Rangabali Movie Review - నాగశౌర్య 'రంగబలి' రివ్యూ : ఫస్టాఫ్‌లో సత్య కామెడీ హిట్, మరి సెకండాఫ్?
Rangabali Review In Telugu : నాగశౌర్య కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'రంగబలి'. నేడు థియేటర్లలో విడుదల అవుతోంది. ఈ సినిమా ఎలా ఉందంటే?
పవన్ బాసంశెట్టి
నాగశౌర్య, యుక్తి తరేజ, సత్య, షైన్ టామ్ చాకో తదితరులు
సినిమా రివ్యూ : రంగబలి
రేటింగ్ : 2/5
నటీనటులు : నాగశౌర్య, యుక్తి తరేజ, సత్య, శరత్ కుమార్, అనంత శ్రీరామ్, షైన్ టామ్ చాకో, మురళీ శర్మ, గోపరాజు రమణ, సప్తగిరి, బ్రహ్మాజీ, రాజ్ కుమార్ కసిరెడ్డి తదితరులు
ఛాయాగ్రహణం : దివాకర్ మణి
సంగీతం : పవన్ సిహెచ్
నిర్మాత : సుధాకర్ చెరుకూరి
రచన, దర్శకత్వం : పవన్ బాసంశెట్టి
విడుదల తేదీ : జూలై 7, 2023
నాగశౌర్య (Naga Shourya) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'రంగబలి' (Rangabali Movie). విడుదలకు ముందు సత్య స్పూఫ్ వీడియో బోలెడు ప్రచారం తీసుకొచ్చింది. ఓ టీవీ కార్యక్రమంలో కొత్త దర్శకుడు పవన్ బాసంశెట్టి కామెడీ టైమింగ్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. మరి, సినిమా ఎలా ఉంది?
కథ (Rangabali Movie Story) : శౌర్య (నాగశౌర్య)ది రాజవరం. మెడికల్ షాప్ మీద వచ్చే ఆదాయంతో కుటుంబ పోషణ, బాధ్యతలను తండ్రి చూసుకుంటున్నాడు. బీ ఫార్మసీ చదివిన కుమారుడికి షాప్ అప్పగించాలని తండ్రి ప్లాన్. అయితే... శౌర్య ఏమో గొడవలు అంటే వైట్ షర్ట్ వేసుకుని ముందడుగు వేస్తాడు. సెంటర్ నిండా ఎమ్మెల్యే పరశురామ్ (షైన్ టామ్ చాకో)తో దిగిన ఫోటోల కటౌట్స్ పెట్టి తిరుగుతూ ఉంటాడు. ఒక్క డ్రగ్ పేరు కూడా సరిగా తెలియదు. లాభం లేదని తండ్రి గట్టిగా చెప్పడంతో విశాఖ బస్ ఎక్కుతాడు శౌర్య. అక్కడ తండ్రి స్నేహితుడు డీన్ అయిన మెడికల్ కాలేజీలో ఫార్మసీ ట్రైనింగుకు వెళతాడు. సహజ (యుక్తి తరేజ)తో ప్రేమలో పడతాడు. సహజ తండ్రి (మురళీ శర్మ) కూడా తొలుత వాళ్ళ ప్రేమ, పెళ్ళికి ఓకే చెబుతాడు.
శౌర్యది రాజవరం అని తెలిసి సహజతో పెళ్ళికి 'నో' చెబుతాడు తండ్రి. ఎందుకు? శౌర్య, సహజ పెళ్లికి రాజవరం రంగబలి సెంటర్ ఎలా అడ్డు పడింది? అసలు, ఆ సెంటర్‌కు ఆ పేరు ఎలా వచ్చింది? ఆ పేరు మార్చడానికి శౌర్య ఎటువంటి ప్రయత్నాలు చేశాడు? అన్నదమ్ముల్లా మెలిగే శౌర్య, పరశురామ్ మధ్య గొడవలు ఎందుకు వచ్చాయి? చివరకు ఏమైంది? అనేది మిగతా సినిమా.
విశ్లేషణ (Rangabali Movie Review) : 'రంగబలి' ట్రైలర్ చూశారా? 'ఇంకా ఈ డైలాగులు వాడుతున్నారా భయ్యా' అని నాగశౌర్య ఓ డైలాగ్ చెబుతారు. అది విన్నాక... 'ఇంకా ఇటువంటి సినిమాలు తీస్తున్నారా?' అని సోషల్ మీడియాలో సెటైర్లు కూడా పడ్డాయి. అయినా సినిమాకు బజ్ ఏర్పడిందంటే కారణం సత్య స్పూఫ్ ఇంటర్వ్యూ వీడియో, టీవీ షోలో దర్శకుడు పవన్ కామెడీ టైమింగ్!
కథ , కథనం ఎలా ఉన్నా సరే... కామెడీ కరెక్టుగా వర్కవుట్ అయితే నవ్వుకోవడానికి ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. అందుకు ఉదాహరణ... 'సామజవరగమన'. ఈ 'రంగబలి' మొదలు నుంచి విశ్రాంతి వరకు కామెడీతో పరుగులు తీసింది. అయితే, విశ్రాంతి తర్వాత అసలు కథలోకి వెళ్ళిన తర్వాత కామెడీ తగ్గింది. క్లైమాక్స్ వరకు రకరకాలుగా నడిచి ముగిసింది. ఏ దశలోనూ ఆకట్టుకోదు. రొట్ట కొట్టుడు రొటీన్ మసాలా!
