Mr Bachchan Movie Review - మిస్టర్ బచ్చన్ రివ్యూ: రవితేజతో హరీష్ శంకర్ మార్క్ ఎంటర్‌టైనర్ ఎలా ఉందంటే?
Mr Bachchan Review In Telugu: మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు హరీష్ శంకర్ కలయికలో తెరకెక్కిన తాజా సినిమా 'మిస్టర్ బచ్చన్'. పాటలు, ప్రచార చిత్రాలు ఫుల్ హిట్. మరి, సినిమా? రివ్యూలో చూడండి.
హరీష్ శంకర్
రవితేజ, భాగ్యశ్రీ బోర్సే, జగపతి బాబు, సచిన్ ఖేడేకర్, 'చమ్మక్' చంద్ర, హర్ష చెముడు, నెల్లూరు సుదర్శన్ తదితరులు
Ravi Teja and Bhagyashri Borse's Mr Bachchan Movie Review In Telugu: 'మిస్టర్ బచ్చన్' పాటలు, ప్రచార చిత్రాలు చూస్తే... మాస్ మహారాజా రవితేజను అభిమానులు గానీ, ప్రేక్షకులు గానీ ఎలా చూడాలని కోరుకుంటున్నారో ఆ విధంగా చూపించడంలో దర్శకుడు హరీష్ శంకర్ సక్సెస్ అయ్యారనే నమ్మకం కలిగింది. ముఖ్యంగా పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. మరి, సినిమా? హిందీ సినిమా 'రెయిడ్' పాయింట్ తీసుకుని హరీష్ శంకర్ తీసిన కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఎలా ఉంది? అనేది చూడండి.
కథ (Mr Bachchan Movie Story): మిస్టర్ బచ్చన్ (రవితేజ) నిజాయితీపరుడైన ఐటీ (ఇన్ కమ్ టాక్స్) ఉద్యోగి. అతని నిజాయితీకి దక్కిన ఫలితం... సస్పెన్షన్. దాంతో సొంతూరు కోటిపల్లి వస్తాడు. అక్కడ అతనికి కోటిపల్లి కుమార్ సాను అని పేరు. స్నేహితులతో కలిసి ఆర్కెస్ట్రాలో పాటలు పాడతాడు. ఊరిలో జిక్కి (భాగ్య శ్రీ బోర్సే)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె కూడా ప్రేమిస్తుంది. బచ్చన్ మీద సస్పెన్షన్ ఎత్తేస్తారు. దాంతో కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లికి రెడీ అవుతారు. నాలుగు రోజుల్లో పెళ్లి అనగా... ఎంపీ ముత్యం జగ్గయ్య (జగపతి బాబు) మీద రైడ్ చేయాలని ఆర్దర్స్ వస్తాయి.
జగ్గయ్య ఇంటి మీద ఐటీ రైడ్ చేసిన బచ్చన్ ఏం తెలుసుకున్నాడు? రైడ్ జరగడానికి కొన్ని రోజుల ముందు జగ్గయ్య తమ్ముడు, బచ్చన్ మధ్య జరిగిన గొడవ ఏమిటి? ఈ కేసు విషయంలో ఢిల్లీలో ప్రభుత్వ పెద్దలు ఏం చేశారు? చివరకు ఏమైంది? అనేది మిగతా సినిమా.
విశ్లేషణ (Mr Bachchan Review Telugu): ఓ భాషలో విజయవంతమైన సినిమాను మరో భాషలో తీసి హిట్ అందుకోవడం అంత సులభం కాదు. ఉన్నది ఉన్నట్టుగా తీస్తే రీమేక్ అంటారు. మారిస్తే చెదగొట్టారని విమర్శిస్తారు. కానీ, దర్శకుడు హరీష్ శంకర్ ట్రాక్ రికార్డ్ సపరేట్. పరభాషా హిట్ కథలు తీసుకుని మార్పులు, చేర్పులతో సూపర్ హిట్స్ తీసిన ట్రాక్ రికార్డు ఆయన సొంతం. 'రెయిడ్' కథకూ హరీష్ శంకర్ తన మార్క్ టచ్ ఇచ్చారు. రెయిడ్, మిస్టర్ బచ్చన్ సినిమాల మధ్య కామన్ పాయింట్ ఐటీ రెయిడ్ ఒక్కటే. కథ, క్యారెక్టర్లు మార్చేశారు. ఇంటర్వెల్ వరకు అసలు రైడ్ స్టార్ట్ చేయలేదు. కొత్త కథ, సన్నివేశాలు చూపించారు.
'మిస్టర్ బచ్చన్' సినిమాకు వస్తే... రవితేజ, హరీష్ శంకర్ నుంచి ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ కోరుకునే అంశాలు ఉన్నాయి. కథ గురించి ఆలోచించకుండా తెరపై వచ్చే క్యారెక్టర్లు ఎంజాయ్ చేసేలా మొదటి గంట సినిమాను చకచకా ముందుకు నడిపించారు. ఇంటర్వెల్ వరకు సన్నివేశాలు, పాటలు అన్నీ పక్కగా కుదిరాయి. కానీ ఆ తర్వాతే అసలు సమస్య మొదలైంది. రెయిడ్ మొదలయ్యాక కమర్షియాలిటీకి, కథకు మధ్య రచయితలో సంఘర్షణ మొదలైంది. అక్కడ చేసిన చేర్పులు, మార్పులు అంతగా ఆకట్టుకోలేదు. 'చమ్మక్' చంద్ర క్యారెక్టర్ ద్వారా చేసిన కామెడీ పండలేదు. దాంతో రోలర్ కోస్టర్ రైడ్ అన్నట్టు మారింది. సాంగ్స్ బావున్నాయి. కానీ, సెకండాఫ్‌లో సరైన ప్లేస్‌మెంట్స్ పడలేదు.
'మిస్టర్ బచ్చన్'లో మరొక సమస్య... హిందీ పాటలు ఎక్కువ వినిపించడం! సిటీ బేస్డ్ (హైదరాబాద్, వైజాగ్) ప్రేక్షకులకు ఆ పాటలు తెలిస్తే ఓకే. ఒకవేళ ఎవరైనా తెలియని ప్రేక్షకులు ఉంటే? కుమార్ సాను తెలియని వాళ్ళు ఉంటే? వాళ్ళ పరిస్థితి ఏమిటి? హిందీ 'రెయిడ్' చూడని వాళ్లకు 'మిస్టర్ బచ్చన్' నచ్చుతుంది. చూసిన వాళ్లకూ ఫస్టాఫ్‌తో ఎటువంటి సమస్య ఉండదు. అసలు సమస్య అంతా ఇంటర్వెల్ తర్వాత నుంచి! సీరియస్ రెయిడ్ మధ్య కామెడీ ట్రాక్ సెట్ కాలేదు. హరీష్ శంకర్ మార్క్ వర్కవుట్ కాలేదు. చమ్మక్ చంద్ర - రోహిణి - ప్రభాస్ శ్రీను క్యారెక్టర్లు, ఆ ట్రాక్స్ కథతో ట్రావెల్ కాలేదు.
సినిమా విడుదలకు ముందే మిక్కీ జే మేయర్ మ్యూజిక్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. మెలోడీ, మాస్... అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే బాణీలు, సాహిత్యం తీసుకోవడంలో హరీష్ శంకర్ మరోసారి తన మార్క్ చూపించారు. పిక్చరైజేషన్ బావుంది. ముఖ్యంగా మాస్ నంబర్స్ వచ్చినప్పుడు బి, సి సెంటర్ ఆడియన్స్ ఊగిపోవడం ఖాయం. నేపథ్య సంగీతం కూడా బావుంది. పాత పాటలను వాడిన తీరును మెచ్చుకోవాలి. కెమెరా వర్క్ విషయంలో వంక పెట్టడానికి లేదు. అయనాంక బోస్ లైటింగ్, ఆ ప్యాట్రన్ పీరియాడిక్ టచ్ ఇవ్వడంలో హెల్ప్ అయ్యింది. టెక్నికల్ పరంగా సినిమా ఉన్నత స్థాయిలో ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వ ప్రసాద్ ఖర్చుకు వెనుకాడలేదు. ప్రతి రూపాయి తెర మీద కనిపించింది.
Also Read: కమిటీ కుర్రోళ్ళు రివ్యూ: ఆ క్లైమాక్స్ పవన్ కోసమేనా - నిహారిక నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?
రవితేజ హుషారుకు, ఎనర్జీకి తగ్గ క్యారెక్టర్ కుదిరింది. హరీష్ శంకర్ అటువంటి సన్నివేశాలు, మాటలు రాశారు. దాంతో ఫస్టాఫ్ అంతా హుషారుగా సాగింది. రవితేజ డైలాగులను, డ్యాన్సులను ఫ్యాన్స్, ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. సెకండాఫ్ రైడ్ సన్నివేశాల్లో రవితేజ నటనలో, డైలాగ్ డెలివరీలో కమాండ్ చూపించారు. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేకి తెలుగులో తొలి చిత్రమిది. అందంగా కనిపించారు. అంతే అందంగా నటించారు కూడా! రవితేజ, భాగ్య శ్రీ మధ్య సీన్లు బావున్నాయి.
స్వామి రారా సత్యకు మరోసారి మాంచి క్యారెక్టర్ వచ్చింది. ఆయన నటన, డైలాగ్ డెలివరీ బావుంది. సత్య నవ్వించారు. సత్యం రాజేష్, గిరిధర్ తదితరులు హీరో స్నేహితుల బృందంలో అన్నారు. అయితే, తండ్రిగా తనికెళ్ల భరణి, కుమారుడిగా రవితేజ మధ్య చక్కటి సన్నివేశాలు కుదిరాయి. ముత్యం జగ్గయ్య పాత్రలో జగపతి బాబు నటన బావుంది. చమ్మక్ చంద్ర, అన్నపూర్ణమ్మ, రోహిణి తదితరుల పాత్రలు నవ్వించలేదు.
మిస్టర్ బచ్చన్... మాస్ సినిమా! కమర్షియల్ ఫార్మాటులో తీసిన సినిమా! రవితేజ ఎనర్జీ, భాగ్యశ్రీతో ఆయన హుషారుగా వేసిన స్టెప్పులు, ఆ పాటలు... కనువిందుగా ఉన్నాయి. స్వామి రారా సత్య కామెడీ నవ్విస్తుంది. కానీ, ప్రోపర్ కమర్షియల్ థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వదు. హరీష్ శంకర్ నుంచి ప్రేక్షకులు ఎదురు చూసిన సినిమా ఇదేనా? అంతే... పిక్చర్ అభీ బాకీ హై దోస్త్! రవితేజ మాంచి స్టైలిష్ అవతారంలో చాలా రోజుల తర్వాత కనిపించడం, ఆయన శైలి కామెడీ కొంత ఉండటం వల్ల మాస్ మహారాజా అభిమానుల వరకు సినిమా నచ్చుతుంది. మిక్కీ జే మేయర్ పాటలను ప్రత్యేకంగా అభినందించాలి.
Also Read: బృంద రివ్యూ: Sonyliv OTTలో త్రిష వెబ్ సిరీస్ - సౌత్ క్వీన్ ఓటీటీ డెబ్యూ హిట్టా? ఫట్టా?