Galla Ashok: మేనమామ మహేష్ బాబు నాకు కొండంత అండ: సంక్రాంతి వేడుకల్లో హీరో గల్లా అశోక్
గల్లా అరుణ కుమారి ఇంట సినీ హీరో గల్లా అశోక్ తన సొంత గ్రామం దిగుమాగంలో సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. తన మేనమామ మహేష్ బాబు సహకారం ఎప్పటికీ ఉంటుందన్నారు.
Actor Galla Ashok About Mahesh Babu: చిత్తూరు : ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి ఇంట సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. గల్లా అరుణ కుమారి ఇంట సినీ హీరో గల్లా అశోక్ తన సొంత గ్రామం దిగుమాగంలో సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, నటుడు గల్లా అశోక్ మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు ప్రజలకు, సినీ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అందరితో కలసి ప్రతి సంవత్సరం ఈ వేడుకలను సొంతూరిలో జరుపుకుంటాం అన్నారు.
కరోనా కారణంగా గత రెండేళ్లుగా సొంతూరికి రావడం వీలు కాలేదన్నారు. సంక్రాంతి సందర్భంగా బంధువుల అందరితో కలిసి సొంతూరులో జరుపుకోవడం ఆనందంగా ఉందనన్నారు. తాను నటించిన హీరో సినిమా విడుదలై ఏడాది పూర్తయిందన్నారు. తొలి సినిమా రిలీజై ఏడాది పూర్తి కావడం, బంధు మిత్రులందరితో కలిసి, రాజన్న పార్కులో హీరో సినిమాని గత ఏడాది చూడటం సంతోషంగా ఉందన్నారు. త్వరలో కొత్త సినిమాతో మీ ముందుకు వస్తానని చెప్పారు గల్లా అశోక్.
వారం రోజుల్లో కొత్త మూవీ అప్ డేట్..
వారం రోజుల్లో కొత్త సినిమా వివరాలు వెల్లడిస్తామని నటుడు గల్లా అశోక్ తెలిపారు. తన మేనమామ మహేష్ బాబు సహకారం ఎప్పటికీ ఉంటుందన్నారు. సూపర్ స్టార్ సహకారంతో సినిమా రంగంలోకి ప్రవేశించానని తెలిపారు. హీరో సినిమా అయ్యాక మరో మూవీ రాకపోవడంతో మేనమామ మహేష్ ధైర్యం చెప్పారని, సినిమా ఇండస్ట్రీ ఇలాగే ఉంటుందని అధైర్య పడొద్దని సపోర్ట్ చేశారని అశోక్ తెలిపారు. కరోనా వల్ల సినిమా షూటింగ్స్ జరగడం లేదని, సినిమా ఛాన్స్ లు వస్తాయని ఉత్సాహాన్ని నింపారని గుర్తు చేసుకున్నారు. టీడీపీకి చెందిన గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడే ఈ గల్లా అశోక్.
మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి మాట్లాడుతూ.. పండుగను సొంతూరిలో సెలబ్రేట్ చేసుకుందామని తన మనవడు గల్లా అశోక్ చెప్పాడని తెలిపారు. సొంత ఆడిటోరియంలో సంక్రాంతి జరుపుకుందామన్న వినలేదని, దిగుమాగంలో సెలబ్రేట్ చేద్దామనడం సంతోషాన్ని కలిగించిందన్నారు. తన తాతగారైన కృష్ణను ఆదర్శంగా తీసుకుని అశోక్ సినిమాల్లోకి వచ్చాడన్నారు. దేవుడి దయ, మీ అందరి ఆశీస్సులతో మీలో ఒకడిగా మీ సొంత బిడ్డల చూసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. తన తండ్రి రాజకీయ నాయకుడిగా సేవలు అందించారని, నవలలు రాశారని గుర్తు చేసుకున్నారు. అశోక్ తాత, తండ్రి, నానమ్మ రాజకీయ నాయకులు అని గల్లా అశోక్ సినిమా రంగంలోకి ఎలా వచ్చారని మీడియా అడగగా.. తన మనవడి మేనమామ మహేష్ బాబు, తాత కృష్ణ సినిమాల్లో సూపర్ స్టార్లు అని గల్లా అరుణ కుమారి గుర్తుచేశారు.
గల్లా అరుణకుమారి ఇంటి వద్ద అభిమానుల సందడి
నటుడు గల్లా అశోక్ సంక్రాంతి పండుగ చేసుకోవడానికి సొంతూరుకు వచ్చారని తెలుసుకుని స్థానికులు భారీ సంఖ్యలో వారి ఇంటికి చేరుకున్నారు. అభిమానులు నటుడు గల్లా అశోక్ తో ఫొటోలు, సెల్ఫీలు దిగారు. కొందరు అభిమానులు గల్లా అశోక్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి, సినిమాల్లో రాణించాలని ఆల్ ది బెస్ట్ చెప్పారు.