కమర్షియల్ కథల్లో కామెడీని మిక్స్ చేయడం ఓ ఆర్ట్. కొందరు దర్శకులకు ఆ టెక్నిక్ తెలుసు. 'రంగబలి'లో శౌర్య, సత్య సీన్స్ చూసినప్పుడు కొత్త దర్శకుడు పవన్ బాసింశెట్టిలో ఆ టాలెంట్ ఉందనిపించింది. డైలాగుల్లో కొంత డబుల్ మీనింగ్ ధ్వనించినా... కామెడీతో పాస్ అయిపోయాయి. ఇంటర్వెల్ తర్వాత సీన్స్ వస్తుంటే... ఫస్టాఫ్ తీసిన దర్శకుడే సెకండాఫ్ కూడా తీశాడా? లేదంటే మరొకరు డైరెక్ట్ చేశారా? అని అనుమానం కలుగుతుంది. ఫక్తు కమర్షియల్ పంథాలో సాగే సన్నివేశాలు ఏవీ ఆకట్టుకోవు. ట్విస్టులు, ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్, సీన్స్... అన్నీ రొటీనే. సొంతూరు సెంటిమెంట్, తండ్రి కుమారుల మధ్య భావోద్వేగాలు, ఎమోషన్స్ ఏవీ వర్కవుట్ కాలేదు. క్లైమాక్స్‌లో సెంటర్ పేరును మారుస్తారు. ఆ కొత్త పేరు, మార్చడం మరీ కామెడీగా ఉంది.
'రంగబలి' వంటి కథలకు పాటలు బలం కావాలి. కానీ, మైనస్ కాకూడదు. పవన్ సిహెచ్ అందించిన స్వరాలకు సరైన ప్లేస్‌మెంట్ లేదు. ఆ బాణీలు సోసోగా ఉన్నాయి. ఐటమ్ సాంగ్ అసలు బాలేదు. ఆ సాంగ్ పిక్చరైజేషన్ కూడా! నేపథ్య సంగీతం జస్ట్ ఓకే. దివాకర్ మణి కెమెరా వర్క్ కమర్షియల్ మూడ్ తీసుకొచ్చింది. ఎడిటర్ కత్తెరకు పని చెప్పాల్సిన సీన్లు ఇంటర్వెల్ ముందు కొన్ని, తర్వాత చాలా ఉన్నాయి. ఇంటర్వెల్ తర్వాత అంతకు ముందున్న కామెడీ టెంపో కంటిన్యూ అయ్యుంటే రిజల్ట్ బ్లాక్ బస్టర్ అనేలా ఉండేది. అక్కడికీ సప్తగిరితో ఇప్పటికే చాలా మంది చేసేసిన న్యూస్ ఛానల్స్ లైవ్ కవరేజ్ మీద కామెడీ చేయాలని చూశారు. వర్కవుట్ కాలేదు సరి కదా... రోత పుట్టించింది.
నటీనటులు ఎలా చేశారు? : కమర్షియల్ కథానాయకుడికి కావాల్సిన కటౌట్, ఆ ఫిజిక్ నాగశౌర్యకు ఉన్నాయి. ఓ సన్నివేశంలో షర్ట్ తీసి ప్యాక్డ్ బాడీ చూపించారు. బాడీ బిల్డ్ చేసింది అమ్మాయిలా దాచుకోవడానికి కాదని ఓ డైలాగ్ కూడా చెప్పారు. కథతో పాటు సరైన సన్నివేశాలు పడితే హీరోయిజం ఎలివేట్ అయ్యేది. కావాలని హీరోని ఎలివేట్ చేయడం కోసం సీన్లు రాశారు.
ఇంటర్వెల్ తర్వాత వచ్చే పాటలో హీరోయిన్ యుక్తి తరేజ ఓ పాటలో గ్లామర్ చాలా ఒలకబోశారు. లుక్స్, యాక్టింగ్ పరంగా జస్ట్ ఓకే. ఈ సినిమాలో హీరో కంటే ఎక్కువ పేరు సత్యకు వస్తుంది. ఇంటర్వెల్ వరకు సత్య కామెడీ విపరీతంగా నవ్విస్తుంది. మురళీ శర్మ, గోపరాజు రమణ, సప్తగిరి తదితర నటీనటులవి రొటీన్ క్యారెక్టర్లే.
Also Read : 'మాయా పేటిక' రివ్యూ : ఒక్క టికెట్ మీద ఆరు షోలు - సెల్ ఫోన్ బయోపిక్ ఎలా ఉందంటే?
చివరగా చెప్పేది ఏంటంటే? : 'ఇంకా ఈ డైలాగులు వాడుతున్నారా?' అని డైలాగ్ రాసే ముందు... 'ఇంకా ఈ తరహా కథలతో సినిమాలు తీస్తున్నారా?' అని ఒక్కసారి దర్శకుడు పవన్ బాసంశెట్టి ఆలోచించి ఉంటే బావుండేది. ఆయనలో మంచి కామెడీ టైమింగ్ ఉంది. సేమ్ ఓల్డ్ రొటీన్ కథలో కాకుండా మంచి కథలో పడితే ఇంకా బావుంటుంది. 'రంగబలి'లో సత్య కామెడీ హిట్, సత్య కామెడీ మాత్రమే హిట్! సినిమా రిజల్ట్ ఫట్!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial