Rana Naidu Review: ఇంతకు ముందెప్పుడూ చూడని విధంగా వెంకటేష్, రానా - ‘రానా నాయుడు’ సిరీస్ ఎలా ఉంది?
రానా నాయుడు వెబ్ సిరీస్ ఎలా ఉంది?
కరణ్ అన్షుమన్, సుపర్న్ వర్మ
వెంకటేష్, రానా దగ్గుబాటి తదితరులు
వెబ్ సిరీస్ రివ్యూ : రానా నాయుడు
రేటింగ్ : 2.75/5
నటీనటులు : వెంకటేష్, రానా దగ్గుబాటి, సుర్వీన్ చావ్లా, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, గౌరవ్ చోప్రా, ఆశిష్ విద్యార్థి, ఆదిత్య మీనన్, ప్రియా బెనర్జీ, సౌరవ్ ఖురానా, సుచిత్రా పిళ్లై, ఫ్లోరా సైనీ తదితరులు
ఛాయాగ్రహణం : జయకృష్ణ గుమ్మడి
సంగీతం : సంగీత్, సిద్ధార్థ్
నిర్మాతలు : సుందర్ ఆరోన్, సుమిత్ శుక్లా
రచన : బీవీఎస్ రవి, కార్మణ్య అహూజా, అనాని మోదీ, వైభవ్ విశాల్, కరణ్ అన్షుమన్
దర్శకత్వం : కరణ్ అన్షుమన్, సుపర్న్ వర్మ
విడుదల తేదీ : మార్చి 10, 2023
వెంకటేష్, రానా కలిసి నటిస్తున్న వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. ఇంతవరకు వీరిద్దరూ సినిమాల్లో కూడా కలిసి నటించలేదు. కానీ డైరెక్ట్‌గా వెబ్ సిరీస్‌లో కనిపిస్తున్నారు. మరి ఈ ‘రానా నాయుడు’ ఎలా ఉంది?
కథ: రానా నాయుడు (రానా దగ్గుబాటి) ముంబైలో బాలీవుడ్ సెలబ్రిటీల సమస్యలను తీర్చే ఫిక్సర్. ఎంత ఇల్లీగల్ పని అయినా ఇట్టే చేయించగల సమర్థుడు. రానా నాయుడి తండ్రి నాగా నాయుడు (వెంకటేష్) 15 సంవత్సరాలు చంచల్‌గూడ జైల్లో శిక్షను అనుభవించి విడుదల అవుతాడు. నాగా నాయుడికి, రానాకి అస్సలు పడదు. రానాకి తేజ్ నాయుడు (సుశాంత్ సింగ్) అనే అన్న, జఫ్పా నాయుడు (అభిషేక్ బెనర్జీ) అనే తమ్ముడు ఉంటారు. అసలు ఈ కుటుంబంలో ఉన్న సమస్యలేంటి? నాగా నాయుడు 15 సంవత్సరాలు ఎందుకు జైల్లో ఉంటాడు? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే నెట్‌ఫ్లిక్స్‌లో రానా నాయుడు చూసేయండి!
విశ్లేషణ: ఈ సిరీస్ ఎలా ఉంది? గ్రిప్పింగ్‌గా ఉందా? వీటి కంటే ముందు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. తెలుగు వెబ్ సిరీస్ హిస్టరీలో ‘రానా నాయుడు’ కచ్చితంగా గేమ్ ఛేంజర్ వెబ్ సిరీస్ అవుతుంది. ఎందుకంటే తెలుగులో ఇంత వెంకటేష్, రానా రేంజ్ ఉన్న పెద్ద స్టార్లు వెబ్ సిరీస్‌లు చేయడం ఇదే మొదటిసారి. దీనికి తోడు ఇది రెగ్యులర్ యాక్షన్, క్రైమ్ వెబ్ సిరీస్ మాత్రమే కాదు. అడల్ట్ కంటెంట్, బూతులు కూడా ఈ సిరీస్‌లో పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఈ సిరీస్‌ను ఫ్యామిలీతో చూడలేం. దీని గురించి చెప్పాల్సిన ఇంకో విషయం ఏంటంటే ‘రానా నాయుడు’ తెలుగు వెబ్ సిరీస్ కాదు. హిందీలో తీసి దాన్ని తెలుగులో డబ్ చేసినట్లు లిప్ సింక్ చూస్తే తెలిసిపోతుంది.
హాలీవుడ్ సిరీస్ ‘రే డొనోవన్’కు అధికారిక రీమేక్‌గా ‘రానా నాయుడు’ని రూపొందింది. కుటుంబ సభ్యుల మధ్య ఉండే సమస్యలకు క్రైమ్, యాక్షన్, మాఫియా, డ్రగ్స్ అంశాలను జోడించారు. అన్ని సిరీస్‌ల్లానే ఇది కూడా నిదానంగా ప్రారంభం అవుతుంది. కథ ముందుకు వెళ్లే కొద్దీ స్క్రీన్ ప్లే రేసీగా మారుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉండే కాన్‌ఫ్లిక్ట్‌ను ఆసక్తికరంగా, ఎమోషనల్‌గా రాసుకున్నారు.
