By: Satya Pulagam | Updated at : 17 Jun 2022 02:09 AM (IST)
'విరాట పర్వం' సినిమాలో రానా దగ్గుబాటి, సాయి పల్లవి
విరాట పర్వం
లవ్ అండ్ యాక్షన్ డ్రామా
దర్శకుడు: వేణు ఊడుగుల
Artist: సాయి పల్లవి, రానా దగ్గుబాటి తదితరులు
సినిమా రివ్యూ: విరాట పర్వం
రేటింగ్: 2.5/5
నటీనటులు: సాయి పల్లవి, రానా దగ్గుబాటి, నందితా దాస్, ప్రియమణి, నవీన్ చంద్ర, జరీనా వాహెబ్, సాయి చంద్, ఈశ్వరీ రావు, బెనర్జీ, ఆనంద చక్రపాణి తదితరులతో పాటు అతిథి పాత్రలో నివేదా పేతురాజ్
ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: డానీ సాంచెజ్ లోపెజ్, దివాకర్ మణి
సంగీతం: సురేష్ బొబ్బిలి
సమర్పణ: డి. సురేష్ బాబు
నిర్మాతలు: సుధాకర్ చెరుకూరి, శ్రీకాంత్ చుండు, రానా దగ్గుబాటి
రచన, దర్శకత్వం: వేణు ఊడుగుల
విడుదల తేదీ: జూన్ 17, 2022
తెలుగునాట కథానాయికల్లో సాయి పల్లవి(Sai Pallavi)కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆమె నటించిందంటే... సినిమాలో, పాత్రలో సమ్‌థింగ్ స్పెషల్ ఉంటుందని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. ప్రచార కార్యక్రమాల్లో ''ఇది సాయి పల్లవి సినిమా. నేనూ ఆమె ఫ్యాన్'' అని రానా (Rana Daggubati) చెబుతూ వచ్చారు. దీనికి తోడు 'నీది నాదీ ఒకే కథ' తీసిన వేణు ఊడుగుల దర్శకత్వం వహించడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. పాటలు, ప్రచార చిత్రాలు బావుండటంతో 'విరాట పర్వం' (Virata Parvam)పై అంచనాలు ఏర్పడ్డాయి. మరి, సినిమా ఎలా ఉంది? (Virata Parvam Review)
కథ (Virata Parvam Movie Story): వెన్నెల (సాయి పల్లవి)... సగటు అమ్మాయి. అరణ్య అలియాస్ రవన్న (రానా దగ్గుబాటి) రాసిన కవితలు, పుస్తకాలు చదివి అతనిపై ప్రేమ పెంచుకుంటుంది. వెన్నెలను ఆమె బావకు ఇచ్చి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిశ్చయిస్తారు. తనకు పెళ్లి ఇష్టం లేదని అందరితో ధైర్యంగా చెబుతుంది. అరణ్య కోసం ఇల్లు విడిచి బయలుదేరుతుంది. అడవిలో అన్నల్లో ఒకరైన రవన్న ఒక దళానికి కమాండర్. అతణ్ణి చేరుకోవడం కోసం వెన్నెల ఎంత కష్టపడింది? వెన్నెల తనను ప్రేమిస్తుందని తెలిశాక రవన్న ఎలా స్పందించాడు? రవన్న దళంలో సాయి పల్లవి చేరిన తర్వాత... విప్లవం ఒడిలో ప్రేమ విరిసిందా? లేదా? చివరకు, ఈ కథ ఏ తీరానికి చేరింది? అనేది మిగతా సినిమా.
విశ్లేషణ: ప్రేమలో ఒక విప్లవం ఉంటుంది. ప్రేమ కోసం ఎవరితోనైనా, ఎవరినైనా ఎదిరించే ధైర్యం వస్తుంది. మరి, విప్లవంలో? ప్రేమకు చోటు ఉంటుందా!? చరిత్ర చాలా ప్రేమ కథలు చూసింది. ఆ కథలకు, విరాట పర్వానికి వ్యత్యాసం ఏంటంటే... స్వచ్ఛత, నిజాయతీ! శ్రీకృష్ణుడు, మీరాబాయి కథలో ఎంత స్వచ్ఛత ఉందో... ఈ 'విరాట పర్వం'లోని ప్రేమకథలోనూ అంతే స్వచ్ఛత ఉంది. ప్రేమంటే శారీరక ఆకర్షణ, అందం చూసి పడిపోవడం వంటి కథల మధ్యలో 'విరాట పర్వం'ను ఆ స్వచ్ఛతే ప్రత్యేకంగా నిలబెట్టింది. సినిమాగా చూస్తే...
సినిమా ఎలా ఉంది? (Virata Parvam Review) : తెలంగాణలో మూడు దశాబ్దాల కిందట వాతావరణాన్ని వెండితెరపై ఆవిష్కరించిన సినిమా 'విరాట పర్వం'. కట్టు, బొట్టు, పల్లెల్లో సామాజిక పరిస్థితులు, నక్సలిజాన్ని చూపించారు. దర్శకుడు వేణు ఊడుగుల నక్సలిజం నేపథ్యంలో చక్కటి ప్రేమకథ రాసుకున్నారు. కథకు ఇచ్చిన ముగింపు కూడా బావుంది. అయితే... రెండిటి మధ్యలో సన్నివేశాలను ఆసక్తికరంగా నడపడంలో విజయం సాధించలేదు.
ప్రేమకు, విప్లవానికి మధ్య కథ నలిగింది. కథలోని పాత్రలు కూడా! అరణ్యను కలవాలని సాయి పల్లవి చేసే ప్రయత్నాలు ఆసక్తిగా సాగాయి. అప్పుడు నక్సల్స్ చర్యల కంటే సాయి పల్లవి తర్వాత ఏం చేయబోతుంది? అనే ఉత్కంఠ కలుగుతుంది. అయితే... ఒక్కసారి సాయి పల్లవి దళంలో చేరిన తర్వాత వచ్చే సన్నివేశాలు తెర ముందున్న ప్రేక్షకుల ఊహలకు అనుగుణంగా సాగుతాయి. అది సినిమాకు మేజర్ మైనస్. వెన్నెల వంటి అమ్మాయిలు ఉంటారా? వంటి ప్రశ్న ప్రేక్షకుడి మదిలో వస్తే... ఆ ప్రేమ ప్రయాణం ఆకట్టుకోవడం కష్టమే.
కథకుడిగా కంటే దర్శకుడిగా సాంకేతిక నిపుణుల నుంచి చక్కటి పనితీరు రాబట్టుకోవడంలో వేణు ఊడుగుల పూర్తి విజయం సాధించారు. మాటల రచయితగా ఆయన కూడా మెప్పించారు. 'తుపాకీ గొట్టంలో శాంతి లేదురా... శాంతి ఆడపిల్ల ప్రేమలో ఉంది' వంటి డైలాగులు మనసును తాకితే... 'ప్రేమ అనేది బలహీనుల సామాజిక రుగ్మత' వంటి డైలాగులు ఆలోచన రేకెత్తిస్తాయి. సురేష్ బొబ్బిలి అందించిన పాటలు బావున్నాయి. 'కోలు కోలోయమ్మ...' మరికొన్ని రోజులు వినిపిస్తుంది. 'నగదారిలో...' కూడా బావుంది. సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతం సన్నివేశాల్లో ప్రేమ తీవ్రత, విప్లవ గాఢతను ప్రేక్షకుడికి చేరువయ్యేలా చేసే ప్రయత్నం చేసింది. సినిమాటోగ్రాఫర్స్ ఇద్దరూ ప్రతి ఫ్రేమును అందంగా తీర్చిదిద్దారు. ఖర్చు విషయంలో నిర్మాత రాజీ పడలేదని ప్రతి ఫ్రేములో అర్థం అవుతుంది.
