Jai Bhim Review: జై భీం సమీక్ష: సూర్య మళ్లీ కొట్టాడు.. ఈసారి అవార్డులు కూడా!
Jai Bhim: సూర్య హీరోగా కొత్త దర్శకుడు టీఎస్ జ్ఞానవేల్ తెరకెక్కించిన సినిమా జై భీం. ఈ సినిమా ఎలా ఉందంటే..
టీఎస్ జ్ఞానవేల్
సూర్య, రజీషా విజయన్, మణికందన్, లిజోమోల్ జోస్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ తదితరులు
రేటింగ్: 3.5/5
తారాగణం: సూర్య, రజీషా విజయన్, మణికందన్, లిజోమోల్ జోస్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ తదితరులు
ఎడిటర్: ఫిలోమిన్ రాజ్
సినిమాటోగ్రఫీ: ఎస్ఆర్ కదిర్
సంగీతం: షాన్ రోల్డన్
నిర్మాతలు: జ్యోతిక, సూర్య
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: టీఎస్ జ్ఞానవేల్
తెలుగు ప్రజలకు సుపరిచితుడైన సూర్య హీరోగా, కర్ణన్ ఫేమ్ రజీషా విజయన్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ కీలకపాత్రల్లో.. కొత్త దర్శకుడు టీఎస్ జ్ఞానవేల్ రూపొందించిన సినిమా ‘జై భీమ్’. ఆకాశం నీ హద్దురా వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రం తర్వాత సూర్య నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో విడుదల అయింది. కులవ్యవస్థను బలంగా ప్రశ్నిస్తూ, అదే సమయంలో థ్రిల్లింగ్ కోర్ట్ రూం డ్రామాను చూడబోతున్నామనే ఫీలింగ్‌ను ఈ సినిమా ట్రైలర్ కలిగించింది. మరి ట్రైలర్ ఉన్నంత బలంగా సినిమా ఉందా? సూర్య మళ్లీ హిట్టు కొట్టాడా?
కథ: ఒక సెంట్రల్ జైల్ బయట రెండు, మూడు పోలీస్ స్టేషన్లకు చెందిన అధికారులు ఉంటారు. జైలులో నుంచి విడుదల అయి బయటకు వచ్చే వారిని జైలు అధికారి మీ కులం ఏంటని అడుగుతూ.. అగ్రకులాల పేర్లు చెప్పిన వారిని పంపేసి, తక్కువ కులాల పేర్లు చెప్పిన వారిని పక్కన నిలుచోమని చెబుతాడు. పక్కన విడిగా ఉన్న రెండు, మూడు స్టేషన్లకు చెందిన పోలీసులు వీరిని వాటాలుగా పంచుకుని.. తప్పుడు కేసులు బనాయించడానికి తీసుకెళ్లిపోతారు. తర్వాత కథ ఒక ఆదివాసీ ప్రాంతానికి చేరుతుంది. గ్రామ పెద్ద ఇంట్లో పాముని పట్టడానికి రాజన్న(మణికందన్) అనే ఆదివాసీ వెళ్తాడు. ఆ తర్వాత ఆ ఇంట్లో దొంగతనం జరుగుతుంది. దీంతో పోలీసులు రాజన్నతో పాటు అతని బంధువులను జైలుకి తీసుకెళ్లి వాళ్ల ‘స్టైల్’లో ఇంటరాగేషన్ చేస్తారు. రెండు, మూడ్రోజుల తర్వాత రాజన్న భార్య చిన్నతల్లి(లిజోమోల్ జోస్) దగ్గరకు వచ్చిన మీ ఆయన తప్పించుకున్నాడని చెప్తారు. భర్త కోసం వెతికి, వెతికి విసిగిపోయి తమ పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్(రజీషా విజయన్) సాయంతో లాయర్ చంద్రు (సూర్య) దగ్గరకి వచ్చి తన భర్తను ఎలాగైనా తనదగ్గరికి చేర్చమని చిన్నతల్లి కోరుతుంది. ఆ కేసును టేకప్ చేసిన చంద్రుకు ఎటువంటి అవాంతరాలు ఎదురయ్యాయి? రాజన్న ఏమైపోయాడు? చిన్నతల్లికి న్యాయం జరిగిందా? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Also Read: 'రొమాంటిక్' సమీక్ష: రొమాన్స్ తక్కువ... రొటీన్ సీన్లు ఎక్కువ!
విశ్లేషణ: ఇలాంటి కథను మొదటి సినిమాకు ఎంచుకున్న జ్ఞానవేల్ ధైర్యానికి ముందుగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. వెట్రిమారన్, పా.రంజిత్, మారి సెల్వరాజ్‌ల స్థాయిలో జ్ఞానవేల్ టేకింగ్ ఉంది. మొదటి సన్నివేశం ద్వారానే సినిమా ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ప్రేక్షకులకు సూటిగా, సుత్తి లేకుండా చెప్పాడు. అయితే కేవలం సమస్యను మాత్రమే ప్రస్తావిస్తే.. పూర్తిగా ఆర్ట్ సినిమా అయిపోయే ప్రమాదం ఉంది. దీంతో కథ అనే స్టీరింగ్‌ను ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్, కోర్ట్ రూం డ్రామా వైపు తిప్పాడు. అక్కడ కూడా పూర్తి మార్కులు కొట్టేశాడు.
అణగారిన వర్గాల సమస్యను ప్రస్తావిస్తూనే.. తర్వాతి సీన్‌లో ఏం జరగబోతుంది అనే ఆసక్తి క్రియేట్ చేయడంలో జ్ఞానవేల్ 100 శాతం సక్సెస్ అయ్యాడు. ఇంటర్వెల్, క్లైమ్యాక్స్, రాజన్న పాత్రధారి కోసం సూర్య ఇన్వెస్టిగేట్ చేసే సమయాల్లో ప్రేక్షకులు దాదాపు సీట్ ఎడ్జ్‌కు వచ్చేస్తారు. అసలు ఏం జరిగి ఉంటుంది అనేది అందరూ ఊహించగలిగే విషయమే అయినా.. ఎలా జరిగి ఉంటుంది అనే ఆసక్తిని క్రియేట్ చేయడంలో జ్ఞానవేల్ సక్సెస్ అయ్యాడు. అయితే సెకండాఫ్‌ను క్రిస్పీగా రాసుకున్న జ్ఞానవేల్, ప్రథమార్థంలో స్క్రీన్ ప్లేను కాస్త నిదానంగా రాసుకున్నాడు. హార్ట్ హిట్టింగ్‌గా చూపించిన మొదటి సన్నివేశం తర్వాత.. అరగంట సేపు కథ కాసేపు నిదానంగా సాగుతున్నట్లు అనిపిస్తుంది. ఒక్కసారి సూర్య ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి సినిమా గ్రాఫ్ ఎక్కడా పడకుండా జ్ఞానవేల్ మంచి జాగ్రత్తలు తీసుకున్నాడు. సినిమాకు ఇంకో మైనస్ నిడివి. దీని రన్‌టైం 2 గంటల 44 నిమిషాలు ఉంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కాబట్టి రన్‌టైం కొంచెం తక్కువ ఉండేలా చూసుకుంటే బాగుండేది.
ఈ సినిమా విషయంలో ఎక్కువ క్రెడిట్ సూర్యకే ఇవ్వాలి. జ్ఞానవేల్ ఇంత మంచి కథతో ముందుకు వచ్చినప్పుడు ఈ సినిమాలో హీరోగా నటించడమే కాకుండా.. తనే స్వయంగా నిర్మించాడు. ఈ సినిమాను తను ఎంత నమ్మాడు, ఎంత కేర్ తీసుకున్నాడో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవాలి. దీనికి తోడు చంద్రు పాత్రకు సూర్య పూర్తిగా న్యాయం చేశాడు. సూర్య ఎంత మంచి నటుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్లైమ్యాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సీన్లలో సూర్య జీవించాడు. ఆకాశం నీ హద్దురా అమెజాన్ ప్రైమ్‌లో విడుదల అయినప్పుడు.. ఈ సినిమ థియేటర్‌లో రిలీజ్ అయి ఉంటే బాగుండు అని చాలా మంది అనుకున్నారు. ఇప్పుడు జై భీంకు కూడా కచ్చితంగా అదే అనుకుంటారు. అయితే సినిమా ఫస్ట్ లుక్ విడుదల అయినప్పుడే నేరుగా ఓటీటీ రిలీజ్ అని ప్రకటించారు. కాబట్టి సినిమా మొదలు పెట్టినప్పుడే డైరెక్ట్ ఓటీటీ అని ఫిక్స్ అయి ఉంటారు. సూర్య నుంచి ఫ్యాన్స్ కోరుకునే ఫైట్లు, పాటలు లేకపోవడంతో థియేట్రికల్ రిలీజ్ కమర్షియల్‌గా వర్కవుట్ అవ్వదని సూర్య ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. ఈ సినిమా బోలెడన్ని అవార్డులు కూడా సాధించే అవకాశం ఉంది.
సూర్య తర్వాత కథలో కీలకమైన పాత్ర చిన్నతల్లి. ఆ పాత్రను పోషించిన లిజోమోల్ జోస్ తన పాత్రకు 200 శాతం న్యాయం చేసింది. ఎమోషనల్ సీన్లలో సూర్యకు పోటీని ఇవ్వడం మామూలు విషయం కాదు. కానీ సూర్యకు ఏమాత్రం తగ్గకుండా లిజోమోల్ నటించింది. మిగతా పాత్రల్లో నటించిన రజీషా విజయన్, రావు రమేష్, ప్రకాష్ రాజ్ కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. ప్రకాష్ రాజ్‌కు వేరేవారు డబ్బింగ్ చెప్పడంతో తను మాట్లాడినప్పుడల్లా కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది.
Also Read: వరుడు కావలెను సమీక్ష: ఈ వరుడు చాలా రొటీన్ గురూ..
ఇక సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా సూర్య ఈ సినిమాను తన భుజాలపై మోశాడు. ఖర్చుకు వెనకాడకుండా, అదే సమయంలో సహజత్వం నుంచి పక్కకు వెళ్లకుండా ఈ సినిమా తీశాడు. షాన్ రోల్డాన్ పాటలు సోసోగానే ఉన్నా.. నేపథ్య సంగీతంతో ఆకట్టుకున్నాడు. ఎస్ఆర్ కదిర్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటర్ ఫిలోమిన్ రాజ్ ఫస్టాఫ్‌లో తన కత్తెరకు కాస్త పదును పెట్టి ఉంటే బాగుండేది.
ఓవరాల్‌గా చెప్పాలంటే.. సామాజిక సమస్యలపై రాసుకున్న కథలో థ్రిల్లర్‌ను మిక్స్ చేసి ఒక చక్కటి కోర్ట్‌రూం డ్రామాను అందించడంతో జ్ఞానవేల్ 100 శాతం సక్సెస్ అయ్యాడు. ఈ వారాంతంలో ఇంట్లో నుంచే ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునేవారికి ఇది మంచి చాయిస్.