Alibaba Founder Jack ma: అలీబాబా ఫౌండర్ జాక్ మా కనిపించారు, ఏడాదిన్నర తరవాత ప్రత్యక్షం
Alibaba Founder Jack Ma: అలీబాబా ఫౌండర్ జాక్ మా ఏడాదిన్నర తరవాత కనిపించారు.
Alibaba Founder Jack Ma:
ప్రభుత్వం ఆంక్షలు..
చైనా బిలియనీర్ జాక్‌మా చాలా కాలంగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. చైనా ఆయన వ్యాపారాలపై ఆంక్షలు విధించినప్పటి నుంచి పెద్దగా బయట కనిపించలేదు. ప్రభుత్వమే ఆయనను అరెస్ట్ చేసి ఎక్కడో దాచేసిందంటూ అప్పట్లో పుకార్లు కూడా పుట్టాయి. అయితే..ఇదంతా నిజం కాదని తేలింది. కానీ..ప్రభుత్వం కావాలనే ఆయనపై ఒత్తిడి పెంచడంతో పూర్తిగా కనుమరుగయ్యారు. 2020లో షాంఘైలో జరిగిన ఓ సమావేశంలో ప్రభుత్వ ఆర్థిక విధానాలపై విమర్శలు చేశారు జాక్‌మా. అది ప్రభుత్వానికి ఆగ్రహం కలిగించింది. అప్పటి నుంచి ఆయనపై పగ పట్టింది. 2021లో జాక్ మా వ్యాపారాలపై ఆంక్షలు విధించారు. జాక్ మా మాట్లాడటం అదే చివరి సారి. ఆ తరవాత ఎక్కడా కనిపించలేదు. మాట్లాడనూ లేదు. Ant Group IPOని కూడా చైనా ప్రభుత్వం నిలిపివేసింది. అయితే...ఇన్నాళ్లకు జాక్ మా మళ్లీ కనిపించారు. ప్రస్తుతం ఆయన బ్యాంకాక్‌లో ఉన్నారు. ప్రముఖ చెఫ్ సుపిన్య జైఫీ ఇన్‌స్టా పోస్ట్‌లో దర్శనమిచ్చారు. జాక్‌మాతో కలిసి దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు సుపిన్య. "జాక్ మా ఎంతో గొప్ప వ్యక్తి. అందరి పట్ల గౌరవం చూపిస్తారు. మీకు హృదయపూర్వక స్వాగతం" అంటూ పోస్ట్ చేశారు. బ్యాంకాక్ లోకల్ మీడియా వివరాల ప్రకారం...జాక్ మా ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు. ఓ బిజినెస్ మీటింగ్‌లో భాగంగా అక్కడికి వెళ్లినట్టు తెలుస్తోంది. అక్కడే ఓ బాక్సింగ్ మ్యాచ్‌కు కూడా వెళ్లినట్టు మీడియా వెల్లడించింది.
కరోనాపై చైనా తప్పుడు లెక్కలు..
చైనాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఆసుపత్రులపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. ఇంత జరుగుతున్నా చైనా మాత్రం కొవిడ్ బాధితుల సంఖ్యను చాలా తక్కువగా చూపిస్తోంది. మొదటి నుంచి కరోనా లెక్కలను సరిగా వెల్లడించకుండా దాస్తోంది చైనా. ఇప్పుడు కూడా మళ్లీ అదే విధంగా వ్యవహరిస్తోంది. ఈ వైఖరిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BF.7 కారణంగా చైనాలో భారీ సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. కానీ...చైనా మాత్రం అదేం లేదంటూ తప్పుడు లెక్కలు బయట పెడుతోంది. చైనాలో నమోదవుతున్న కరోనా కేసుల్లో దాదాపు 97% మేర ఈ కొత్త వేరియంట్ కారణంగా వచ్చినవే. అయితే.. చైనా కొవిడ్ కేసుల విషయంలో ఇస్తున్న సమాచారం సరిగా ఉండడం లేదని WHO తేల్చి చెప్పింది. జీనోమ్ సీక్వెన్సింగ్ రిపోర్ట్‌లను మాత్రమే ఇస్తోందని, మ్యుటేషన్‌లు, వేరియంట్‌లు, కొవిడ్ కేసుల సంఖ్య లాంటి వివరాలను అందించడం లేదని చెబుతోంది. ఇప్పటికే WHO ప్రతినిధులు చైనా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఏ వేరియంట్ ఎక్కువగా సోకుతోంది..? ఆసుపత్రుల్లో సరిగా చికిత్స అందుతోందా లేదా..? జీనోమ్ సీక్వెన్సింగ్ ఎలా కొనసాగుతోంది..? ఇలా అన్ని విషయాలనూ ఆరా తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. "ఈ వివరాలు కచ్చితంగా ఉంటేనే కరోనాపై పోరాడం సులువవుతుంది" అని WHO స్పష్టం చేసింది.