నటీనటులు ఎలా చేశారు?: వెన్నెల పాత్రలో సాయి పల్లవి పరకాయ ప్రవేశం చేశారు. కొన్ని సన్నివేశాల్లో కేవలం కళ్ళతో నటించారు. సాయి పల్లవి పలికించిన ప్రతి భావోద్వేగం ప్రేక్షకుడి మనసుని తాకుతుంది. మరోసారి ఆమె నటనతో ప్రేమలో పడతాం. రానా నటన, గళం ఆకట్టుకుంటాయి. పాత్ర నిడివి గురించి ఆలోచించకుండా కథకు అవసరమైన మేరకు, సన్నివేశాలకు అనుగుణంగా ఆయన నటించారు. నందితా దాస్, ప్రియమణి, నవీన్ చంద్ర, సాయిచంద్, ఈశ్వరీ రావు, రాహుల్ రామకృష్ణ, బెనర్జీ... ప్రతిభావంతులైన నటీనటులు సినిమాలో ఉన్నారు. ఎవరికీ పూర్తిస్థాయి నిడివి ఉన్న పాత్ర దక్కలేదు. అయితే, ఆయా పాత్రల్లో వాళ్ళను తప్ప మరొకరిని ఊహించుకోవడం కష్టం. ప్రతి ఒక్కరూ తెరపై కనిపించినప్పుడు... తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. నివేదా పేతురాజ్ సినిమా ప్రారంభంలో కనిపించారు.
Also Read: 'రెక్కీ' వెబ్ సిరీస్ రివ్యూ: కామకోరిక ఎంత దూరం తీసుకువెళుతుంది? ఏయే పనులు చేయిస్తుందంటే?
చివరగా చెప్పేది ఏంటంటే?: ప్రేమకు, విప్లవానికి మధ్య జరిగిన సంఘర్షణలో ప్రేమది పైచేయిగా ఉన్న సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. విప్లవం విరిసిన చోట... వాస్తవికతకు దూరంగా సన్నివేశాలు సాగాయి. బహుశా... ఈ మధ్య కాలంలో నక్సలిజం గురించి వినడం, చూడడం చాలా తక్కువ అందుకు కారణం కావచ్చు. సాయి పల్లవి, రానా, మిగతా నటీనటుల అద్భుత అభినయం అమితంగా ఆకట్టుకుంటుంది. సురేష్ బొబ్బిలి సంగీతం హృదయాన్ని హత్తుకుంటుంది. అలాగే, ఛాయాగ్రహణం కూడా! అయితే విశ్రాంతి తర్వాత... వాస్తవికతకు దూరంగా సినిమా సాగుతుంది. ప్రేక్షకుడి మనసు నుంచి కూడా! సంగీతం, సంభాషణలు, నటీనటుల అభినయంలో వేణు ఊడుగుల మార్క్ కనిపించింది.
PS: తూము సరళ జీవితం ఆధారంగా 'విరాట పర్వం' తీశామని సినిమా చివర్లో దర్శకుడు వెల్లడించారు. ఆమె ఎవరో తెలిస్తే... మీకు సినిమా ముగింపు తెలిసినట్టే. కథ ఏ దారిలో వెళుతుందో, వెళ్ళిందో ఊహించడం అంత కష్టం ఏమీ కాదు.
Balakrishna: 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' టీమ్ తో బాలయ్య - లుక్ అదుర్స్
Pavithra Lokesh: సహజీవనం ఏంటి? పవిత్ర నా భార్య - మాకు ఇద్దరు పిల్లలు
Raghava Lawrence: రాఘవ లారెన్స్ ఈవిల్ గెటప్ - 'రుద్రుడు' రిలీజ్ డేట్ ఫిక్స్
Satyadev: కొరటాల శివతో సత్యదేవ్ సినిమా - 'కృష్ణమ్మ' ఫస్ట్ లుక్
Prashanth Neel-Ramya: నరేష్ మూడో భార్యతో 'కేజీఎఫ్' డైరెక్టర్‌కు ఉన్న రిలేషన్ ఏంటి?
MP Raghurama Krishna Raju : ఎంపీ రఘురామకృష్ణరాజు భీమవరం పర్యటన రద్దు, మధ్యలోని ట్రైన్ దిగిపోయిన ఎంపీ
IndiGo flights Delay : సిక్ లీవ్ పెట్టి ఇంటర్య్వూకు చెక్కేసిన ఇండిగో సిబ్బంది, 900 విమాన సర్వీసులపై ప్రభావం
PM Modi Speech: తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది, అభివృద్ధి డబుల్ అవుతుంది-ప్రధాని మోదీ
Minister Harish Rao : తెలంగాణకు మోదీ మొండి చెయ్యి, ప్రధాని కల్లబొల్లి కబుర్లు చెప్పారు- మంత్రి హరీశ్ రావు
IND vs ENG 5th Test Day 3: ఆరంభంలోనే వికెట్ కోల్పోయిన భారత్ - టీ సమయానికి స్కోరు ఎంతంటే?