ముఖ్యంగా రానా, వెంకటేష్‌ల మధ్య వచ్చే ఫేస్ ఆఫ్ సన్నివేశాలు ఎమోషనల్‌గా సాగుతాయి. ఇందులోని భాష, సన్నివేశాలు ఇంగ్లిష్ వెబ్ సిరీస్‌లు రెగ్యులర్‌గా చూసే వారికి సాధారణంగానే అనిపించవచ్చు కానీ సాధారణ ప్రేక్షకులకు మాత్రం కొంచెం ఎబ్బెట్టుగా ఉంటాయి. అఫ్ కోర్స్ ఈ విషయాన్ని ప్రమోషన్లలో ముందే తెలిపారు. దీని వల్ల మనం ఎంత ప్రిపేర్ అయినా స్క్రీన్ మీద వాటిని చూసినప్పుడు ప్రాసెస్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది.
ఒక్కో ఎపిసోడ్ నిడివి 50 నిమిషాలకు కొంచెం అటూ ఇటుగా ఉంటుంది. అలాంటి ఎపిసోడ్లు మొత్తం 10 ఉన్నాయి. అంటే దాదాపు 500 నిమిషాల నిడివి అన్నమాట. కానీ ప్రారంభ ఎపిసోడ్ల తర్వాత స్టోరీ వేగం పుంజుకుంటుంది. కాబట్టి మనకు తెలియకుండా సమయం గడిచిపోతుంది. తేజ్ నాయుడు, జఫ్ఫా నాయుడుల పాత్రలను తీర్చిదిద్దిన విధానం ఆకట్టుకుంటుంది. ఈ కథ ప్రత్యేకత ఏంటంటే కేవలం రెండు పాత్రల చుట్టూనే తిరగకుండా చాలా పాత్రలకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు.
దర్శకులు కరణ్ అన్షుమన్, సుపర్న్ వర్మ సిరీస్‌ను చక్కగా తెరకెక్కించారు. సంగీత్, సిద్ధార్థ్ అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్లను వీరి సంగీతం నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లింది. జయకృష్ణ గుమ్మడి ఛాయాగ్రహణం సీన్ మూడ్‌ను క్యారీ చేస్తుంది. నెట్‌ఫ్లిక్స్ ఖర్చుకు వెనకాడకుండా ఈ సిరీస్‌ను నిర్మించింది. సెకండ్ సీజన్‌కు లీడ్ ఇస్తూ మొదటి సీజన్‌ను ముగించారు. థియేట్రికల్ సక్సెస్‌కు వసూళ్లు ఎలా కొలమానమో, ఓటీటీ సక్సెస్‌కు వ్యూయర్‌షిప్ అలానే కొలమానం. రివ్యూలతో సంబంధం లేకుండా కొత్త అవతార్‌లో వెంకీ, రానాలను చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారు కాబట్టి రెండో సీజన్ కూడా వచ్చే అవకాశం ఉంది.
ఇక నటీనటుల విషయానికి వస్తే... వెంకటేష్‌కు ఇది పూర్తిగా కొత్త తరహా పాత్ర. ఇప్పటివరకు వెంకటేష్ అంటే ఫ్యామిలీ హీరో, యాక్షన్ హీరో, కామెడీ హీరో. కానీ ఇందులో పూర్తిగా కొత్త వెంకటేష్‌ను చూడవచ్చు. ప్లేబాయ్‌గా, నెగిటివ్ షేడ్స్ కనబరించే రోల్‌లో నటుడిగా వెంకటేష్ చెలరేగిపోయారు. పెద్ద తెర మీద ఎంత గొప్ప పాత్ర చేసినా దాని కంటూ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. కానీ ఓటీటీల్లో అలాంటి బోర్డర్స్ ఏమీ లేకపోవడంతో తనలోని కొత్త కోణాన్ని వెంకటేష్ బయటకు తీశారు. పూర్తి స్థాయి ఫ్యామిలీ హీరోగా వెంకటేష్‌ను చూసే వారికి నాగా నాయుడుగా వెంకీ నచ్చకపోవచ్చు. కానీ నటుడు అంటే అన్ని రకాల పాత్రలు చేయాలిగా!
రానాకు ఇలాంటి పాత్రలు ఏమాత్రం కొత్త కాదు. కానీ ఈ పాత్ర ప్రవర్తించే విధానం, మాట్లాడే భాష రానాను కొత్తగా చూపెడుతుంది. డబ్బింగ్ చెప్పే సమయంలో కాస్త ఇబ్బంది పడ్డానని రానానే స్వయంగా చెప్పాడు. జఫ్ఫా నాయుడు పాత్రలో నటించిన అభిషేక్ బెనర్జీ సర్‌ప్రైజ్ ప్యాకేజీ. చిన్నతనంలో లైంగిక దాడి బారిన పడ్డ వ్యక్తి పాత్రలో మంచి నటన కనపరిచాడు. సిరీస్‌లో ప్రధాన పాత్రలు ఇంకా చాలా ఉన్నాయి. రానా భార్య పాత్రలో నటించిన సుర్వీన్ చావ్లా, అన్న పాత్రలో నటించిన సుశాంత్ సింగ్... ఇలా నటీనటులందరూ చక్కగా నటించారు.
ఓవరాల్‌గా చెప్పాలంటే... ఈ వీకెండ్‌లో మంచి వెబ్ సిరీస్ చూడాలనుకుంటే ‘రానా నాయుడు’ మస్ట్ వాచ్. కానీ సింగిల్‌గానే చూడాలి.