Stranger Things Season 4 Review: స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 4 రివ్యూ: స్ట్రేంజర్ థింగ్స్ కొత్త సీజన్ ఎలా ఉందంటే?
నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ అయిన స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 4 మొదటి వాల్యూమ్ ఎలా ఉందంటే?
డఫర్ బ్రదర్స్, షాన్ లెవీ, నిమ్రోడ్ అంటాల్
మిల్లీ బాబీ బ్రౌన్, ఫిన్ వుల్ఫ్‌హార్డ్, చార్లీ హీటన్, వినోనా రైడర్, గాటెన్ మటరాజో, కాలేబ్ మెక్‌లాలిన్, శాడీ సింక్ తదితరులు
వెబ్ సిరీస్ రివ్యూ: Stranger Things Season 4 Volume 1
స్ట్రీమింగ్: నెట్‌ఫ్లిక్స్
రేటింగ్: 3.5/5
నటీనటులు: మిల్లీ బాబీ బ్రౌన్ (Eleven), ఫిన్ వుల్ఫ్‌హార్డ్ (Mike), చార్లీ హీటన్ (Jonathan Byers), వినోనా రైడర్ (Joyce Byers), గాటెన్ మటరాజో (Dustin Henderson), కాలేబ్ మెక్‌లాలిన్ (Lucas), శాడీ సింక్ (Max) తదితరులు
సంగీతం: మైకేల్ స్టెయిన్, కైల్ డిక్సన్
నిర్మాణ సంస్థ: నెట్‌ఫ్లిక్స్
దర్శకత్వం: డఫర్ బ్రదర్స్, షాన్ లెవీ, నిమ్రోడ్ అంటాల్
స్ట్రీమింగ్ తేదీ: మే 27, 2022
ఓటీటీల్లో వెబ్ సిరీస్‌లు చూసేవారికి పరిచయం అవసరం లేని సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్. ఓటీటీల మీద కొద్దిగా అవగాహన ఉన్నవారు కూడా దీని పేరు ఎక్కడో ఒక చోట వినే ఉంటారు. మనీ హెయిస్ట్, స్క్విడ్ గేమ్, గేమ్ ఆఫ్ థ్రోన్స్, బ్రేకింగ్ బ్యాడ్ స్థాయి ఫాలోయింగ్ ఈ సిరీస్‌కు కూడా ఉంది. ప్రపంచాన్ని నాశనం చేయగల జీవులను టీనేజ్ పిల్లలు ఎదుర్కోవడమే దీని మూల కథ. ఇందులో నటించిన టీనేజ్ నటుల యాక్టింగ్, థ్రిల్‌కు హ్యూమర్‌ను సెట్ అయ్యేలా యాడ్ చేసిన రైటింగ్, ఏమాత్రం తీసిపోని ప్రొడక్షన్ వాల్యూస్ ఈ సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి ఫ్యాన్‌బేస్‌ను అందించాయి. ఈ సిరీస్‌లో నాలుగో సీజన్ మొదటి భాగం ఇటీవలే నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల అయింది. ఈ సీజన్ కోసం ఫ్యాన్స్ ఎప్పట్నుంచో వెయిట్ చేస్తున్నారు. మరి వారి అంచనాలను ఈ సిరీస్ అందుకుందా?
కథ: స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 3లో స్టార్ కోర్ట్ మాల్ ఫైట్ ముగిసిన ఆరు నెలల తర్వాత సీజన్ 4 ప్రారంభం అవుతుంది. సీజన్ 3 చివర్లో ఎలెవన్ (మిల్లీ బాబీ బ్రౌన్), విల్ (నోవా ష్నాప్), జొనాథన్ (చార్లీ హీటన్), జాయిస్ బయర్స్ (వినోనా రైడర్) హాకిన్స్ నగరాన్ని వదిలి వెళ్లిపోతారు. అయితే క్రిస్మస్ సెలవులకు వీరు హాకిన్స్‌కు వచ్చి మిత్రులను కలవాలనుకుంటారు. కానీ వీరి జీవితంలో అనుకోని సంఘటనలు మొదలవుతాయి. మూడో సీజన్ చివర్లో చనిపోయిన జిమ్ హోపర్ (డేవిడ్ హార్బర్) బతికే ఉన్నాడని జాయిస్‌కు తెలుస్తుంది. ఇక అప్‌సైడ్ డౌన్ (ముందు సీజన్లలో చూపించిన చీకటి ప్రపంచం)లో మరో కొత్త జీవి హాకిన్స్‌లో టీనేజర్లను వరుసగా చంపుతూ ఉంటుంది. ఈ హత్యలకు డస్టిన్ హెండర్సన్ (గాటెన్ మటరాజో), లూకాస్ (కాలేబ్ మెక్‌లాలిన్), మ్యాక్స్‌లకు (శాడీ సింక్) సంబంధం ఉందని పోలీసులు అనుమానిస్తూ ఉంటారు. ఈ కొత్త జీవికి వెక్నా అనే పేరు పెట్టి తనను ఆపడానికి వీరు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇంతకీ వెక్నా ఎవరు? వీరందరూ కలిసి వెక్నాను ఆపగలిగారా? అసలు హాకిన్స్ ల్యాబ్‌లో ఏం జరిగింది? ఎలెవన్ తన శక్తులను తిరిగి పొందిందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే సీజన్ 4 చూడాల్సిందే.
