Mass Jathara Movie Review - 'మాస్ జాతర' రివ్యూ: గంజాయి బ్యాక్‌డ్రాప్ సినిమా... పోలీసుగా రవితేజ యాక్షన్... ఈ కమర్షియల్ సినిమా హిట్టా? ఫట్టా?
Mass Jathara Review Telugu: మాస్ మహారాజా రవితేజ 75వ సినిమా 'మాస్ జాతర' పెయిడ్ ప్రీమియర్లతో అక్టోబర్ 31వ తేదీ సాయంత్రం విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది? పక్కా కమర్షియల్ హిట్ సాధిస్తుందా?
భాను భోగవరపు
రవితేజ, శ్రీ లీల, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నరేష్ విజయకృష్ణ, హైపర్ ఆది తదితరులు
Ravi Teja's 75th Movie Mass Jathara Review In Telugu: మాస్ మహారాజా రవితేజ 75వ సినిమా 'మాస్ జాతర'. భాను భోగవరపు దర్శకుడిగా పరిచయమైన చిత్రమిది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. 'ధమాకా' తర్వాత రవితేజతో శ్రీ లీల మరోసారి నటించారు. భీమ్స్ సంగీతం అందించిన ఈ సినిమా ఎలా ఉంది?
కథ (Mass Jathara Story): లక్ష్మణ్ భేరి (రవితేజ) రైల్వే పోలీస్. వరంగల్‌లో పని చేసే సమయంలో మినిస్టర్ కొడుకును కొడతాడు. అక్కడ నుంచి అల్లూరి జిల్లాలోని అడవివరం గ్రామానికి ట్రాన్స్‌ఫర్ అవుతాడు. ఆ ప్రాంతమంతా శివుడు (నవీన్ చంద్ర) కంట్రోల్‌లో ఉంటుంది. రైతులతో గంజాయి పండించి కలకత్తాకు ట్రాన్స్‌పోర్ట్ చేయడం అతని పని.
శివుడికి లక్ష్మణ్ భేరి ఎదురు తిరుగుతాడు. జిల్లా ఎస్పీ, ఇతర ప్రభుత్వ అధికారుల మద్దతు ఉన్న శివుడిని కేవలం రైల్వే స్టేషన్ మాత్రమే కంట్రోల్‌లో ఉండే లక్ష్మణ్ భేరి ఏం చేయగలిగాడు? గంజాయి ట్రాన్స్‌పోర్ట్‌ను ఆపగలిగాడా? లేదా? అనేది సినిమా.
అడవి వరంలో అమ్మాయి తులసి (శ్రీ లీల)తో లక్ష్మణ్ భేరి ప్రేమకథలో ట్విస్టులు ఏమిటి? అతనికి పెళ్లి కాకపోవడం వెనుక తాతయ్య (రాజేంద్ర ప్రసాద్) ఎలా కారణం అయ్యారు? చివరిలో ఆయన చేసినది ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Mass Jathara Review Telugu): కమర్షియల్ సినిమాలకు కొన్ని లెక్కలు ఉంటాయి... హీరో ఇంట్రడక్షన్, హీరోయిన్‌తో సాంగ్స్, మాస్ ప్రేక్షకుల్ని మెప్పించే పంచ్ డైలాగ్స్, తన దందాకు అడ్డొచ్చిన వాళ్ళను కనికరం లేకుండా చంపేసే విలన్, అతడిని అంతం చేసే హీరో - ఇలా! స్టార్టింగ్ టు ఎండింగ్ ఆ లెక్కలు ఫాలో అవుతూ తీసిన సినిమా 'మాస్ జాతర'.
'మాస్ జాతర' పక్కా కమర్షియల్ సినిమా. తెలంగాణ యాస నుంచి సడన్‌గా హీరో టర్న్ తీసుకుని మామూలుగా డైలాగులు చెబుతాడు. హీరోయిన్ శ్రీకాకుళం యాసలో డైలాగులు చెబితే తండ్రి సాధారణంగా మాట్లాడతాడు. విలన్ మాటల్లో మధ్యలో రాయలసీమ యాస తొంగి చూస్తుంది. సాంగ్ వచ్చి చాలా సేపు అయ్యింది కనుక స్పేస్ తీసుకుని సాంగ్ తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది. ఇటువంటి మీటర్ సినిమా 'మాస్ జాతర'. ఎందుకిలా వచ్చింది? అని కంప్లయింట్ చేసే ప్రేక్షకులకు అసలు ఎక్కదు. కమర్షియల్ సినిమా ప్రేమికులకు యాక్షన్ సీక్వెన్సులు నచ్చుతాయి.
హీరో చేతిలో విలన్ అంతం కావడం ప్రతి కమర్షియల్ సినిమాలో కామన్ పాయింట్. ఆ జర్నీ ఎంత ఎగ్జైటింగ్‌గా దర్శకుడు చూపించగలిగితే సినిమా అంత హిట్ అవుతుంది. ఇక్కడ ఆ ఎగ్జైట్‌మెంట్ మిస్ అయ్యింది. రవితేజ స్టైలింగ్, ఆయన నుంచి ఫ్యాన్స్ కోరుకునే అంశాలపై దృష్టి పెట్టిన భాను భోగవరపు కథపై అసలు కేర్ తీసుకోలేదు. ఎంత కమర్షియల్ సినిమాకు అయినా సరే కోర్ పాయింట్ ఒకటి ఉంటుంది. ఎమోషనల్ బాండింగ్ కనబడుతుంది. ఈ 'మాస్ జాతర'లో హీరో - తాతయ్య మధ్య ఎమోషనల్ బాండింగ్ పండలేదు. తప్పు చేస్తే తాట తీసే హీరో ప్రేమ విషయంలో ఎందుకు వీక్ అనేది అర్థం కాదు. తాను ప్రేమించిన అమ్మాయి గురించి ఓ నిజం తెలిసినా ఎందుకు చూసీ చూడనట్టు ముందుకు వెళ్ళాడు? మార్చడానికి ఎందుకు ట్రై చేయలేదు? అంటే కమర్షియల్ కథలో చోటు దక్కలేదని సర్ది చెప్పుకోవాలి. కామెడీ సైతం ఆశించిన స్థాయిలో వర్కవుట్ కాలేదు. యాక్షన్ సన్నివేశాల మధ్యలో కథ చిన్నబోయింది.
'మాస్ జాతర'కు మేజర్ స్ట్రెంత్ యాక్షన్ కొరియోగ్రఫీ. ప్రతి ఫైట్ డిజైన్ బావుంది. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో తీసిన పోలీస్ స్టోరీ కావడంతో మాసీగా డిజైన్ చేశారు. ఆ యాక్షన్ సన్నివేశాలకు భీమ్స్ సిసిరోలియో నేపథ్య సంగీతం లౌడ్ అయ్యింది. ఫైట్స్‌లోని బ్యాగ్రౌండ్ స్కోర్‌లో వోకల్స్ ఎక్కువ యూజ్ చేశారు. అది మైనస్ అయ్యింది. సినిమా విడుదలకు ముందు సాంగ్స్ బయట వినిపించాయి. హిట్ అని పేరొచ్చింది. అయితే పాటలకు సరైన ప్లేస్‌మెంట్ లేదు. ప్రొడక్షన్ డిజైన్ బావుంది. నిర్మాతలు చేసిన ఖర్చు తెరపై కనిపించింది. ఎక్కడా తగ్గలేదు, రాజీ పడలేదు.
రవితేజ ఎనర్జీని మ్యాచ్ చేయడం సన్నివేశంలో ఇతర నటీనటులకు కష్టమే. ఫైట్, సాంగ్, సీన్... హుషారుగా చేయడం ఆయన స్టైల్. 'మాస్ జాతర'లోనూ లక్ష్మణ్ భేరి పాత్రలో హుషారుగా చేశారు. స్టైలింగ్ నుంచి డ్యాన్స్, యాక్టింగ్ వరకు ప్రతిదాంట్లో రవితేజ ఎనర్జీ బావుంది. కథలో కీలకమైన క్యారెక్టర్ అని చెప్పలేం గానీ... ఇంతకు ముందు చేసిన పాత్రలతో పోలిస్తే కాస్త వైవిధ్యమైన రోల్ శ్రీ లీలకు లభించింది. శ్రీకాకుళం యాసలో మాట్లాడారు. అయితే నటన కంటే పాటల్లో గ్లామర్ హైలైట్ అయ్యేలా ఉంది. 'సూపర్ డూపర్ హిట్ సాంగ్'లో మరీ సన్నగా కనిపించారు.
శివుడిగా నవీన్ చంద్ర విలనిజం అతని కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్‌లలో ఒకటిగా నిలుస్తుంది. ఇటువంటి క్యారెక్టర్లు చేయడం రాజేంద్ర ప్రసాద్‌కు కొత్త కాదు. హైపర్ ఆది, వీటీవీ గణేష్, అజయ్ ఘోష్ మధ్యలో కొంత నవ్వించే ప్రయత్నం చేశారు. మురళీ శర్మ, నవ్య స్వామి, సముద్రఖని తదితరులు కనిపించారు.
రవితేజ కటౌట్‌కు తగ్గ యాక్షన్ కొరియోగ్రఫీ కుదిరిన సినిమా 'మాస్ జాతర'. ఫైట్స్ ఒక్కటే చాలు, కథతో సంబంధం లేదనుకునే ప్రేక్షకులు - రవితేజ డై హార్డ్ ఫ్యాన్స్ ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా సినిమాకు వెళ్ళవచ్చు. ఇదొక రెగ్యులర్ కమర్షియల్ సినిమా అంతే.
Also Read: 'బాహుబలి ది ఎపిక్' రివ్యూ: రెండు కాదు... ఒక్క సినిమాగా ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిందంటే?





















