Russia Ukraine War: 98 ఏళ్ల వయసులో చేతికర్రతో 10 కిలోమీటర్ల కాలినడక, ఉక్రెయిన్ వృద్ధురాలి సాహసం
Russia Ukraine War: ఉక్రెయిన్‌లో 98 ఏళ్ల వృద్ధురాలు రష్యా ఆక్రమిత ప్రాంతాన్ని వదిలి 10 కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వలస వెళ్లిపోయింది.
Ukrainian Woman Walks Miles: రష్యా ఉక్రెయిన్ మధ్య (Russia Ukraine War) యుద్ధం కొనసాగుతూనే ఉంది. దాదాపు మూడేళ్లు కావస్తున్నా ఏ వైపూ వెనక్కి తగ్గడం లేదు. సైనికులు, పౌరులు పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోతున్నారు. కొందరు ఉక్రెయిన్ పౌరులు ఈ యుద్ధ వాతావరణాన్ని తట్టుకోలేక క్రమంగా వలస వెళ్తున్నారు. ఇప్పటికే చాలా మంది పోలండ్‌కి వలస వెళ్లారు. కుటుంబం అంతా ఒకేసారి ఇల్లు విడిచిపెట్టి కట్టుబట్టలతో వెళ్లిపోతున్నారు. ఎక్కడ చూసినా కాల్పుల మోతే వినబడుతోంది. ఈ దారుణాన్ని చూడలేక ఉక్రెయిన్‌కి చెందిన ఓ 98 ఏళ్ల వృద్ధురాలు ఉన్న చోట నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. శరీరంలో ఓపిక లేకపోయినా సరే చేతి కర్ర సాయంతో అలాగే బయలుదేరింది. దాదాపు 10 కిలోమీటర్ల మేర ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లిపోయింది. మధ్యమధ్యలో కాస్తంత విశ్రాంతి తీసుకోవాలనిపించినా...ఎక్కడైనా ఆగితే కాల్పులకు బలి అవుతానేమో అన్న భయంతో అలాగే నడుచుకుంటూ వచ్చింది. ఎక్కడో ఓ చోట రోడ్డుపైనే కాసేపు రెస్ట్ తీసుకుని మళ్లీ నడవడం మొదలు పెట్టింది. దొనెత్స్క్ ప్రాంతాన్ని రష్యా పూర్తిగా ఆక్రమించుకుంది. అక్కడి నుంచి ఉక్రెయిన్ అధీనంలో ఉన్న ప్రాంతానికి వెళ్లిపోవాలనుకుంది ఈ వృద్ధురాలు. ఎలాగోలా కష్టపడి తన గమ్యాన్ని చేరుకుంది.
Ukrainian Media: «A 98-year-old woman walked out of the occupied part of #Ocheretnya in the #Donetsk region. The "White Angels" (local police who assist in relocation of displaced persons) together with the military took her to the aid station.
— OSINT (Uri) 🇺🇸 🇨🇦 🇬🇧 🇺🇦 🇮🇱 (@UKikaski) April 29, 2024
Lidia Stepanivna walked the entire… pic.twitter.com/LUqpnRT9Ff
ఉక్రెయిన్ పోలీసులు ఆమెని గుర్తించి సాయం అందించారు. ఇదంతా ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఉక్రెయిన్ పోలీసులు. ప్రాణాన్ని పణంగా పెట్టి ఆమె నడుచుకుంటూ వచ్చారంటూ తెగ పొగిడేశారు. ఆవిడని పలకరిస్తే "అప్పుడు రెండో ప్రపంచ యుద్ధంలో ప్రాణాలతో బయటపడ్డాను. ఇప్పుడీ యుద్ధం నుంచి బయటపడుతున్నాను" అని చెబుతోంది. ఓ పెద్ద కోట్ వేసుకుని, చేతిలో కర్ర పట్టుకుని 10 కిలోమీటర్ల దూరం వరకూ నడుచుకుంటూ వచ్చింది ఈ వృద్ధురాలు. కోల్పోవడానికి ఇంకేమీ లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం రష్యాతో జరుగుతున్న యుద్ధాన్ని చూస్తుంటే రెండో ప్రపంచ యుద్ధం నాటి పరిస్థితులు గుర్తుకు వస్తున్నాయని చెబుతోంది. ఇళ్లు తగలబెడుతున్నారని కన్నీళ్లు పెట్టుకుంటోంది. ఈ ఘటనపై ఉక్రెయిన్ హోంమంత్రిత్వ శాఖ స్పందించింది. ఉక్రెయిన్ మిలిటరీ ఆమెని గుర్తించి అవసరమైన సాయం అందిస్తోందని వెల్లడించింది. ఆమె బంధువులకు సమాచారం అందిస్తామని తెలిపింది. అయితే..సరిగ్గా ఎక్కడ ఆమెని గుర్తించారన్న వివరాలు తెలియ రాలేదు. మూడేళ్లుగా జరుగుతున్న ఈ యుద్ధంలో వేలాది మంది పౌరులు బలి అయ్యారు. లక్షలాది మంది వలస వెళ్లిపోయారు.
Also Read: Fact Check: కొవిషీల్డ్ వ్యాక్సిన్‌తో రక్తం గడ్డకట్టుకుపోతుందా? ఈ ప్రచారంలో నిజమెంత?