విశ్లేషణ: సాధారణంగా చిన్న పిల్లలు, టీనేజ్ యువకులు ఇటువంటి సాహసాలు చేస్తున్నారంటే వాటిలో పిల్లలకు సంబంధించిన, వారిని ఆకట్టుకునే ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. పెద్దలు వాటిని చూడటానికి ఎక్కువగా ఆసక్తి చూపించరు. కానీ మిగిలిన టీన్ డ్రామాల కంటే స్ట్రేంజర్ థింగ్స్ ప్రత్యేకంగా ఉంటడం, ఇంత ప్రజాదరణ పొందడానికి కారణం వారి అప్రోచ్. డార్క్ హార్రర్ ఎలిమెంట్స్, ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసే జంప్ స్కేర్ సీన్లకు ఇందులో ఏమాత్రం కొదవ ఉండదు. అందుకే ఈ సిరీస్ ఇంత ఫ్యాన్ బేస్‌ను సొంతం చేసుకుంది. మొదటి మూడు సీజన్లలో ఉండే హార్రర్ ఎలిమెంట్స్ ఒక లెవల్లో ఉంటే... నాలుగో సీజన్ మాత్రం అంతకు మించి అనేలా ఉంటుంది. కేవలం విజువల్ మాత్రమే కాకుండా సౌండ్ విషయంలో కూడా ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. చూడగానే భయపెట్టేలా వెక్నా రూపాన్ని డిజైన్ చేశారు.
ఇక కథ, కథనాల విషయానికి వస్తే... ఇందులో ఎపిసోడ్ల రన్‌టైం కూడా ఎక్కువగా ఉంటుంది. మొదటి మూడు సీజన్లలో యావరేజ్ రన్‌టైం 50 నిమిషాలు ఉంటే... నాలుగో సీజన్ యావరేజ్ రన్‌టైం గంటా 10 నిమిషాలు ఉంటుంది. చివరి ఎపిసోడ్ అయితే ఏకంగా గంటా 40 నిమిషాల నిడివితో ఉంటుంది. మొదటి మూడు సీజన్లతో పోలిస్తే ఇందులో కొన్ని బోరింగ్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. కొన్ని సీన్లలో సుదీర్ఘంగా సంభాషణలు సాగడం దీనికి ప్రధాన కారణం.
ఈ సీజన్‌లో మొదటి మూడు ఎపిసోడ్లలో ప్రధాన పాత్రల జీవితాలు ఎలా మారాయి? ప్రస్తుతం ఎలా ఉన్నాయి? వంటి అంశాలపైనే ఫోకస్ చేశారు. జాయిస్ బయర్స్ అలాస్కా వెళ్లడం, ఎలెవన్ పవర్స్‌ను తిరిగి తీసుకురావడానికి ల్యాబ్‌కు తీసుకువెళ్లడం, హాకిన్స్‌లో హత్యలు జరగడం... ఇలా అన్నీ ఒకేసారి ప్రారంభమై మెల్లగా కథలో లీనం అయ్యేలా చేస్తాయి. ఒక్కసారి క్యారెక్టర్లందరినీ తీసుకెళ్లాల్సిన స్థానాలకు తీసుకెళ్లాక అసలు గేమ్ ప్రారంభం అవుతుంది. అక్కడ నుంచి సిరీస్ గ్రాఫ్ ఏమాత్రం తగ్గదు. రష్యాలో జిమ్ హోపర్, హాకిన్స్‌లో వెక్నా ట్రాక్, ఎలెవన్ ల్యాబ్ సీన్లు ఇలా మూడు ట్రాక్‌లు సమాంతరంగా నడిచినా ఎక్కడా ఏమాత్రం కన్ఫ్యూజన్ ఉండదు.
