Dies Irae Review Telugu - 'డీయస్ ఈరే' రివ్యూ: ప్రణవ్ మోహన్ లాల్ మిస్టరీ హారర్ థ్రిల్లర్... భూతకాలం, భ్రమయుగం దర్శకుడి సినిమా... ఎలా ఉందంటే?
Dies Irae Review In Telugu: మోహన్ లాల్ తనయుడు, మలయాళ 'హృదయం' ఫేమ్ ప్రణవ్ నటించిన మిస్టరీ హారర్ థ్రిల్లర్ 'డీయస్ ఈరే'. 'భూత కాలం', 'భ్రమయుగం' ఫేమ్ రాహుల్ సదాశివన్ దర్శకుడు. ఈ సినిమా ఎలా ఉందంటే?
రాహుల్ సదాశివన్
ప్రణవ్ మోహన్ లాల్, జయ కురుప్, జిబిన్ గోపీనాథ్, అరుణ్ అజికుమార్, సుష్మితా భట్ తదితరులు
Pranav Mohanlal's Dies Irae Movie Review In Telugu: మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ నటించిన తాజా సినిమా 'డీయస్ ఈరే'. 'హృదయం'తో ఆయన ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అది ప్రేమకథ. అయితే... ఇది మిస్టరీ హారర్ థ్రిల్లర్. 'భూతకాలం', 'భ్రమ యుగం' వంటి హారర్ హిట్స్ తీసిన రాహుల్ సదాశివన్ ఈ 'డీయస్ ఈరే'కు దర్శకుడు. నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వై నాట్ స్టూడియోస్ పతాకాలపై చక్రవర్తి రామచంద్ర, ఎస్ శశికాంత్ నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో శ్రీ స్రవంతి మూవీస్ అధినేత రవికిశోర్ విడుదల చేశారు. మలయాళ వెర్షన్ విడుదలైంది. తెలుగు వెర్షన్ నవంబర్ 7న విడుదల కానుంది. ఈ సినిమా ఎలా ఉంది? అంటే...
కథ (Dies Irae Movie Story): రోహన్ (ప్రణవ్ మోహన్ లాల్) ఆర్కిటెక్. తండ్రి పెద్ద వ్యాపారవేత్త. తల్లిదండ్రులు అమెరికాలో ఉంటారు. స్నేహితులతో కలిసి పార్టీలు, సరదాలు అంటూ లైఫ్ లీడ్ చేస్తుంటాడు. ఓ రోజు క్లాస్‌మేట్ కణి (సుష్మితా భట్) ఆత్మహత్య చేసుకుందని తెలుస్తుంది. వాళ్ళింటికి వెళ్లి పరామర్శించి వస్తాడు రోహన్. అప్పట్నుంచి అతని ఇంటికి ఆత్మ వస్తుంది.
కణి ఇంటికి వెళ్లి వచ్చినప్పటి నుంచి ఆమె ఆత్మ తనను వేధిస్తోందనేది రోహన్ ఫీలింగ్. కణి పొరుగింట్లో ఉండే మధు (జిబిన్ గోపినాథ్) సాయం కోరతాడు. రోహన్ ఇంటిలో ఫస్ట్ ఫ్లోర్ నుంచి కణి తమ్ముడు కిరణ్ (అరుణ్ అజికుమార్) కిందకు పడటానికి కారణం ఎవరు? అసలు ఆత్మకు కావాల్సినది ఏమిటి? ఫిలిప్ ఎవరు? చివరకు ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Dies Irae Telugu Review): హారర్ (భయం)ను కామెడీ చేసేసి చాలా రోజులైంది. ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో 'హారర్, కామెడీ'నీ వేరుచేసి చూడలేని పరిస్థితి. ఈ తరుణంలో కేవలం హారర్‌ను నమ్ముకుని సినిమాలు తీసే దర్శక రచయితలు అరుదు. ఆ జాబితాలో రాహుల్ సదాశివన్ ఒకరు. రేవతి 'భూతకాలం', మమ్ముట్టి 'భ్రమ యుగం'తో భయపెట్టారు. ఇప్పుడు మరోసారి 'డీయస్ ఈరే'తో భయపెడతారు. అందులో నో డౌట్.
'వాస్తవంగా జరిగిన ఘటనల ఆధారంగా' - అని టైటిల్ కార్డులో వేశారు దర్శకుడు రాహుల్ సదాశివన్. హారర్ సినిమాకు ట్రూ ఈవెంట్స్ ఏంటి? అని ప్రేక్షకులలో సందేహం కలగడం సహజం. మేజర్ ట్విస్ట్ (చెబితే స్పాయిలర్ అవుతుంది) రివీల్ అయ్యాక... వార్తల్లో అటువంటివి చదివినట్టు గుర్తుకు వస్తుంది. ఆ పాయింట్ చుట్టూ ఆయన అల్లిన కథ బావుంది. అలాగని అందులో కొత్తదనం లేదు. హారర్ అని కాదు గానీ కొన్ని సినిమాల్లో ఆ పాయింట్ చూసినట్టు ఉంటుంది. కథలో కొత్తదనం లేదు గానీ దర్శకుడు తీసిన విధానంలో, నేపథ్య సంగీతంలో అసలు సిసలైన హారర్ ఉంది.
సింపుల్ కథతో 'డీయస్ ఈరే' తీశారు. హారర్ మూమెంట్స్ కూడా ఎక్కువగా లేవు. ఇంటర్వెల్ వరకు అసలు కథలోకి వెళ్ళలేదు. మరణించిన అమ్మాయి ఆత్మ తనను వేధిస్తోందని భావించే కథానాయకుడిని తప్ప మరొకటి చూపించలేదు. కానీ ఏదో జరుగుతుందని భ్రమ కలిగేలా, ఎంగేజ్ చేసేలా కథను ముందుకు తీసుకు వెళ్ళాడు దర్శకుడు. కథ నిదానంగా ముందుకు కదిలినా... కథలోకి తీసుకు వెళ్లడంలో రాహుల్ సదాశివన్ నేర్పు కనిపిస్తుంది. కిరణ్ కిందకు పడిన తర్వాత విజువల్స్ చూస్తే ఒళ్ళు జలదరిస్తుంది. కణి పొరుగింటికి రోహన్ వెళ్లినప్పటి నుంచి చివరి వరకు కళ్లు పక్కకు తిప్పుకోలేం. ఆశ్చర్యంతో కూడిన భయంతో సినిమా చూస్తాం.
Also Read: బైసన్ రివ్యూ: కబడ్డీ, కుల వివక్ష నేపథ్యంలో విక్రమ్ కుమారుడి సినిమా - హిట్టా? ఫట్టా?
'డియాస్ ఇరాయ్'లో ట్విస్ట్ రివీల్ అయ్యాక చివరి 20 నిమిషాలు సీట్ ఎడ్జ్ థ్రిల్ ఇస్తుంది. అందులో మేజర్ క్రెడిట్ సంగీత దర్శకుడు క్రిస్టో గ్జేవియర్ (Christo Xavier)కు ఇవ్వాలి. హారర్ సినిమాల్లో ప్రేక్షకులను భయపెట్టడం కోసం జంప్ కట్స్, షార్ప్ ఎడిట్స్ వంటి టెక్నిక్స్ ఫాలో అవుతారు. ఇందులోనూ అటువంటివి ఉన్నాయి. ఆ సన్నివేశంలో ఏం జరుగుతుందో ఊహించగలిగే ప్రేక్షకులను సైతం భయపెట్టేలా క్రిస్టో నేపథ్య సంగీతం సాగింది. ప్రతి సన్నివేశంలో ఎక్స్‌ట్రాడినరీ డ్యూటీ చేశారు. సినిమాటోగ్రఫీ సైతం చాలా బావుంది. సన్నివేశంలో మూడ్ క్యారీ చేసేలా లైటింగ్ సాగింది. ఫస్టాఫ్ అంతా లావిష్ లుక్, పార్టీ మూడ్ క్రియేట్ చేసిన షెహనాద్ జలాల్ సినిమాటోగ్రఫీ సాగితే... సెకండాఫ్ వచ్చేసరికి లైటింగ్ టోన్ మార్చారు. రాత్రి వేళ సన్నివేశాల్లో లైటింగ్ ప్యాట్రన్ ఆ భయాన్ని క్రియేట్ చేసింది. నిర్మాణ విలువలు బావున్నాయి. టెక్నికల్లీ బ్రిలియెంట్ ఫిల్మ్ & బ్రిలియెంట్ ఫిల్మ్ మేకింగ్.
రోహన్ పాత్రలో ప్రణవ్ మోహన్ లాల్ సెటిల్డ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. క్యారెక్టర్ దాటి బయటకు వెళ్ళలేదు. లుక్స్, స్టైలింగ్ ద్వారా ఇంపాక్ట్ చూపించారు. 'డీయస్ ఈరే' చూసి బయటకు వచ్చాక ప్రేక్షకులు అందరూ జయ కురుప్ నటన, ఆమె సన్నివేశం గురించి తప్పకుండా మాట్లాడతారు. సినిమాలో ఆవిడ సర్‌ప్రైజింగ్ ప్యాకేజ్. అరుణ్ అజి కుమార్, జిబిన్ గోపినాథ్ తమ పాత్రల పరిధి మేరకు చక్కటి నటన కనబరిచారు.
సింపుల్ కథతో తీసిన ఇంప్రెసివ్ మిస్టరీ హారర్ థ్రిల్లర్ 'డీయస్ ఈరే'. నటుడిగా ప్రణవ్ మోహన్ లాల్ (Pranav Mohanlal New Movie Review)ను కొత్తగా చూపించిన చిత్రమిది. సాలిడ్ సౌండ్ డిజైన్, సూపర్బ్ సినిమాటోగ్రఫీ, నెమ్మదిగా కథలోకి తీసుకువెళ్లి భయపెట్టే డైరెక్షన్... వెరసి సీట్ ఎడ్జ్ థ్రిల్ ఇస్తాయి. టెక్నికల్లీ స్ట్రాంగ్ సినిమా. తప్పకుండా చూడాల్సిన సినిమా. హారర్ / థ్రిల్లర్ సినిమా లవర్స్ అయితే అస్సలు మిస్ అవ్వకూడదు.





















