Pushpaka Vimanam Review: పుష్పక విమానం సమీక్ష: ఈ విమానం సేఫ్‌గా ల్యాండ్ అయిందా?
ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన కొత్త సినిమా పుష్పక విమానం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందంటే?
దామోదర
ఆనంద్ దేవరకొండ, గీత్ సైనీ, శాన్వీ మేఘన, సునీల్, నరేష్ తదితరులు
రేటింగ్: 2.75/5
ప్రధాన తారాగణం: ఆనంద్ దేవరకొండ, గీత్ సైనీ, శాన్వీ మేఘన, సునీల్, నరేష్ తదితరులు
సంగీతం: రామ్ మిరియాల
నిర్మాణ సంస్థ: కింగ్ ఆఫ్ ది హిల్, టాంగో ప్రొడక్షన్స్
దర్శకత్వం: దామోదర
విడుదల: 12-11-2021
మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆనంద్ దేవరకొండ హీరోగా.. దామోదర దర్శకత్వంలో రూపొందిన సినిమా పుష్పక విమానం. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్‌లో కామెడీ ఎలిమెంట్స్‌ను హైలెట్ చేయడం, విజయ్ దేవరకొండ ఈ సినిమాను అగ్రెసివ్‌గా ప్రమోట్ చేయడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి.
కథ: చిట్టిలంక సుందర్(ఆనంద్ దేవరకొండ), మీనాక్షి(గీత్ సైనీ)లకు కొత్తగా పెళ్లవుతుంది. అయితే భార్యను తీసుకుని సిటీకి వచ్చిన కొన్నిరోజులకే మీనాక్షి.. తను ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోతున్నానని లెటర్ రాసి వెళ్లిపోతుంది. అయితే సుందర్ ఈ విషయాన్ని ఆనంద్ ఎవరికీ చెప్పకుండా మేనేజ్ చేస్తూ ఉంటాడు. మీనాక్షి తల్లిదండ్రులకు మాత్రం విషయం చెప్పి.. తన వంతుగా వెతుకుతూ ఉంటాడు. ఇంతలో తనకి కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. అసలు మీనాక్షి ఏం అయింది? సుందర్ కష్టాల నుంచి బయట పడ్డాడా? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే..
విశ్లేషణ: కొత్త దర్శకుడు ఎంచుకున్న కథలోనే కామెడీ, సస్పెన్స్‌కు బోలెడంత స్కోప్ ఉంది. ప్రథమార్థంలో అసలు కథ ప్రారంభం అయ్యే సరికే.. గంటకు పైగా సినిమా అయిపోతుంది. సుందర్.. భార్యను వెతకడం, చుట్టుపక్కల వాళ్ల దగ్గర భార్య గురించి ఎంక్వైరీ చేయడం వంటి అంశాల నుంచి ఫన్ జనరేట్ చేయాలనుకునే ప్రయత్నం కొంతమేర సఫలం అయింది. స్కూల్లో స్టాఫ్‌ను ఇంటికి భోజనానికి పిలిచి వాళ్ల ముందు కవర్ చేయడానికి పాట్లు పడే ఎపిసోడ్ బాగా నవ్విస్తుంది. దీంతోపాటు సెకండాఫ్‌లో సునీల్, నరేష్‌ల మధ్య వచ్చే ఎపిసోడ్లు బాగా పేలాయి. ట్విస్ట్ రివీల్ అయ్యే ఎపిసోడ్‌ను బాగా డీల్ చేయడం సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్.
అయితే కథలోకి వెళ్లడానికి గంట సమయం తీసుకోకుండా ఉంటే బాగుండేది. దీంతోపాటు కీలకమైన ట్విస్ట్ రివీల్ అయ్యాక ఓస్.. ఇంతేనా... అనిపిస్తుంది. ఏదో పెద్ద విషయం జరిగింది అన్నంత సస్పెన్స్ క్రియేట్ చేసి.. చివర్లో సింపుల్‌గా తేల్చేయడం కొంచెం డిజప్పాయింట్ చేస్తుంది. కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ సినిమాకి 142 నిమిషాల రన్ టైం కొంచెం ఎక్కువే. ప్రథమార్థంలో కథలోకి వెళ్లేముందు కొన్ని అనవసర సన్నివేశాలను కట్ చేసి రెండు గంటల్లో ముగించేసి ఉంటే.. ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉన్న కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్ అయి ఉండేది.
ఇక నటీనటుల విషయానికి వస్తే.. ఆనంద్ దేవరకొండ నటనలో పరిణతి కనిపించింది. ఎంతో కోపం, బాధ ఉన్నప్పటికీ ఏమీ చేయలేని భర్త పాత్రలో ఆనంద్ నటన ఎంతగానో ఆకట్టుకుంది. దొరసాని, మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాల కంటే తన నటన ఎంతో మెరుగైంది. చిట్టిలంక సుందర్ పాత్ర ఆనంద్‌కు టైలర్ మేడ్ క్యారెక్టర్ లాంటిదని చెప్పవచ్చు. హీరోయిన్ పాత్ర గురించి ఏం చెప్పినా స్పాయిలర్ అవుతుంది. కానీ మీనాక్షి పాత్రలో గీత్ సైనీ కూడా బాగా నటించింది. టాలీవుడ్‌కు మరో యంగ్ హీరోయిన్ ఎంట్రీ ఇచ్చినట్లే. రేఖ పాత్రలో నటించిన శాన్వీ కూడా మంచి పెర్పార్మెన్స్ ఇచ్చింది. తనకు, సునీల్‌కు మధ్య వచ్చే సీన్ అయితే సినిమాలోని బెస్ట్ సీన్లలో ఒకటి. ఇక ఎస్సై పాత్రలో సునీల్, హెడ్ మాస్టర్ పాత్రలో నటించిన సీనియర్ యాక్టర్ నరేష్ కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. రామ్ మిరియాల అందించిన పాటలు సోసోగానే ఉన్నా.. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది.
ఓవరాల్‌గా చూసుకుంటే.. దర్శకుడు ఎంచుకున్న కథ బాగున్నా అనవసరమైన సన్నివేశాలతో నిడివిని విపరీతంగా పెంచేశాడు. కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్‌లను మీరు ఇష్టపడితే.. ఈ వీకెండ్‌లో టైమ్‌పాస్‌కు ఒక లుక్కేయచ్చు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి