Amazon India: మేం ఎవరినీ తీసేయలేదు, వాళ్లే స్వచ్ఛందంగా రిజైన్ చేశారు - కార్మిక శాఖకు అమెజాన్ వివరణ
Amazon India: తమ సంస్థ ఉద్యోగులను బలవంతంగా తొలగించడం లేదని అమెజాన్ వెల్లడించింది.
Amazon India:
ఏటా జరిగేదే..
అమెజాన్‌లో భారీ లేఆఫ్‌లు కొనసాగుతున్నాయి. సీఈవో కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. దీనిపై వివరణ కోరుతూ పుణెకు చెందిన ఓ ఉద్యోగ సంఘంతో పాటు, Nascent Information Technology Employees Senate (NITES) కార్మికమంత్రిత్వ శాఖకు పిటిషన్ వేశాయి. కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ దీనిపై స్పందించాలని కోరింది. వెంటనే...కార్మిక శాఖ అమెజాన్‌కు నోటీసులు పంపింది. ఈ పిటిషన్‌పై స్పందించిన అమెజాన్ తమ సంస్థ ఎవరినీ తొలగించలేదని వెల్లడించింది. బలవంతంగా ఉద్యోగులను తొలగించారన్న ఆరోపణలను కొట్టి పారేసింది. అమెజాన్ ప్రతినిధి ఈ మేరకు బెంగళూరులోని కార్మిక మంత్రిత్వ శాఖ కమిషనర్‌కు పూర్తి వివరాలు అందించారు. దీనిపై విచారణ జరిగిన సమయంలో పిటిషన్ వేసిన వాళ్లు NITES అక్కడ లేదు. ప్రతి సంవత్సరం ఉద్యోగులను రివ్యూ చేయడం సహజమేనని అమెజాన్ ప్రతినిధి ఆ స్టేట్‌మెంట్‌లో స్పష్టం చేశారు. వాళ్ల పర్ఫార్‌మెన్స్ ఆధారంగా వాళ్ల హోదాలను మార్చడం (Realignment) అనేదీ ఏటా జరిగేదే అని వివరించారు. తాము ఇచ్చిన ప్యాకేజీ నచ్చిన వాళ్లే ఆ మొత్తం తీసుకుని స్వచ్ఛందంగా రాజీనామా చేశారని స్పష్టం చేశారు. అయితే...
ఈ రీలైన్‌మెంట్ స్కీమ్‌ను అందరిపైనా బలవంతంగా రుద్దలేదని, ఉద్యోగుల ఇష్టప్రకారమే అది జరుగుతుందని తేల్చి చెప్పారు అమెజాన్ ప్రతినిధి. ఈ స్కీమ్‌ని అంగీకరించిన ఉద్యోగులకు...రిజైన్ చేసి రిలీవ్ అయ్యేప్పుడు పెద్ద మొత్తంలో ప్యాకేజ్ అందుతుందని చెప్పారు. ఎవరినీ కంపెనీలో నుంచి ఉద్దేశపూర్వకంగా బయటకు పంపలేదని తెలిపారు.
సీఈవో ప్రకటన..
ట్విటర్, ఫేస్‌బుక్ తరవాత భారీగా లేఆఫ్‌ల దిశగా అడుగులు వేస్తోంది అమెజాన్. ఇప్పటికే దీనిపై వార్తలు వస్తుండగా..ఇప్పుడా కంపెనీ సీఈవోనే స్వయంగా లేఆఫ్‌ల గురించి మాట్లాడారు. ఆ వార్తలు నిజమేనని చెప్పారు. అంతే కాదు. వచ్చే ఏడాది కూడా ఈ లేఆఫ్‌లు కంటిన్యూ అవుతాయని స్పష్టం చేశారు సీఈవో యాండీ జాసీ. కాస్ట్ కటింగ్‌లో భాగంగా కార్పొరేట్ స్థాయి ఆఫీసర్లనూ తొలగించక తప్పడం లేదని వెల్లడించారు. ఇప్పటికే...అమెజాన్ ఉద్యోగులందరికీ మెయిల్స్ పంపారు. కొద్ది రోజుల వరకూ లేఆఫ్‌లు కొనసాగుతాయని అందులో పేర్కొన్నారు. ఇప్పటికే కొంత మందిని వరుసగా తొలగిస్తోంది అమెజాన్. దీనిపై స్పందించిన యాండీ జాసీ..కీలక వ్యాఖ్యలు చేశారు.
"ఇది అమెజాన్‌కు ఎంతో కష్ట కాలం. నేను ఈ కంపెనీ సీఈవోగా ఏడాదిన్నర నుంచి పని చేస్తున్నాను. ఇప్పటి వరకూ తీసుకున్న నిర్ణయాల్లో అతి కష్టమైంది, బాధ కలిగించింది ఈ లేఆఫ్‌లే. ఈ మధ్య కాలంలో కంపెనీ రెవెన్యూ పడిపోతోంది. ఆ మేరకు కాస్ట్ కటింగ్ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగులను తొలగించాల్సి వస్తోంది. కొత్తగా ఉద్యోగులను రిక్రూట్ చేసుకోవటం కూడా పూర్తిగా నిలిపివేశాం" అని చెప్పారు. కరోనా సమయంలో చాలా మంది ఆన్‌లైన్ షాపింగ్ చేశారని, అప్పట్లో కొత్తగా చాలా మందిని రిక్రూట్ చేసుకున్నామని అన్నారు. అయితే...ఈ మధ్య కాలంలో అందరూ ఆచితూచి ఖర్చు చేస్తున్నారని, ఉన్నట్టుండి బిజినెస్ పడిపోయిందని వివరించారు యాండీ జాసీ.