శివరాత్రి వేడుకల్లో అపశ్రుతి, హైటెన్షన్ వైర్ తగిలి 14 మంది చిన్నారులకు తీవ్ర గాయాలు
Mahashivratri: రాజస్థాన్‌లోని కోటాలో శివరాత్రి వేడుకల్లో కరెంట్ షాక్ తగిలి 14 మంది చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి.
Mahashivratri procession at Kota: రాజస్థాన్‌లోని కోటాలో మహాశివరాత్రి వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. 14 మంది చిన్నారులు విద్యుదాఘాతానికి గురయ్యారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చిన్నారులకు ఒంటినిండా గాయాలయ్యాయి. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు రాజస్థాన్ మంత్రి హీరాలాల్ నగర్ హాస్పిటల్‌కి వెళ్లి చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. బాధితులంతా 10-16 ఏళ్ల లోపు వాళ్లే. హైటెన్షన్ పవర్ లైన్ తగిలి వీళ్లందరికీ షాక్ కొట్టినట్టు అధికారులు వెల్లడించారు. కొంత మంది పిల్లలకు ఒళ్లంతా కాలిపోయిందని, మరి కొంత మంది సగం మేర కాలిన గాయాలైనట్టు తెలిపారు. కాళిబస్తీలో యాత్ర కొనసాగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఓ చిన్నారి ఓ భారీ జెండాని పట్టుకున్నాడు. పైన ఉన్న హైటెన్షన్ వైర్‌కి ఆ కర్ర తగలడం వల్ల విద్యుదాఘాతం సంభవించింది. ఆ బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ చిన్నారిని కాపాడేందుకు ప్రయత్నించిన వారందరూ గాయపడ్డారు.
#WATCH | Rajasthan: Several children were electrocuted during a procession on the occasion of Mahashivratri, in Kota. Further details awaited. pic.twitter.com/F5srBhO9kz
— ANI (@ANI) March 8, 2024
ఈ ఘటనపై మంత్రి హీరాలాల్ నగర్ స్పందించారు. ఇది చాలా దురదృష్టకరం అని విచారం వ్యక్తం చేశారు. చిన్నారులకు మెరుగైన చికిత్స అందించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.
"ఇది చాలా దురదృష్టకరమైన ఘటన. ఇద్దరు చిన్నారుల శరీరాలు పూర్తిగా కాలిపోయాయి. పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స అందించేందుకు ప్రత్యేక వైద్య బృందాన్ని నియమించాం. నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందా అన్న కోణంలో విచారించాలని అధికారులను ఆదేశించాం"
- హీరాలాల్ నగర్, రాజస్థాన్ మంత్రి
#WATCH | Kota: Rajasthan Minister Heeralal Nagar says, "It's a very sad incident... Two children are seriously injured with one having 100% burns. A special team has been formed to provide all possible treatment. Officials are directed to investigate if there has been any kind of… pic.twitter.com/NdWCJorSjq
— ANI (@ANI) March 8, 2024