Afghanistan Crisis: మహిళా న్యూస్ యాంకర్లపై తాలిబన్ల నిషేధం
అఫ్గానిస్థాన్ లో తాలిబన్లు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. తాజాగా ప్రభుత్వ న్యూస్ ఛానళ్లలో మహిళా యాంకర్లపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
అఫ్గానిస్థాన్ ను చేజిక్కించుకున్న తర్వాత తాలిబన్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో మహిళలకు స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఇస్తున్నట్లు తెలిపారు. ఇస్లామిక్ చట్టాలకు అనుగుణంగానే మహిళా హక్కులకు కట్టుబడి ఉంటామని వెల్లడించారు. అయితే నివేదికలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రభుత్వ న్యూస్ ఛానల్స్ లో మహిళా యాంకర్లపై తాలిబన్లు బ్యాన్ విధించినట్లు తెలుస్తోంది. వారి స్థానంలో తమ ప్రతనిధులకే అవకాశం ఇచ్చినట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.
ప్రముఖ న్యూస్ యాంకర్ ఖాదిజా ఆమిన్ ఈ మేరకు తనను, మరికొందర్ని తాలిబన్లు సస్పెండ్ చేసినట్లు తెలిపారు.
Khadija Amin the new anchor on state TV last week.
— Farnaz Fassihi (@farnazfassihi) August 17, 2021
Taliban taking over her seat as of Monday.
Ms. Amin told us her boss informed her Taliban have banned women from returning to work at state television.#Afghanistan pic.twitter.com/S4BfISKkaG
మహిళలపై వివక్ష లేదు..
అయితే తాలిబన్ల ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ నిన్న మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అఫ్గానిస్థాన్ ఇప్పుడు స్వేచ్ఛ సాధించిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో మహిళలపై చాలా ఆంక్షలు విధించారని కానీ తాలిబన్ల రాజ్యంలో వారిపై ఎలాంటి వివక్ష ఉండబోదన్నారు.
1996-2001 మధ్య తాలిబన్ల పాలనలో మహిళల హక్కులను కాలరాశారు. చదువు, ఉద్యాగాల్లో వారికి అవకాశం ఇవ్వలేదు. గడప దాటి బయటకి రాకూడదని, వచ్చినా పరదా లేకపోతే హింసించేవారు.
తాలిబన్ల పాలనలో మహిళలు, బాలికల హక్కులపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తాలిబన్ల రాజ్యంపై ఆవేదన వ్యక్తం చేశారు. అఫ్గానిస్థాన్ లో ఇటీవల చాలా మానవహక్కుల ఉల్లంఘనలు జరిగాయన్నారు.