Jallikattu Web Series Review - 'జల్లికట్టు' రివ్యూ : ఆహాలో వెట్రిమారన్ వెబ్ సిరీస్ - ఎలా ఉందంటే?
OTT Review - Jallikattu Web Series On AHA Telugu : వెట్రిమారన్ నిర్మించిన వెబ్ సిరీస్ 'జల్లికట్టు'. తెలుగు ప్రేక్షకులకు తెలిసిన నటుడు కిశోర్ ఓ పాత్రలో నటించారు. ఈ సిరీస్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.
రాజ్ కుమార్
కిశోర్, కలైయరసన్, షీలా రాజ్ కుమార్, వేల రామమూర్తి
వెబ్ సిరీస్ రివ్యూ : జల్లికట్టు
రేటింగ్ : 2.5/5
నటీనటులు : కిశోర్, కలైయరసన్, షీలా రాజ్ కుమార్, వేల రామమూర్తి, ఆంటోనీ, బాల హాసన్ తదితరులు
ఛాయాగ్రహణం : వేల్ రాజ్
దర్శకత్వం : రాజ్ కుమార్
షోరన్నర్, నిర్మాత : వెట్రిమారన్
విడుదల తేదీ: ఏప్రిల్ 26, 2023
ఓటీటీ వేదిక : ఆహా తెలుగు
ఎన్ని ఎపిసోడ్స్ : 8
'విడుదల పార్ట్ 1'తో వెట్రిమారన్ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి రెండు వారాలు కూడా పూర్తి కాలేదు. ఇప్పుడు 'జల్లికట్టు' వెబ్ సిరీస్ (Jallikattu Web Series)తో వచ్చారు. అయితే, దీనికి ఆయన దర్శకుడు కాదు... నిర్మాత! 'ఆహా' కోసం రూపొందిన ఎక్స్‌క్లూజివ్ సిరీస్ ఇది. తమిళంలో గతేడాది అక్టోబర్ 21న విడుదల చేశారు. ఇప్పుడు తెలుగు అనువాదం విడుదలైంది. ఈ సిరీస్ ఎలా ఉందంటే?
కథ (Jallikattu Web Series Story) : తమిళనాడులో తామర కులానికి చెందిన ప్రజలకు, పశుసంపద జీవనాధారంగా బతుకున్న వ్యవసాయ కూలీల వర్గానికి తరాలుగా శత్రుత్వం ఉంది. అందువల్ల, జల్లికట్టులో తామర కులానికి చెందిన ఎద్దులను ఎవరూ పట్టుకోకూడదని వ్యవసాయ కూలీల పెద్దలు నిర్ణయిస్తారు. ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టి మరీ ముత్తయ్య (కిశోర్) మేనల్లుడు పాండు (కలైయారసన్) తామర కులానికి చెందిన జమీందార్ సెల్వ శేఖరన్ (వేల రామమూర్తి) ఎద్దును పట్టుకుంటాడు. ఆ తర్వాత పాండి హత్యకు గురవుతాడు.
పాండును చంపింది ఎవరు? ఆ తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ తామర కులం జల్లికట్టులో దింపిన ఎద్దును పట్టుకోవడానికి ప్రయత్నించిన స్టాండప్ కమెడియన్ పార్తీబన్ (ఆంటోనీ) ఎవరు? ప్రతి జల్లికట్టులో ఎవరికీ లొంగని ఎద్దు (వేట కాళీ) అతనికి ఎలా లొంగింది? అతనిపై ఆ ఎద్దును పెంచిన అమ్మాయి తేన్ మౌళి (షీలా రాజ్ కుమార్) అన్నయ్య మనుషులు హత్యా ప్రయత్నం చేసిన తర్వాత ఏమైంది? పేరు కోసం, పరువు కోసం రెండు వర్గాల మధ్య జరిగిన పోరులో సెల్వ శేఖరన్ కుమారుడి పాత్ర ఏమిటి? ఎవరెవరి ప్రాణాలు పోయాయి? చివరికి ఏమైంది? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Jallikattu Web Series Telugu Review) : జల్లికట్టు సంప్రదాయం గురించి తెలుగు ప్రజలకు కూడా అవగాహన ఉంది. రెండు వర్గాల మధ్య ఆ సంప్రదాయం ఎటువంటి వైరానికి దారి తీసింది? ప్రేమ ఎంత పని చేసింది? అగ్ర వర్ణాల చేతిలో కూలీలు ఏ విధంగా ప్రాణాలు కోల్పోయారు? అనే అంశాలను మేళవించి 'జల్లికట్టు' సిరీస్ తీశారు.
