌ల ప్రక్రియ సిద్ధమవుతోంది. కానీ ఎంత మంది అన్న సంఖ్య అయితే తెలీదు" అని ఓ రిపోర్ట్ వెల్లడించింది. ఈ కంపెనీలోని కార్పొరేట్ స్టాఫ్‌లో 3% మందిని తొలగిస్తారని గతంలోనే వార్తలొచ్చాయి.
రెసిషన్‌తో తిప్పలు..
అమెరికాలో రెసిషన్ అంతకంతకూ పెరుగుతోంది. ఈ ప్రభావం టెక్ సెక్టార్‌పై పడనుంది. ఇప్పటికే లేఆఫ్‌లు మొదలయ్యాయి. యూఎస్‌లోని LYFT,Stripe కంపెనీలు పెద్ద మొత్తంలో ఉద్యోగులను తొలగించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజుల పాటు కార్పొరేట్ హైరింగ్‌ను నిలిపివేయాలని అమెజాన్ నిర్ణయం తీసుకుంది. అమెరికాలో ప్రస్తుతానికి ద్రవ్యోల్బణం పెరుగుతూ పోతోంది. దీన్ని కట్టడి చేసేందుకు Federal Reserve, Central Bank of America వడ్డీ రేట్లను పెంచుకుంటూ పోతున్నాయి. ఈ నిర్ణయం కూడా అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఇది క్రమంగా...టెక్ కంపెనీల ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్‌ను దెబ్బ తీస్తోంది. రాబోయే రోజుల్లో తమ కంపెనీలు ఎన్నో సవాళ్లు దాటుకుని రావాల్సి ఉంటుందని ఆయా సంస్థల ఉన్నతాధికారులు చెబుతున్నారు. నిజానికి..కొవిడ్ సంక్షోభంలోనూ టెక్ సెక్టార్ బాగానే నెట్టుకు రాగలిగింది. ప్రాజెక్ట్‌లు పూర్తి చేయటంలో కాస్త అటు ఇటు అయినప్పటికీ...ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదు. ఉద్యోగావకాశాలు కూడా పెరిగాయి. దాదాపు మూడేళ్లుగా స్టేబుల్ గ్రోత్‌తో దూసుకెళ్తున్న టెక్ సెక్టార్ ఒక్కసారిగా చతికిలపడింది. LYFT కంపెనీలో తమ వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 13% మంది ఉద్యోగులను తొలగించనున్నారు. అంటే...సుమారు 700 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నారు. రైడ్ సర్వీస్‌లు అందించే ఈ కంపెనీ..రైడ్ షేర్ ఇన్సూరెన్స్ ఖర్చులు పెరుగుతున్నాయని చెబుతోంది. ఇక Stripe కంపెనీ...తమ సంస్థలో 14% మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటించింది.