Roti Kapda Romance Review - రోటి కపడా రొమాన్స్ రివ్యూ: రొమాంటిక్‌గా కలిశాక... లవర్స్ మధ్య ప్రాబ్లమ్స్ వస్తే?
Roti Kapda Romance Review In Telugu: విక్రమ్ రెడ్డి దర్శకత్వం వహించిన 'రోటి కపడా రొమాన్స్' ప్రీమియర్లకు మంచి స్పందన లభించింది. థియేటర్లలో ఈ రోజు విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే?
విక్రమ్ రెడ్డి
సందీప్ సరోజ్ - సోనూ ఠాకూర్, హర్ష నర్రా - ఖుష్బూ చౌదరి, తరుణ్ పొనుగోటి - నువేక్ష, సుప్రజ్ రంగా - మేఘ లేఖ తదితరులు
Roti Kapda Romance Movie Review In Telugu: 'కమిటీ కుర్రోళ్ళు' ఫేమ్ సందీప్ సరోజ్ ఓ హీరోగా నటించిన సినిమా 'రోటి కపడా రొమాన్స్'. హర్ష నర్రా, తరుణ్ పొనుగోటి, సుప్రజ్ రంగా మిగతా హీరోలు. సోనూ ఠాకూర్, నువేక్ష, మేఘ లేఖ, ఖుష్బూ చౌదరి హీరోయిన్లు. విక్రమ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను సృజన్ కుమార్ బొజ్జంతో కలిసి లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్ నిర్మించారు. ప్రీమియర్ షోలకు మంచి స్పందన లభించింది. మరి, సినిమా ఎలా ఉంది? అంటే...
కథ (Roti Kapda Romance Story): ఇదొక నలుగురు కుర్రాళ్ళ కథ. సారీ సారీ... నాలుగు జంటల కథ. ఒక్కొక్కరి జీవితంలో ఎదురైన సందర్భాలు వేరు కావచ్చు. కానీ, నాలుగు జంటల్లో కామన్ పాయింట్స్ ఒక్కటే... లవ్, రొమాన్స్ అండ్ బ్రేకప్.
రాహుల్ (సందీప్ సరోజ్) సాఫ్ట్వేర్ ఉద్యోగి. ప్రెషర్ వద్దనుకుని రిజైన్ చేయాలని అనుకుంటాడు. ఆ సమయంలో వచ్చిన కొత్త ప్రాజెక్ట్ మేనేజర్ ప్రియా (సోనూ ఠాకూర్)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె పెళ్లి చేసుకోవడానికి రెడీ అంటుంది. కానీ, వారంలో పెళ్లి అంటుంది. అప్పుడు రాహుల్ ఏం చేశాడు?
హర్ష (హర్ష నర్రా) ఈవెంట్ ప్లానర్. క్లైంట్స్‌ను సర్‌ప్రైజ్ చేయడం అతని స్టైల్. ఓ కాలేజీకి వెళ్ళినప్పుడు సీఏ స్టూడెంట్ సోనియా (ఖుష్బూ చౌదరి)తో జరిగిన పరిచయం అతని జీవితాన్ని మారుస్తుంది. చదువు మీద కాన్సంట్రేట్ చేయడానికి రొమాన్స్ ఒక్కసారి ట్రై చేయాలని, టెంపరరీ బాయ్‌ఫ్రెండ్ అని హర్షతో కమిట్ అవుతుంది. ఒక్కసారి కాకుండా మళ్లీ మళ్లీ కలుస్తారు. ఫలితం... ప్రెగ్నెన్సీ. ఆ తర్వాత ఏమైంది?
విక్రమ్ అలియాస్ విక్కీ (సుప్రజ్ రంగా) తెలంగాణ కుర్రాడు. తమ ఏరియాలోకి కొత్తగా వచ్చిన శ్వేత (మేఘ లేఖ) కోసం సూర్యను రిక్వెస్ట్ చేసి ఆమెకు జాబ్ వచ్చేలా చేస్తాడు. ఉద్యోగంలో చేరిన తర్వాత శ్వేత ప్రవర్తన మారుతుంది. విక్కీని దూరం పెడుతుంది. తర్వాత ఏమైంది?
సూర్య (తరుణ్ పొనుగోటి) పాపులర్ ఆర్జే. అతనికి దివ్య (నువేక్ష) పెద్ద ఫ్యాన్. ఒక డ్రైవ్ ఇన్ దగ్గర అనుకోకుండా కలుస్తారు. మొదట స్నేహం, తర్వాత లవ్ అండ్ రొమాన్స్ మొదలు అవుతుంది. దివ్య కోసం స్నేహితులు రాహుల్, విక్రమ్, హర్షలను వదిలేసి ఆమె ఫ్లాట్‌కు షిఫ్ట్ అవుతాడు. వాళ్లిద్దరి మధ్య గొడవలు ఎందుకు వచ్చాయి? ఎందుకు దూరం అయ్యారు? తర్వాత ఏమైంది?
రాహుల్, విక్రమ్, సూర్య, హర్ష స్నేహితులు. ఫ్లాట్‌మేట్స్. ప్రేమించిన అమ్మాయిలు దూరమైన నాలుగేళ్లకు కలుస్తారు. అమ్మాయిలకు బుద్ధి చెప్పడానికి వెళతారు. ఆ ప్రయాణంలో చివరకు తెలుసుకున్నది ఏమిటి? అనేది సినిమా.
విశ్లేషణ (Roti Kapada Romance Telugu Movie Review): యూత్‌ఫుల్ సినిమా అంటే రొమాన్స్ ఒక్కటే అని కొందరిలో అభిప్రాయం ఉంది. రొమాంటిక్ సీన్స్ దట్టించి క్యాష్ చేసుకున్న సినిమాలు ఉన్నాయి. దర్శకుడు విక్రమ్ రెడ్డి కేవలం రొమాన్స్‌ను మాత్రమే నమ్ముకోలేదు. కథను నమ్ముకున్నారు. ఈతరం యువత జీవన శైలిని, జీవితాలను గమనించి కథ రాశారని, సినిమా తీశారని అర్థం అవుతుంది. మరి, 'రోటి కపడా రొమాన్స్'లో ప్రేక్షకులు మెచ్చే అంశాలు ఏం ఉన్నాయి? బోర్ కొట్టించేవి ఏం ఉన్నాయి? అంటే...
'రోటి కపడా రొమాన్స్'లో మూమెంట్స్ యూత్ కనెక్ట్ అవుతాయని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా హర్ష - ఖుష్బూ చౌదరి, సుప్రజ్ - మేఘ లేఖ మధ్య సన్నివేశాలకు థియేటర్లలో యూత్ నుంచి విజిల్స్ పడటం గ్యారంటీ. యూత్ అంతా ఆయా సన్నివేశాలకు కనెక్ట్ అవుతారు. ప్రజెంట్ సొసైటీలో జరుగుతున్నది ఇంతేనని అనిపిస్తుంది. 'బేబీ', అంతకు ముందు కొన్ని సినిమాల్లో అమ్మాయిలను విలన్లుగా చిత్రీకరించే సన్నివేశాలకు అబ్బాయిల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. 'రోటి కపడా రొమాన్స్' ఫస్టాఫ్ కూడా సేమ్ రెస్పాన్స్ అందుకుంటుంది. అయితే, దర్శకుడు ఎవరో ఒకరి వైపు మొగ్గు చూపకుండా బ్యాలన్స్ చేయాలని అనుకోవడంతో ఎండింగ్ తడబాటుకు గురైంది.
ఫస్టాఫ్ అంతా అబ్బాయిల సైడ్ తీసుకున్న విక్రమ్ రెడ్డి... సెకండాఫ్ వచ్చేసరికి, మరీ ముఖ్యంగా ఎండింగ్‌లో అమ్మాయిల సైడ్ తీసుకున్నట్లు ఉంటుంది. ఇటు అబ్బాయిలు, అటు అమ్మాయిలకు న్యాయం చేయాలనుకోవడం... సందేశం ఇవ్వాలని అనుకోవడం మంచిదే. అయితే... అది అందరూ హర్షించేలా లేదు. ఫోర్స్డ్ ఎమోషన్ టైపు అనిపించింది. ఫస్టాఫ్ తరహాలో సెకండాఫ్ కూడా తీసి ఉంటే క్రేజీ అండ్ యూత్ ఫిల్మ్ అయ్యేది.
విక్రమ్ రెడ్డి విజువల్ అండ్ మ్యూజికల్ టెస్ట్ 'రోటి కపడా రొమాన్స్'కు బిగ్గెస్ట్ ప్లస్. ప్రతి ఫ్రేమ్ కలర్‌ఫుల్‌గా, రిచ్‌గా ఉంది. చిన్న సినిమా చూస్తున్న ఫీలింగ్ ఎక్కడా కలగదు. సినిమాటోగ్రాఫర్ సంతోష్ రెడ్డిని అప్రిషియేట్ చేయాలి. హర్షవర్ధన్ రామేశ్వర్, ఆర్ఆర్ ధృవన్, వసంత్ జి... ముగ్గురు బాణీలు అందించారు. ప్రతి పాట బావుంది. అలాగే, పిక్చరైజేషన్ కూడా! సన్నీ ఎంఆర్ నేపథ్య సంగీతం సైతం బావుంది. కామెడీ పంచ్ డైలాగ్స్ క్లిక్ కావడంలో హెల్ప్ చేసింది.
Also Read: దేవకీ నందన వాసుదేవ రివ్యూ: మహేష్ బాబు మేనల్లుడు అశోక్ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడానికి కారణాలు ఏంటి?
'కమిటీ కుర్రోళ్ళు' ఫేమ్ సందీప్ సరోజ్, హర్ష నర్రా, తరుణ్ పొనుగోటి, సుప్రజ్ రంగా... హీరోలు నలుగురూ బాగా చేశారు. తరుణ్ హ్యాండ్సమ్ లుక్స్‌తో ఎట్రాక్ట్ చేస్తాడు. నటన కూడా బావుంది. న్యూ ఏజ్ యూత్ పాత్రలకు పర్ఫెక్ట్ యాప్ట్. సుప్రజ్ కామెడీ టైమింగ్ బావుంది. సందీప్, హర్ష నటనతో మెప్పించారు. నువేక్ష, మేఘ లేఖ, ఖుష్బూ చౌదరి, సోనూ ఠాకూర్... నలుగురు హీరోయిన్లు మోడ్రన్ గా కనిపించారు. పాత్రలకు తగ్గట్టు చేశారు. అయితే... ఖుష్బూ చౌదరి ఎక్కువ గుర్తు ఉంటుంది. ఆమె ఫ్రెండ్ రోల్ చేసిన అమ్మాయి బబ్లీగా ఉంది. ఆమె డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ కూడా!
రోటి కపడా రొమాన్స్... ఈ సినిమాలో రొమాన్స్ ఒక్కటే లేదు, మెసేజ్ కూడా ఉంది. ఫ్రెండ్స్ అంతా కలిసి చూడటానికి మంచి ఆప్షన్. ఇది యూత్‌ఫుల్ అండ్ థాట్‌ఫుల్ సినిమా. యువతను మెప్పించే అంశాలతో పాటు ఆలోచింపజేసే విషయం ఉంది. ఫ్రెండ్స్ కలిసి వెళితే ఎంజాయ్ చేయవచ్చు.