'జల్లికట్టు' కథ, కథనాలు వెట్రిమారన్ శైలిలో సాగాయి. ఆయన సినిమాల్లో మనకు కనిపించే అంశాలు ఇందులోనూ ఉన్నాయి. సాధారణంగా వెట్రిమారన్ సినిమాలు నిదానంగా సాగుతాయనే విమర్శ ఉంది. ఆయన నిర్మించిన సిరీస్ నెమ్మదిగా సాగింది. వెబ్ సిరీస్ కావడంతో దర్శకుడు రాజ్ కుమార్ మరింత నెమ్మదిగా తీశారు. పూర్తిగా తమిళ నేటివిటీతో సాగే సిరీస్ ఇది.
వెట్రిమారన్ దర్శకత్వం వహించిన 'అసురన్' (తెలుగులో 'నారప్ప'), 'కర్ణన్'లో కొన్ని సన్నివేశాలకు, ఈ వెబ్ సిరీస్ లో సన్నివేశాలకు చాలా సారూప్యతలు ఉన్నాయి. ముఖ్యంగా క్యారెక్టరైజేషన్స్ విషయంలో! అగ్ర వర్ణాలకు ఎదురెళ్ళిన మేనల్లుడిని కాపాడుకోవడం కోసం కొండల్లోకి ముత్తయ్య తీసుకు వెళ్లడం 'నారప్ప'ను గుర్తు చేస్తుంది. అగ్ర వర్ణాల అహంకార పూరిత ధోరణి, అధికార దర్పం, పేరు ప్రతిష్ఠల కోసం చేసే పోరాటంలో బలహీన వర్గాల ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు? అనేది కథాంశం. స్లో పేస్ చాలా ఇబ్బంది పెడుతుంది. అయితే, 'జల్లికట్టు' నేపథ్యం ఈ కథకు కొత్త హంగులు, రంగులు అద్దింది. ఆర్టిస్టుల ఇంటెన్స్ యాక్టింగ్, టేకింగ్ కారణంగా సిరీస్ కొత్తగా కనబడుతుంది. ఎమోషన్స్ వర్కవుట్ అయ్యాయి.
వయసులో తన కొడుకు కంటే చిన్నదైన మేనకోడలిని జమీందార్ బలవంతంగా పెళ్లి చేసుకోవడం కథకు అవసరం లేదేమో అనిపిస్తుంది. అయితే, ఆ అమ్మాయి ప్రేమించిన అబ్బాయి మరణం, దానికి వేట కాళీకి కనెక్ట్ చేసిన తీరు బావుంది. కొన్ని సీన్లు థ్రిల్ ఇస్తాయి. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ సిరీస్ థీమ్ రిఫ్లెక్ట్ చేసేలా ఉన్నాయి.
నటీనటులు ఎలా చేశారు? : కిశోర్ మినహా తెలుగు ప్రేక్షకులకు తెలిసిన ఆర్టిస్టులు తక్కువ. ముత్తయ్య పాత్రలో కిశోర్ ఫెంటాస్టిక్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. పాండు పాత్రలో కలైయరసన్ నటించినట్టు లేదు... జీవించారు. తేన్ మౌళి పాత్రలో షీలా రాజశేఖర్ నటన బావుంది. మిగతా నటీనటులు పాత్రల పరిధి మేరకు నటించారు.
Also Read : ఈవిల్ డెడ్ రైజ్ రివ్యూ: ‘ఈవిల్ డెడ్’ ఫ్రాంచైజీలో కొత్త సినిమా ఎలా ఉంది? ఫ్యాన్స్‌ను ఖుషీ చేసిందా?
చివరగా చెప్పేది ఏంటంటే? : తమిళ కల్చర్, నేటివిటీ తెలుసుకోవాలని ఆసక్తి కనబరిచే ప్రేక్షకులను ఆకట్టుకునే వెబ్ సిరీస్ 'జల్లికట్టు'. పేరు కోసం ఒకరు, పరువు కోసం ఇంకొకరు, తండ్రి నుంచి అధికారం దక్కించుకోవడం కోసం మరొకరు, పగతో వేరొకరు... ఈ పాత్రలను ప్రేమకథతో ముడిపెడుతూ చెప్పిన తీరు బావుంది. కానీ, నిదానంగా సాగిన కథ, కథనాలు ఫార్వర్డ్ బటన్ మీదకు చెయ్యి వెళ్ళేలా చేశాయి.
Also Read : ‘కన్నై నంబాతే’ మూవీ రివ్యూ: రెప్పపాటులో ఇన్ని ట్విస్టులా?