సీజన్‌లో మొదటి ఆరు ఎపిసోడ్లు ఒక ఎత్తయితే... చివరి ఎపిసోడ్ మాత్రం వేరే లెవల్ అని చెప్పాలి. మొదటి మూడు సీజన్లలో తలెత్తే ప్రశ్నలకు సమాధానం ఇస్తూనే కొత్త ప్రశ్నలను ఈ ఎపిసోడ్‌లో లేవనెత్తుతారు. ఎపిసోడ్ చివర్లో ఎలెవన్‌కు ఇచ్చే మాస్ ఎలివేషన్ సీన్ సిరీస్‌కే హైలెట్. ఈ సీజన్‌లో మొదటి రెండు ఎపిసోడ్లు, ఆఖరి ఎపిసోడ్‌కు సిరీస్ రూపకర్తలు డఫర్ బ్రదర్స్ దర్శకత్వం వహించారు. నైట్ ఎట్ ది మ్యూజియం, ఫ్రీ గై, ది ఆడం ప్రాజెక్ట్ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలకు దర్శకత్వం వహించిన షాన్ లెవీ మూడు, నాలుగు ఎపిసోడ్లకు దర్శకత్వం వహించారు. మరో ప్రముఖ దర్శకుడు నిమ్రోడ్ అంటాల్ దర్శకత్వంలో ఐదు, ఆరు ఎపిసోడ్లు తెరకెక్కాయి.
ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో మాత్రం నెట్‌ఫ్లిక్స్ తగ్గేదేలే అన్నట్లు దూసుకెళ్లింది. నాలుగో సీజన్‌లో ఒక్కో ఎపిసోడ్‌కు నెట్‌ఫ్లిక్స్ సగటున 30 మిలియన్ డాలర్లు (సుమారు రూ.232.5 కోట్లు) ఖర్చు పెట్టింది. అంటే తొమ్మిది ఎపిసోడ్లకు కలిపి దాదాపు రూ.2,100 కోట్లన్న మాట. ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ అయిన టాప్ గన్: మావెరిక్ కంటే ఇది రూ.750 కోట్లు ఎక్కువ. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నెట్‌ఫ్లిక్స్ ఈ సిరీస్‌పై ఎన్ని ఆశలు పెట్టుకుందో. మైకేల్ స్టెయిన్, కైల్ డిక్సన్ అందించిన సంగీతం సిరీస్ మూడ్‌ను క్యారీ చేస్తుంది.
నటీనటుల విషయానికి వస్తే... ఇందులో చాలా క్యారెక్టర్లు ఉంటాయి. అయితే ప్రధానంగా మనల్ని ఆకట్టుకునే పాత్రలు మాత్రం మిల్లీ బాబీ బ్రౌన్ పోషించిన ఎలెవన్, గాటెన్ మటరాజో పోషించిన డస్టిన్ పాత్రలు. ఈ సీజన్‌లో కూడా వీరు తమ క్యారెక్టర్లలో చెలరేగిపోయాడు. సీరియస్ సన్నివేశాల్లో కూడా గాటెన్ మటరాజో నటన మన పెదాలపై చిరునవ్వు తెప్పిస్తుంది. ఇక మిల్లీ బాబీ బ్రౌన్ ఎమోషనల్ సన్నివేశాల్లో ఆకట్టుకుంటుంది. చివర్లో ఎలివేషన్ సీన్లో గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. మిగతా నటీనటులందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు.
ఒక్క మాటలో చెప్పాలంటే... హార్రర్, థ్రిల్లర్ లవర్స్ స్ట్రేంజర్ థింగ్స్ కచ్చితంగా చూడాల్సిన వెబ్ సిరీస్. ప్రస్తుతం నాలుగో సీజన్లో ఏడు ఎపిసోడ్లు మాత్రమే విడుదల అయ్యాయి. మిగతా రెండు ఎపిసోడ్లూ జులై 1వ తేదీ నుంచి స్ట్రీమ్ కానున్నాయి.
Also Read: 'ఎఫ్ 3' రివ్యూ: వెంకటేష్, వరుణ్ తేజ్ నవ్వించారా? ఫ్రస్ట్రేషన్ తెప్పించారా?